కరోనా విజృంభణ ప్రధాని మోదీ కీలక నిర్ణయం

22 Apr, 2021 23:06 IST|Sakshi

న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రంగంలోకి దిగనున్నారు. మొన్న జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణ చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ కల్లోలం సృష్టిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగనుంది. దేశవ్యాప్తంగా రోజుకు మూడు లక్షలకు పైగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ప్రధాని కట్టడి చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా కరోనా బాధితులకు వైద్య సేవలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. కేసులు పెరుగుదలతో ఉన్న వైద్య సేవలు చాలడం లేదు. దీంతో వైరస్‌ బాధితులు ఆస్పత్రుల్లో బెడ్లు చాలడం లేదు.. ఆక్సిజన్‌ కొరత తీవ్రంగా ఉంది. ఆక్సిజన్‌ లేక ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితులు ఉండడంతో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వ్యాక్సిన్‌ కొరత, వైద్య సదుపాయాల అరకొరగా ఉండడంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇక రంగంలోకి దిగారు. 

ఈ నేపథ్యంలోనే ఉన్న అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకుని శుక్రవారం కేవలం కరోనా సెకండ్‌ వేవ్‌పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టి సారించనున్నారు. దేశవ్యాప్తంగా ఆక్సిజన్‌ లభ్యత కొరత ఉండడంతో పారిశ్రామికవేత్తలతో చర్చలు చేయనున్నారు. ఆక్సిజన్‌ ఉత్పత్తి పెంచడంతో పాటు సరఫరా చేసేందుకు వ్యాపారవేత్తలతో చర్చించనున్నారు. ఈ మేరకు వారికి ఆదేశాలు జారీ చేయనున్నారు. అంతకుముందు ఉదయం 9 గంటలకు కరోనా ఉధృతిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. 

అనంతరం ఉదయం 10 గంటలకు కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ సమీక్ష చేయనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆక్సిజన్‌ ఉత్పత్తి చేసే సంస్థలతో సమావేశం కానున్నారు. వీటి కోసం ప్రధానమంత్రి పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల ప్రచార సభను రద్దు చేసుకున్నారు. కరోనా పరిస్థితిన సమీక్షించడానికి బెంగాల్‌ పర్యటనను రద్దు చేసుకుంటున్నట్లు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విటర్‌ వేదికగా తెలిపారు.
 

చదవండి: ఆకాశంలో యుద్ధం మొదలైందా?

మరిన్ని వార్తలు