పట్టణ శ్రేయస్సు ముఖ్యం 

21 Sep, 2022 05:40 IST|Sakshi

సమగ్ర ప్రణాళిక అవసరం

గెలుపే లక్ష్యంగా పని చేయొద్దు

బీజేపీ మేయర్ల సదస్సులో మోదీ

గాంధీనగర్‌: ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యవహరిస్తే పట్టణాభివృద్ధి జరగదని, పట్టణాల శ్రేయస్సు గురించి ఆలోచించాలని  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పట్టణాల అభివృద్ధికి స్థానిక సంస్థలు సమగ్ర ప్రణాళికతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గాందీనగర్‌లో మంగళవారం బీజేపీ పాలిత నగరాల మేయర్ల అఖిల భారత సదస్సును ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించి ప్రసంగించారు.

ఈ రెండు రోజుల సదస్సులో 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 118 మంది మేయర్లు, డిప్యూటీ మేయర్లు పాల్గొన్నారు. అర్బన్‌ ప్లానింగ్, శాటిలైట్‌ నగరాలు, టైర్‌–2, టైర్‌–3 నగరాల నిర్మాణంపై దృష్టి సారిస్తే మెట్రో నగరాలపై జనాభా భారాన్ని తగ్గించవచ్చన్నారు. పట్టణాల సుందరీకరణ, నిరుపేదలకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయో లేదో అనే అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రధాని మేయర్లను కోరారు. ‘‘ఎన్నికల్లో కేవలం గెలుపు మాత్రమే మీ లక్ష్యం కాకూడదు.

అలా వ్యవహరిస్తే మీ ఊళ్లు అభివృద్ధి చెందవు. పట్టణాల శ్రేయస్సుని దృష్టిలో ఉంంచుకోవాలి. అలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే  ఎన్నికల్లో ఓడిపోతారు’’ అని ప్రధాని మోదీ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడకుండా పట్టణాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చి ప్రణాళికలు రూపొందించాలని ప్రధాని అన్నారు.

దేశవ్యాప్తంగా కేంద్రం 100 స్మార్ట్‌ సిటీలను అభివృద్ధి చేస్తోందని ఇప్పటివరకు రూ.75 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు పూర్తయ్యాయని అన్నారు. ప్రతీ పట్టణానికి ఓ ఘనమైన చరిత్ర ఉంటుందని, అది ప్రతిబింబించేలా మ్యూజియంలు ఏర్పాటు చేయాలని మోదీ మేయర్లతో చెప్పారు.   

మరిన్ని వార్తలు