కాలం చెల్లిన చట్టాలు మనకొద్దు

21 Feb, 2021 04:33 IST|Sakshi
నీతి ఆయోగ్‌ పాలక మండలి సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ

ప్రధాని మోదీ పునరుద్ఘాటన

ఆర్థిక వృద్ధికి కేంద్ర, రాష్ట్రాలు కలిసి పని చేయాలి

ఆంక్షల సడలింపుపై రాష్ట్రాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి

‘ఆత్మనిర్భర్‌ భారత్‌’లో ప్రైవేట్‌ రంగం భాగస్వామ్యానికి అవకాశం 

నీతి ఆయోగ్‌ పాలక మండలి ఆరో సమావేశంలో ప్రధాని

సాక్షి, న్యూఢిల్లీ: కాలం చెల్లిన పురాతన చట్టాలను రద్దు చేయక తప్పదని ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. తద్వారా దేశంలో వ్యాపార, వాణిజ్యాన్ని మరింత సులభతరం చేయొచ్చని అన్నారు. ఆర్థిక వృద్ధిని పరుగులు పెట్టించడానికి కేంద్ర, రాష్ట్రాలు మరింత సన్నిహితంగా కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆత్మనిర్భర్‌ భారత్‌ కార్యక్రమంలో భాగస్వామిగా మారడానికి ప్రైవేట్‌ రంగానికి పూర్తి అవకాశం ఇవ్వాలన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ఆంక్షల సడలింపుపై రాష్ట్రాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు.

శనివారం నీతి ఆయోగ్‌ పాలక మండలి ఆరో సమావేశంలో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభోపన్యాసం చేశారు. దేశ ప్రగతికి ప్రాతిపదిక సహకార సమాఖ్య తత్వమేనని గుర్తుచేశారు. దేశాన్ని పోటీతత్వ సహకార సమాఖ్య దిశగా మళ్లించేందుకు మేధోమథనం చేయడమే ఈ సమావేశ లక్ష్యమని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకారం మరింత పెరగాలని ఆకాంక్షించారు. కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి కృషి వల్లే కరోనా మహమ్మారి గడ్డు పరిస్థితిని దేశం అధిగమించగలిగిందని గుర్తు చేశారు. దేశ అత్యున్నత ప్రయోజనాలే పరమావధిగా నీతి ఆయోగ్‌ సమావేశ ఎజెండాను ఎంపిక చేసినట్లు వెల్లడించా రు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే..

పేదలకు పక్కా ఇళ్లు
‘దేశంలో ప్రతి పేద పౌరుడికీ పక్కా గృహ వసతి కల్పించే ఉద్యమం కొనసాగుతోంది. పట్టణాలు, గ్రామాల్లో 2014 నుంచి ఇప్పటివరకు 2.40 కోట్ల ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. జల్‌జీవన్‌ మిషన్‌ ప్రారంభించాక 18 నెలల్లో∙3.5 లక్షల గ్రామీణ నివాసాలకు నల్లా ద్వారా తాగునీరు అందుబాటులోకొచ్చింది. ఇంటర్నెట్‌తో గ్రామీణ ప్రాంతాల అనుసంధానానికి ఉద్దేశించిన ‘భారత్‌ నెట్‌’ పథకం పెను మార్పులకు మాధ్యమం కానుంది.  
ప్రైవేట్‌ రంగం శక్తిని గౌరవించాలి :
ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌పై సానుకూల ప్రతిస్పందన వ్యక్తమయ్యింది. ఇది దేశం మనోభావాలను బహిర్గతం చేసింది. ఇక సమయం వృథా చేయకుండా వేగంగా ముందడుగు వేయాలన్న దృఢ నిర్ణయానికి దేశం వచ్చింది. ఇండియా ప్రారంభించిన ఈ ప్రగతి ప్రయాణంలో భాగస్వామ్యానికి ప్రైవేట్‌ రంగం కూడా ఉత్సాహంతో ముందుకువస్తోంది. ఈ నవ్యోత్సాహాన్ని, ప్రైవేట్‌ రంగం శక్తిని ప్రభుత్వం తనవంతుగా గౌరవిస్తూ స్వయం సమృద్ధ(ఆత్మ నిర్భర్‌) భారత్‌ ఉద్యమంలో వీలైనంత ఎక్కువ అవకాశాలు సృష్టించాలి. దేశ అవసరాల కోసమే కాకుండా ప్రపంచం కోసం కూడా ఉత్పత్తి చేయగలిగేలా భారత్‌ అభివృద్ధి చెందాలి. ఇందుకు స్వయం సమృద్ధ భారత్‌ ఉద్యమం ఒక మార్గం.

