ప్రధాని మోదీ కంటతడి

22 May, 2021 05:09 IST|Sakshi

కరోనా మరణాలపై భావోద్వేగం

దగ్గరివారిని కోల్పోయామని ఆవేదన

పేషెంట్ల వద్దకే వైద్య సేవలు వెళ్లాలని సూచన

వారణాసి/లక్నో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కంటతడి పెట్టుకున్నారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య యోధులతో సమావేశం సందర్భంగా.. వైరస్‌తో ప్రాణాలు కోల్పోయినవారిని గుర్తు చేసుకుంటూ ప్రధాని భావోద్వేగానికి లోనయ్యారు. తన లోక్‌సభ నియోజకవర్గం వారణాసిలోని వైద్యులు, వైద్య సిబ్బందితో శుక్రవారం ప్రధాని వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. కోవిడ్‌ 19 పేషెంట్ల వద్దకే వైద్య సేవలను తీసుకువెళ్లాలని ఈ సందర్భంగా వారికి ఆయన సూచించారు. ‘జహాః బీమార్‌.. వహీః ఉపచార్‌’అనే కొత్త మంత్రాన్ని ఉపదేశించారు. దానివల్ల ఆరోగ్య వ్యవస్థపై భారం తగ్గుతుందన్నారు.

‘అందరి ఉమ్మడి కృషితో ఈ మహమ్మారిని కొంతవరకు నియంత్రించగలిగాం. కానీ అప్పుడే సంతృప్తి చెందలేం. యుద్ధాన్ని ఇంకా చాలారోజులు కొనసాగించాల్సి ఉంది’అన్నారు. వారణాసి, పూర్వాంచల్‌లోని గ్రామీణ ప్రాంతాలపై వైద్యులు దృష్టి పెట్టాలన్నారు. టెలీ మెడిసిన్‌ సేవలను విస్తృతం చేయాలని, యువ వైద్యులు, రిటైరైన వైద్యుల సేవలను వినియోగించుకోవాలని సూచించారు. డాక్టర్లు, నర్సులు, టెక్నీషియన్లు, వార్డ్‌బాయ్స్, అంబులెన్స్‌ డ్రైవర్లు.. తదితరుల సేవలను ప్రధాని కొనియాడారు. ‘కానీ ఈ మహమ్మారి ఎంత తీవ్రంగా ఉందంటే.. ఇంతగా కష్టపడుతున్నా.. చాలా మంది ప్రాణాలను ఇంకా కాపాడలేకపోతున్నాం. మనకు దగ్గరైన వారెందరినో ఈ వైరస్‌ తీసుకెళ్లిపోయింది’అంటూ కంటనీరు పెట్టుకుని, గద్గద స్వరంతో వ్యాఖ్యానించారు.

ఆ తరువాత కాసేపటివరకు ఆవేదనతో ఆయన మాట్లాడలేకపోయారు. కాసేపటికి తేరుకుని.. కరోనాతో చనిపోయినవారందరికీ నివాళులర్పిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నానన్నారు. కరోనా నుంచి పిల్లలను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రధాని కోరారు. తాజాగా బ్లాక్‌ ఫంగస్‌ మరో సవాలుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ రెండో వేవ్‌లో కరోనాతో బహుముఖ పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. ‘ఇన్‌ఫెక్షన్‌ రేట్‌ ఎక్కువగా ఉంది. ఆస్పత్రుల్లో చేరాల్సిన అవసరమున్న రోగుల సంఖ్య పెరిగింది. దాంతో వైద్య వ్యవస్థపై భారీగా భారం పడింది’అని వివరించారు. కనిపించని, క్షణక్షణం రూపుమార్చే శత్రువుతో పోరాడుతున్నామన్నారు.

టీకాలే ఈ వైరస్‌ నుంచి కాపాడే సురక్షా కవచాలని, టీకా వేసుకున్న కారణంగానే వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతర ఫ్రంట్‌లైన్‌ యోధులు ధైర్యంగా పోరాడగలుగుతున్నారని పేర్కొన్నారు. ఈ సురక్షా కవచం అందరికీ చేరాల్సి ఉందన్నారు. ఏడేళ్లుగా వైద్య రంగంలో చేపట్టిన కార్యక్రమాల కారణంగా ఈ మహమ్మారిని ఎదుర్కోగలిగామన్నారు. అయితే, ఇలాంటి అసాధారణ పరిస్థితుల్లో రాత్రింబవళ్లు సేవలందించిన వైద్య సిబ్బంది కృషి విస్మరించలేనిదని కొనియాడారు. మొదట్లో తాము యోగాకు ప్రచారం చేస్తున్నప్పుడు, దానికి కొందరు మతం రంగు పులిమారని, కానీ ఇప్పుడు ఆ యోగానే కరోనాపై పోరులో మనకు సహకరిస్తోందని వ్యాఖ్యానించారు. మైక్రో కంటైన్‌మెంట్‌ జోన్‌ల వల్ల వారణాసి లబ్ధి పొందిందన్నారు.

మరిన్ని వార్తలు