రాష్ట్రాలకు నెట్టేసి నోరు మెదపని ప్రధాని మోదీ

11 May, 2021 21:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి విజృంభణతో దేశమంతా అల్లకల్లోల పరిస్థితి ఏర్పడింది. సెకండ్‌ వేవ్‌ ఉధృతి తీవ్రస్థాయిలో ఉండడంతో రాష్ట్రాలు కంటి మీద కునుకు లేకుండా అప్రమత్తంగా ఉన్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం కరోనా విషయంలో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తోందని విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. దీనిపై జాతీయ మీడియాలో కూడా తీవ్ర చర్చ సాగుతోంది. తాజాగా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు తమకు తాము లాక్‌డౌన్‌ ప్రకటించుకున్నాయి. ఇంచుమించు 18 రాష్ట్రాలు లాక్‌డౌన్‌, ఇక మిగతా రాష్ట్రాలు పాక్షిక లాక్‌డౌన్‌, వారాంతపు లాక్‌డౌన్‌, కర్ఫ్యూ వంటి చర్యలు చేపట్టాయి. 

తాజాగా తెలంగాణ, నాగాలాండ్‌ లాక్‌డౌన్‌ ప్రకటించడంతో దాదాపు దేశమంతా తాళం పడింది. కరోనా కట్టడికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. సహాయం చేయాలని గగ్గోలు పెడుతున్నాయి. అయినా కూడా కేంద్రంలో స్పందన లేదని దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. బీజేపీ, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు కూడా కేంద్రంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని పలువురు ఉదహరిస్తున్నారు. అయితే ప్రధాని మాత్రం జాతినుద్దేశించి ఓ ప్రసంగం చేసి గమ్మున ఉన్నారని పేర్కొంటున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్‌ 20వ తేదీన జాతినుద్దేశించి మాట్లాడారు. ఆ ప్రసంగంలో కరోనా కట్టడిపై ఏదైనా ప్రకటన చేస్తారని దేశ ప్రజానీకం ఆశించగా.. ఎలాంటి ప్రకటన చేయకుండా కొన్ని సలహాలు ఇచ్చి ముగించారు. వాటితో పాటు ‘కరోనా కట్టడి చర్యలు రాష్ట్రాలే తీసుకోవాలి’ అని ఒక మాట అనేసి చేతులు దులిపేసుకున్నారని సర్వత్రా వినిపించిన మాట. అప్పటి నుంచి అదే మాదిరి కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైనప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని ప్రతిపక్షాలతో పాటు మేధావులు, జాతీయ మీడియా కూడా విమర్శిస్తోంది. అయినా కూడా కేంద్రంలో ఎలాంటి మార్పు రాలేదని మనం చూస్తూనే ఉన్నామని విశ్లేషకులు చెబుతున్నారు. సెకండ్‌ వేవ్‌ మొదలై దాదాపు రెండు నెలలు గడుస్తున్నా కేంద్రం సరైన చర్య తీసుకోలేదని అంతర్జాతీయంగా కూడా విమర్శలు వస్తున్నాయి. 

అరకొర వైద్య సేవలు, ఆక్సిజన్‌ కొరత, వ్యాక్సిన్‌ వంటి విషయంలో కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో నిరాశ ఫలితాలు ఎదురవడం వంటి అంశాల నేపథ్యంలో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ వైపు కేంద్రం మొగ్గు చూపలేదని అందరికీ తెలిసిన రహాస్యమే. రాష్ట్రాల ఇష్టం అని ఒక మాట చెప్పేసి ప్రధాని నిశ్శబ్దంగా ఉన్నారు. ప్రధాని మౌనం దేశానికి శాపంగా మారిందని.. నోరు విప్పి ప్రజలకు కొంత భరోసా కలిగించే చర్యలు తీసుకోవాలని ప్రజలతో పాటు ప్రతిపక్షాలు కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రాలు, ప్రజలు ఏదో ఒకటి వస్తుందని కొన్ని రోజులుగా ఎదురుచూస్తున్నాయి. లాక్‌డౌన్‌ లేకపోయినా ఆక్సిజన్‌, వ్యాక్సిన్‌ కొరత లేకుండా చూడాలని.. వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

రాష్ట్రాలకు కేంద్రం సహకారించాలని సర్వత్రా వస్తున్న విజ్ఞప్తి.  గతేడాది కన్నా దారుణంగా ప్రస్తుతం కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడుతున్నారు. కానీ ప్రధాని మాత్రం సీఎంలతో ఫోన్‌లలో మాట్లాడడం మినహా ఏమీ చేయడం లేదని ప్రజల్లో బలమైన అభిప్రాయం ఏర్పడింది. మరొకసారి ముఖ్యమంత్రులతో సమావేశమై.. ఆక్సిజన్‌, వ్యాక్సిన్‌లపై చొరవ తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రధాని మోదీ వైఖరిలో మార్పు వస్తుందో లేదో వేచి చూడాలని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఒక భరోసా కల్పించే మాట కేంద్రం నుంచి రావాలని ప్రజలు ఆశిస్తున్నారు.

చదవండి:
ఏం చేయలేం: వ్యాక్సిన్‌పై చేతులెత్తేసిన ఢిల్లీ

కరోనా డబ్బులతో జల్సాలు.. విలాసమంటే నీదే రాజా

మరిన్ని వార్తలు