ఆవిష్కరణలకు ప్రోత్సాహం
భారత్‌ వంటి అభివృద్ధి చెందుతున్న దేశ ఆకాంక్షల దృష్ట్యా ఆధునిక మౌలిక సదుపాయాల నిర్మాణం వేగంగా చేపట్టాలి. నవీన ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇవ్వాలి. విద్యా, నైపుణ్య రంగాల్లో మెరుగైన అవకాశాల కల్పన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత ఎక్కువగా వాడుకోవాలి. దేశంలో వ్యాపారాలు, సూక్ష్మ, మధ్య, చిన్నతరహా పరిశ్రమలు(ఎంఎస్‌ఎంఈ), అంకుర సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలోని వివిధ జిల్లాల్లో వాటికే ప్రత్యేకమైన ఉత్పత్తుల తయారీని ప్రోత్సహిస్తున్నాం. ఈ విధానాన్ని మండలాల స్థాయికి విస్తరించాలి. వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ రాష్ట్రాల నుంచి ఎగుమతులను పెంచాలి. వివిధ రంగాల కోసం కేంద్ర ప్రభుత్వం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాన్ని ప్రకటించింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు స్థానిక సంస్థలకు ఆర్థిక వనరులు భారీగా పెరుగుతున్నాయి. స్థానిక పరిపాలన సంస్కరణల్లో సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతోపాటు ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం.

ప్రపంచ దేశాలకు మన ఉత్పత్తులు
విదేశాల నుంచి వంటనూనెల దిగుమతికి ప్రతిఏటా రూ.65,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వాస్తవానికి ఈ సొమ్మంతా మన రైతులకు దక్కాల్సి ఉంది. నూనె గింజల ఉత్పత్తిపై రైతులు దృష్టి పెట్టాలి.  అనేక వ్యవసాయ ఉత్పత్తులను దేశ అవసరాల కోసమే కాకుండా ప్రపంచానికి సరఫరా చేయాలి. ఇది జరగాలంటే ఉత్పత్తులను భారీగా పెంచాలి. ఇందుకోసం అన్ని రాష్ట్రాలు ప్రాంతీయ వ్యవసాయ–వాతావరణ ప్రణాళిక వ్యూహాన్ని రూపొందించుకోవాలి. లాభార్జన కోసం కేవలం ముడి ఆహార పదార్థాలను కాకుండా, వాటి నుంచి రూపొందించిన ఉత్పత్తులను ఎగుమతి చేయాలి’ అని మోదీ అన్నారు. మండలి సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎల్‌జీలు, కేంద్ర మంత్రులు,  ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

పాలక మండలి చైర్మన్‌గా ప్రధాని మోదీ
నీతి ఆయోగ్‌ పాలక మండలిని కేంద్రం పునర్‌వ్యవస్థీకరించింది. పాలక మండలి చైర్మన్‌గా ఇకపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహరిస్తారు. సీఎంలు, కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూకశ్మీర్, ఢిల్లీ, పుదుచ్చేరి ప్రతినిధులు పాలక మండలిలో ఫుల్‌టైమ్‌ సభ్యులుగా ఉంటారు. అండమాన్‌ నికోబార్‌ దీవులు, లద్దాఖ్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్లు ప్రత్యేక ఆహ్వానితులుగా పనిచేస్తారు.
ప్రతిభ మనది..

ఉత్పత్తి మనది కాదు
‘నేను ఇటీవల ఐటీ రంగంలోని వ్యక్తులతో మాట్లాడా. తమలో 95 శాతం మంది ఇప్పుడు ఇంటినుంచే పని చేస్తున్నారని, ఉత్పాదకత పెరిగిందని చెప్పారు. నిబంధనల్లో సంస్కరణలు తేవడం వల్లే ఇది సాధ్యమైంది. జియో స్పేషియల్‌ డేటాకు సంబంధించిన నియమాలను కూడా సరళీకృతం చేశాం. పదేళ్ల క్రితమే చేయగలిగితే.. బహుశా గూగుల్‌ వంటివి భారతదేశం వెలుపల నిర్మితమయ్యేవి కావు. మన ప్రజలకు ప్రతిభ ఉంది, కానీ వారు తయారు చేసిన ఉత్పత్తి మనది కాదు’ అని అన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు