పథకాలకు ప్రాచుర్యంలో... మీడియాది కీలకపాత్ర

19 Mar, 2022 04:30 IST|Sakshi

స్వాతంత్య్ర ఘట్టాలను వెలుగులోకి తేవాలి: మోదీ

కోజికోడ్‌: రాజకీయాలకు అతీతంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు ప్రచారం కల్పించడంలో మీడియాది కీలకపాత్ర అని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. దేశ 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుగుతున్న సందర్భంగా స్వాతంత్య్ర సమరంలో ఇప్పటిదాకా పెద్దగా వెలుగులోకి రాని ఘట్టాలను, స్ఫూర్తిదాయకమైన స్వాతంత్య్ర యోధుల జీవిత విశేషాలను ప్రచురించాలని మీడియాకు సూచించారు.

ప్రముఖ మలయాళ పత్రిక మాతృభూమి శతాబ్ది ఉత్సవాలను మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే మంచి పథకాల రూపకల్పనతో పాటు వాటి గురించి సమాజంలోని అన్ని వర్గాలకు తెలిసేలా చేయడం చాలా ముఖ్యమని ఈ సందర్భంగా అన్నారు. ఈ పాత్రను మీడియా అత్యంత సమర్థంగా పోషించిందన్నారు. ‘‘స్వాతంత్య్ర సమరంలో చిన్న గ్రామాలు, పట్టణాలూ పాల్గొన్నాయి. వాటి గురించి అందరికీ తెలిసేలా కథనాలు ప్రచురించి దేశ ప్రజలంతా ఆ గ్రామాలకు వెళ్లేలా చేయాలి’’ అని మీడియా సంస్థలకు ప్రధాని సూచించారు.  

హోలీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మోదీ దేశ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందాల్ని నింపాలని ఆకాంక్షిస్తున్నానని ట్విట్టర్‌లో మోదీ అన్నారు. కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్, ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తదితరులు కూడా శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని వార్తలు