అది దేశ విద్యా విధానం

8 Sep, 2020 02:52 IST|Sakshi
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా గవర్నర్లతో మాట్లాడుతున్న ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్‌

రక్షణ, విదేశాంగ విధానాల వంటిది

నూతన జాతీయ విద్యా విధానంపై ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: నూతన జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ) కేవలం ప్రభుత్వ విధానం కాదని.. అది మొత్తంగా భారత దేశ విద్యా విధానమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జాతీయ విద్యా విధానం కూడా దేశ విదేశాంగ, రక్షణ విధానాలతో సమానమైన ప్రాముఖ్యత కలిగినదన్నారు. నూతన జాతీయ విద్యా విధానం అమలులో సాధ్యమైనంతగా మార్పుచేర్పులకు వీలు కల్పించాలని, ఈ విద్యా విధానానికి సంబంధించిన అన్ని అనుమానాలను నివృత్తి చేయాల్సి ఉందని స్పష్టం చేశారు. ‘రోల్‌ ఆఫ్‌ ఎన్‌ఈపీ ఇన్‌ ట్రాన్స్‌ఫార్మింగ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌’అనే అంశంపై సోమవారం జరిగిన గవర్నర్ల సదస్సును ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

ఈ విద్యా విధానంపై సంబంధిత వర్గాలకు అనేక అనుమానాలు, ప్రశ్నలు ఉండటం సహజమేనని ప్రధాని పేర్కొన్నారు. ఆ ప్రశ్నలన్నింటికీ సమాధానాలిచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ‘విద్యా విధానంలో భాగమైన ప్రతీ వ్యక్తి అభిప్రాయాలను గౌరవిస్తాం. ప్రశ్నలకు జవాబిస్తాం. అనుమానాలను నివృత్తి చేస్తాం’అని స్పష్టం చేశారు. చాలా ప్రశ్నలు ఎన్‌ఈపీ అమలుకు సంబంధించే ఉన్నాయన్నారు. దేశ విద్యా విధానం ఆ దేశ ఆకాంక్షలను ప్రతిఫలిస్తుందని అభివర్ణించారు. ఈ విద్యా విధానాన్ని రూపొందించిన తీరు తరహాగానే.. అమలులోనూ సాధ్యమైనంత సానుకూల దృక్పథాన్ని ప్రదర్శించాలని సూచించారు.

సదస్సులో రాష్ట్రాల గవర్నర్లతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, రాష్ట్రాల విద్యా శాఖల మంత్రులు, వర్సిటీల వైస్‌ చాన్సెలర్లు పాల్గొన్నారు.  ఎన్‌ఈపీ–2020పై సెప్టెంబర్‌ 25 లోపు యూనివర్సిటీల్లో వర్చువల్‌ సదస్సులు నిర్వహించాలని ఈ సందర్భంగా ప్రధాని కోరారు. నూతన విద్యా విధానాన్ని పాఠశాల ఉపాధ్యాయుల నుంచి, ప్రఖ్యాత విద్యావేత్తల వరకు అంతా స్వాగతిస్తున్నారని గుర్తు చేశారు. అకడమిక్, వొకేషనల్, టెక్నికల్‌ సహా అన్ని అంశాలను, అలాగే, పాలనాపరమైన అనవసర జాప్యాలను నివారించే చర్యలను కూడా నూతన ఎన్‌ఈపీలో సమగ్రంగా పొందుపర్చారన్నారు.

కళాశాలలకు, విశ్వవిద్యాలయాలకు దశలవారీగా స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించాలనే ఆలోచన వెనుక.. ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించాలి, సమర్థ్ధతకు పట్టం కట్టాలనే ఉద్దేశం ఉందని ప్రధాని మోదీ వివరించారు. ‘ఈ స్ఫూర్తిని విజయవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది’అన్నారు. చదవడం కన్నా నేర్చుకోవడంపై, విశ్లేషణాత్మక ఆలోచనాధోరణిని పెంపొందించుకోవడంపై ఈ నూతన విద్యా విధానంలో ప్రధానంగా దృష్టి పెట్టారన్నారు. విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న పుస్తకాలు, సిలబస్, పరీక్షల ఒత్తిడి భారాన్ని తగ్గించేందుకు తగిన చర్యలు ఈ విధానంలో ఉన్నాయన్నారు. చిన్న క్లాసుల నుంచే వృత్తి విద్యకు, శిక్షణకు ప్రాధాన్యతనిచ్చి, వారిని దేశీయ, అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్‌కు సిద్ధ్దం చేయడం లక్ష్యంగా ప్రణాళిక రూపొందించారని పేర్కొన్నారు.

‘స్వావలంబ భారత్‌’లక్ష్యాన్ని చేరుకునేందుకు వీలుగా ఈ నూతన ఎన్‌ఈపీ రూపొందిందన్నారు. గతంలో విద్యార్థులు తమకు ఆసక్తి లేని అంశాలను బలవంతంగా నేర్చుకోవాల్సి వచ్చేదని, నూతన విద్యా విధానంలో ఆ సమస్యకు పరిష్కారం చూపామని వివరించారు. 21వ శతాబ్దపు నాలెడ్జ్‌ ఎకానమీ హబ్‌గా భారత్‌ను రూపొందించేందుకు  ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. నూతన విద్యా విధాన స్థూల రూపకల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కువగా జోక్యం చేసుకోలేదన్నారు. విద్యావేత్తలు, విద్యార్థులు, తల్లిదండ్రుల అభిప్రాయాలకు ఈ విధానంలో సముచిత ప్రాధాన్యతనిచ్చారన్నారు. అంతర్జాతీయంగా ప్రఖ్యాతి గాంచిన వర్సిటీలు భారత్‌లో తమ కేంద్రాలను ప్రారంభించేలా నూతన విధానంలో అవకాశం కల్పించామన్నారు. దీనివల్ల మేధో వలస సమస్య కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.

‘పరిశోధన’కు నిధులు పెంచాలి
పరిశోధన, అభివృద్ధి’పై ప్రభుత్వ నిధులను భారీగా పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సూచించారు. ఇతర దేశాలతో పోలిస్తే...భారత్‌ ఈ రంగంలో అతి తక్కువ నిధులను కేటాయిస్తోందన్నారు. పరిశోధన, సృజనాత్మక ఆవిష్కరణలపై భారీగా పెట్టుబడులు పెట్టడం భారత్‌ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థకు అత్యావశ్యకమన్నారు. నూతన విద్యా విధానంపై సోమవారం వర్చువల్‌గా జరిగిన గవర్నర్ల సదస్సునుద్దేశించి ఆయన ప్రారంభోపన్యాసం చేశారు. ‘రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌’కు జీడీపీలో అమెరికా 2.8%, దక్షిణ కొరియా 4.2%, ఇజ్రాయెల్‌ 4.3% నిధులను కేటాయిస్తుండగా, భారత్‌ మాత్రం జీడీపీలో 0.7% నిధులను మాత్రమే కేటాయిస్తోందన్నారు.   

మరిన్ని వార్తలు