నాకు పేరొస్తుందనే.. మోదీ ధ్వజం

19 Dec, 2020 03:41 IST|Sakshi

అందుకే వారంతా సాగు సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారు

విపక్షాలపై మోదీ ధ్వజం

మండీలు, ఎమ్మెస్పీ కొనసాగుతాయని పునరుద్ఘాటన

భోపాల్‌: వ్యవసాయ ఉత్పత్తులకు ప్రభుత్వం కల్పించే కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) విధానం కొనసాగుతుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. ప్రస్తుతం దేశంలో సాగు సంస్కరణల అవసరం ఎంతో ఉందన్నారు. కొత్త సాగు చట్టాలు ఎన్నాళ్లుగానో రాజకీయ పార్టీలు, వ్యవసాయ రంగ నిపుణులు, రైతులు కోరుతున్నవేనని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఈ సంస్కరణలు తీసుకువచ్చిన పేరు మోదీకి దక్కుతుందనే బాధతోనే విపక్ష పార్టీలు నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

ఈ సంస్కరణలకు గతంలో ఆయా పార్టీలు మద్దతిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. మధ్యప్రదేశ్‌కు చెందిన రైతులను ఉద్దేశించి శుక్రవారం ప్రధాని మోదీ వర్చువల్‌ విధానంలో ప్రసంగించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశ రాజధాని సరిహద్దుల్లో రైతులు గత 23 రోజులుగా ధర్నా చేస్తున్న విషయం తెలిసిందే. నిరసన తెలుపుతున్న రైతులతో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉందని ప్రధాని స్పష్టం చేశారు. ‘ఈ చట్టాలపై ఎవరికైనా, ఎలాంటి అనుమానాలు, అభ్యంతరాలు ఉన్నా.. తలవంచి, చేతులెత్తి దండం పెడ్తూ చర్చలు జరిపేందుకు, వారి అనుమానాలను నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ చట్టాలు రాత్రికి రాత్రి రూపొందించినవి కావు. ఎప్పటినుంచో రైతులు, నిపుణులు, రాజకీయ పార్టీలు కోరుతున్నవే ఈ సంస్కరణలు’ అని పేర్కొన్నారు.

‘సాగు రంగం, రైతులు ఇంకా వెనకే ఉండిపోవడానికి వీల్లేదు. వారు అన్ని సదుపాయాలతో ఆధునికతను సంతరించుకోవాలి. ఈ విషయంలో ఇంకా ఆలస్యం కూడదు. సమయం ఎవరికోసం ఆగదు’ అని ప్రధాని ఉద్ఘాటించారు. గతంలో సాగు సంస్కరణలు తీసుకువస్తామని మేనిఫెస్టోల్లో పెట్టి, అధికారంలోకి వచ్చిన తరువాత ఆ విషయాన్ని మర్చిపోయిన వారిని రైతులు ప్రశ్నించాలన్నారు. నాడు అధికారంలో ఉన్నవారికి అది ప్రధాన విషయం కాదని విమర్శించారు. ‘ఇది మోదీ ఎలా చేయగలిగారు? ఈ మంచిపేరంతా మోదీకే వస్తే ఎలా? అనేదే వారి ప్రధాన సమస్య. ఈ విషయంలో మంచిపేరు నాకు అక్కర్లేదు. ఆ క్రెడిట్‌ మీ మేనిఫెస్టోలకే ఇవ్వండి. ఈ సంస్కరణలు మీ మేనిఫెస్టోల్లోనే ఉన్నాయి. నాకు కావల్సింది రైతుల అభివృద్ధి మాత్రమే.

ఇకనైనా రైతులను తప్పుదోవ పట్టించడం ఆపేయండి’ అని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ‘కొత్త చట్టాలపై మీ అభ్యంతరాలేమిటో చెప్పమని పదేపదే అడుగుతున్నాం. వారి వద్ద సమాధానం లేదు. దేశవ్యాప్తంగా రాజకీయ ప్రాధాన్యతను కోల్పోతున్న వారే.. ఇప్పుడు కొత్త చట్టాలతో భూమిని కోల్పోతారని రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు’ అని ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ‘వ్యవసాయ సంస్కరణలకు సంబంధించి స్వామినాథన్‌ కమిటీ ఇచ్చిన నివేదికపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఏళ్లకేళ్లు అధికారంలో గడిపారు’ అని విపక్ష కాంగ్రెస్‌పై  మండిపడ్డారు. 25, 30 ఏళ్ల క్రితమే తీసుకురావాల్సిన సంస్కరణలను తాము ఇప్పుడు తీసుకువచ్చామన్నారు.

రైతన్నలను తాము అన్నదాతలుగా భావిస్తామని, ఇప్పటికే ఎమ్మెస్పీ ద్వారా దిగుబడి వ్యయం కన్నా ఒకటిన్నర రెట్లు ఆదాయం రైతులకు అందిస్తున్నామని తెలిపారు.  ‘కొత్త వ్యవసాయ చట్టాలు అమల్లోకి వచ్చి ఆరు నెలలు గడచిపోయాయి. కోవిడ్‌–19 సమయంలోనూ వ్యవసాయ ఉత్పత్తులను, గతంలో వారు తమ ఉత్పత్తులను అమ్ముకునే మండీల్లోనే, కనీస మద్దతు ధరకే కొనుగోలు చేశాం’ అని గుర్తు చేశారు. ‘ఎమ్మెస్పీ విధానాన్ని రద్దు చేస్తారంటే తెలివైన వ్యక్తి ఎవరూ నమ్మరు. ఇంతకంటే పెద్ద కుట్ర, అబద్ధం ఉండదు’ అని వ్యాఖ్యానించారు. వ్యవసాయ మార్కెట్ల విషయంలోనూ అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. ‘కొత్త చట్టం ప్రకారం, వ్యవసాయ మార్కెట్‌ సహా ఎక్కడ ఎక్కువ ధర లభిస్తే రైతు అక్కడ తమ ఉత్పత్తులను అమ్ముకోవచ్చు’ అని వివరించారు. గత ఆరు నెలల్లో ఒక్క మండీ కూడా మూతపడలేదని, మండీల ఆధునీకరణకు రూ. 500 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. సాగు చట్టాలపై 25న రైతులతో మళ్లీ మాట్లాడుతానన్నారు.   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు