రొటీన్‌గా చెయ్యాలని అనుకోవడం లేదు..

30 Aug, 2021 04:45 IST|Sakshi

సృజనాత్మకంగా యువత ఆలోచనలు

కోవిడ్‌ విజృంభిస్తున్న వేళ... స్వచ్ఛ భారత్‌ అత్యంత అవసరం

మన్‌కీ బాత్‌లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు 

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 విజృంభిస్తున్న ఈ సమయంలో దేశ ప్రజలందరూ కచ్చితంగా స్వచ్ఛ భారత్‌ పాటించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇప్పటివరకు 62 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ జరిగిందని అయినప్పటికీ అందరూ ఈ మహమ్మారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హితవు పలికారు.

ప్రతీ నెల చివరి ఆదివారం ఆకాశవాణిలో మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రధాని ఆదివారం 80వ ఎపిసోడ్‌లో మాట్లాడారు. స్వచ్ఛభారత్‌ అనగానే అందరికీ ఇండోర్‌ నగరమే మదిలోకి వస్తుందని, పరిశుభ్ర నగరంగా తీర్చిదిద్దడంతో ఈ నగర ప్రజలు సంతృప్తి చెందలేదన్నారు. నీటి సంరక్షణలో కూడా అద్భుతాలు సాధించి దేశంలోనే తొలి వాటర్‌ ప్లస్‌ నగరంగా ఆవిర్భవించిందని అన్నారు.  

యువతరం మారుతోంది  
దేశంలో యువత ఏదో ఒకటి రొటీన్‌గా చెయ్యాలని అనుకోవడం లేదని, ఎంత రిస్క్‌ అయినా తీసుకుంటున్నారని ప్రధాని అన్నారు. వారి ఆలోచన దృక్పథంలో ఎంతో మార్పు వచ్చిందని, ఏదైనా సృజనాత్మకంగా చేయాలని భావిస్తున్నారని చెప్పారు. భారతదేశంలో స్టార్టప్‌ సంస్కృతి చాలా శక్తివంతమైనదిగా మారిందని, చిన్న నగరాల్లోని యువకులూ స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నారని మోదీ అన్నారు. ఇది దేశ ఉజ్వల భవిష్యత్తుకు సంకేతమని తెలిపారు.

టోక్యో ఒలింపిక్స్‌లో హాకీ టీమ్‌ సాధించిన విజయాన్ని ఆయన కొనియాడారు. ‘‘ఇవాళ మేజర్‌ ధ్యానచంద్‌ జయంతి. ఆయన స్మృత్యర్థం జాతీయ క్రీడాదినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఒలింపిక్స్‌లో గెలుచుకున్న ప్రతీ పతకం ఎంతో విలువైనది. హాకీలో పతకం కొట్టగానే దేశమంతా ఉప్పొంగిపోయింది. మేజర్‌ ధ్యాన్‌చంద్‌జీ కూడా సంతోష పడే ఉంటారు’’అని వ్యాఖ్యానించారు. క్రీడారంగంలో యువత ఎన్నో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారని, స్టార్టప్‌ల ఏర్పాటులో తలమునుకలై ఉన్నారని కొనియాడారు.  

సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుదాం
భారత సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో ఉన్నతమైనవని, యావత్‌ ప్రపంచం వాటికే దాసోహం అంటోందని ప్రధాని అన్నారు. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని చెప్పారు.  ‘‘సంస్కృతం చాలా సులభంగా.. ఎంతో తియ్యగా ఉంటుంది. విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది. జాతీయ ఐక్యతను కాపాడుతుంది’’అని పేర్కొన్నారు. థాయ్‌లాండ్, ఐర్లాండ్‌ దేశాల్లో సంస్కృతానికి ప్రాచుర్యం కల్పించడానికి ఎందరో కృషి చేస్తున్నారని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు