శాస్త్రవేత్తల విజయాలను గుర్తించాలి

11 Sep, 2022 05:22 IST|Sakshi

పరిశోధన, ఆవిష్కరణల్లో గ్లోబల్‌ సెంటర్‌గా ఇండియా: మోదీ

అహ్మదాబాద్‌: పరిశోధన, ఆవిష్కరణల్లో భారత్‌ను ప్రపంచానికి కేంద్ర స్థానంగా మార్చేందుకు కృషి చేయాలని సైంటిస్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో పురోగతి కోసం ఆధునిక విధానాలు రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. పశ్చిమ దేశాల్లో సైంటిస్టుల కృషికి తగిన గుర్తింపు లభిస్తుందని, మన దేశంలో మాత్రం అలాంటి పరిస్థితి లేకుండాపోయిందని విచారం వ్యక్తం చేశారు. మన శాస్త్రవేత్తలు సాధించిన విజయాలను మనం గుర్తించడం లేదని అన్నారు. భారత శాస్త్రవేత్తల విజయాలు, ఘనతలను గుర్తించి, సెలబ్రేట్‌ చేసుకోవాల్సిన అవసరముందన్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో శనివారం ప్రారంభమైన సెంటర్‌–స్టేట్‌ సైన్స్‌ సదస్సులో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రసంగించారు.

స్థానిక సమస్యలకు స్థానిక పరిష్కారాలు  
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ రంగంలో మన పరిశోధనలను స్థానిక స్థాయికి తీసుకెళ్లాలని మోదీ చెప్పారు. పరిశోధన, ఆవిష్కరణల్లో మన దేశాన్ని గ్లోబల్‌ సెంటర్‌గా మార్చడానికి కలిసి పనిచేయాలన్నారు. విద్యా సంస్థల్లో ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ల సంఖ్య భారీగా పెరగాలన్నారు. ‘‘2015లో గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ ర్యాంకింగ్‌లో భారత్‌ స్థానం 81. కేంద్రం కృషి వల్లే ఇప్పుడు 46కు చేరింది. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీలో విద్యార్థులకు మాతృభాషల్లో బోధించేలా ప్రయత్నాలు జరగాలి. ప్రపంచస్థాయి ప్రయోగశాలల ఏర్పాటుకు రాష్ట్రాలు ముందుకొస్తే కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా సహకరిస్తుంది’’ అని ప్రధాని చెప్పారు.
 

మరిన్ని వార్తలు