ప్రజలకు అందుబాటులో ఉండండి

1 May, 2021 05:19 IST|Sakshi

వారి సమస్యలు తెలుసుకుని, పరిష్కరించండి

మంత్రివర్గ సహచరులకు ప్రధాని మోదీ నిర్దేశం

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 తీవ్రంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రమంత్రులంతా ప్రజలకు అందుబాటులో ఉండాలనీ, వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ వారికి సాయం చేయాలని ప్రధాని మోదీ కోరారు. తమతమ ప్రాంతాల్లో స్థానిక సమస్యలను గుర్తించి, పరిష్కరించాల్సిన అవసరం ఉందని వారికి తెలిపారు. దేశంలో కోవిడ్‌–19 సెకండ్‌ వేవ్‌తో తలెత్తిన పరిస్థితులపై చర్చించేందుకు శుక్రవారం ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ భేటీ వర్చువల్‌గా జరిగింది. సెకండ్‌ వేవ్‌ తర్వాత జరిగిన మొట్టమొదటి మంత్రివర్గ సమావేశం ఇది. ప్రపంచానికే సవాల్‌గా మారిన ఈ మహమ్మారి శతాబ్దంలోనే అతిపెద్ద సంక్షోభమని ఈ సమావేశం అభిప్రాయపడింది.

‘ఈ అత్యవసర పరిస్థితుల్లో అవసరాలకు అనుగుణంగా ఆస్పత్రుల్లో బెడ్ల సంఖ్య పెంపు, ఆక్సిజన్, ఇతర అత్యవసర ఔషధాల లభ్యత వంటి వాటిపై చర్చించింది. కరోనా సంక్షోభంతో ఎక్కువగా ఇబ్బందులు పడుతున్న పేదలకు ఉచితంగా ఆహారధాన్యాలను పంపిణీ చేయడం, జన్‌ధన్‌ ఖాతాదారులకు ఆర్థికంగా సాయం చేయడం వంటివాటిపైనా మంత్రులకు వివరాలు అందించారు. దేశవ్యాప్తంగా ప్రజలకు ఇప్పటి వరకు 15 కోట్ల టీకా డోసుల పంపిణీ జరగ్గా, ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు టీకాలు కోవాగ్జిన్, కోవిషీల్డ్‌కు తోడుగా మరికొన్ని టీకాలు అనుమతుల మంజూరు వంటి వివిధ దశల్లో ఉన్న విషయం వివరించారు. నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌.. ఈ సందర్భంగా మంత్రులకు కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌పై పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. అనంతరం కేంద్ర మంత్రులు పియూష్‌ గోయెల్, మన్సుఖ్‌ మాండవీయ ప్రస్తుతం ఆక్సిజన్, ఔషధాల అందుబాటుపై సహచర మంత్రులకు వివరించారని ప్రధాని కార్యాలయ వర్గాలు శుక్రవారం తెలిపాయి.

మరిన్ని వార్తలు