Narendra Modi: భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం కండి!

21 May, 2021 05:27 IST|Sakshi

పిల్లలు, యువతపై కరోనా ప్రభావాన్ని రికార్డ్‌ చేయండి

టీకా వృథాను అరికట్టండి

క్షేత్రస్థాయి అధికారులకు ప్రధాని మోదీ దిశానిర్దేశం

న్యూఢిల్లీ: పిల్లలు, యువతలో కరోనా వైరస్‌ వ్యాప్తిని, వారిపై దాని ప్రభావాన్ని, తీవ్రతను నిశితంగా పరిశీలించి, రికార్డు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారులను కోరారు. దేశంలో కరోనా వైరస్‌ ఉన్నంతవరకు, అది ఎంత తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ.. కోవిడ్‌ 19 సవాలు కొనసాగుతుందని హెచ్చరించారు. కరోనా ముప్పుపై దేశవ్యాప్తంగా జిల్లాల కలెక్టర్లు, క్షేత్రస్థాయి ఉన్నతాధికారులతో ప్రధాని గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

వైరస్‌లో కొత్త కొత్త మ్యుటేషన్ల కారణంగా ముందుముందు చిన్న పిల్లలపై పెను ప్రభావం పడనుందని పలు వర్గాల నుంచి వ్యక్తమవుతున్న ఆందోళనలను ఆయన వారితో పంచుకున్నారు. దీనికి సంబంధించిన గణాంకాలను ఆయా జిల్లాల్లో అధికారులు సిద్ధం చేసుకోవాలన్నారు. వాటిని విశ్లేషించి, భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని ఆదేశించారు.

గ్రామాలు, పట్టణాలు, నగరాల వారీగా డేటాను సమకూర్చుకుని, విశ్లేషించుకోవాలన్నారు. గత కొన్ని రోజులుగా యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడాన్ని ప్రస్తావిస్తూ.. ప్రజలంతా కోవిడ్‌ నిబంధనలను కచ్చితంగా పాటించేలా చూడాలని సూచించారు. గతంలో కేసులు తగ్గుముఖం పట్టగానే.. ప్రజల్లో నిర్లక్ష్యం పెరిగి, జాగ్రత్తలు తీసుకోకపోవడాన్ని ప్రధాని గుర్తు చేశారు. కరోనాను ఎదుర్కొనే విషయంలో ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.

కేసులు తగ్గడం ప్రారంభం కాగానే, ముప్పు తొలగిందని భావించకూడదని, వైరస్‌ ఉన్నంతవరకు ఈ సవాలు కొనసాగుతూనే ఉంటుందని వ్యాఖ్యానించారు. ఈ మహమ్మారి అధికారుల విధులు, బాధ్యతలను మరింత విస్తృతం, క్రియాశీలం చేసిందన్నారు. అప్పటికప్పుడు కొత్త వ్యూహాలు, ప్రణాళికలు, పరిష్కారాలను సిద్ధం చేసుకోవాల్సిన సవాళ్లతో కూడిన పరిస్థితి నెలకొందన్నారు. వైరస్‌లో ఏర్పడుతున్న ఉత్పరివర్తనాలను ప్రస్తావిస్తూ.. ఇది ధూర్త, బహురూప వైరస్‌ అని వ్యాఖ్యానించారు. దాన్ని ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు వినూత్న వ్యూహాలను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుందన్నారు.  

గడిచిన వందేళ్లలో ఇది అతిపెద్ద విపత్తు
రాష్ట్రాలు, ఇతర సంబంధిత వర్గాల నుంచి తీసుకున్న సలహాలను పరిగణనలోకి తీసుకుని, టీకాల లభ్యత, పంపిణీ గురించి పక్షం రోజుల ముందే కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సమాచారం ఇస్తోందని తెలిపారు. ఆ సమాచారం ఆధారంగా ప్రజలకు టీకాలు ఇచ్చే విషయంలో ప్రణాళిక సిద్ధం చేసుకోవచ్చన్నారు. భవిష్యత్తులో పెద్ద మొత్తంలో టీకాలను పంపిస్తామన్నారు. టీకాల వృథాను సాధ్యమైనంతగా అరికట్టాలని సూచించారు.

వృథా అయ్యే ప్రతీ డోసు ఒక ప్రాణాన్ని నిలబెట్టేంత విలువైనదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. గ్రామాలను కరోనా రహితంగా చేసేందుకు అధికారులంతా కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ‘గత వందేళ్లలో అతిపెద్ద విపత్తు ఇది. అందుబాటులో ఉన్న వనరులతోనే అద్భుతంగా కృషి చేసి, ఈ విపత్తును ఎదుర్కొంటున్నారు’ అని అధికారులను ప్రధాని ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హరియాణా, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్తాన్, యూపీ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాల నుంచి అధికారులు ఈ వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు