రూ.20వేల కోట్ల ప్రాజెక్టులపై ప్రధాని సమీక్ష

25 Nov, 2021 05:50 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం జరిగిన 39వ ‘ప్రగతి’ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ సహా 7 రాష్ట్రాల్లో చేపట్టిన రూ.20వేల కోట్ల విలువైన 8 ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు. ప్రధాన అధ్యక్షతన 9 అంశాల ఎజెండాతో జరిగిన ఈ సమావేశంలో 8 ప్రాజెక్టులతోపాటు ఒక పథకంపై సమీక్ష జరిగినట్లు ప్రధాని కార్యాలయం (పీఎంవో) తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌ల్లో చేపట్టిన 3 రైల్వే ప్రాజెక్టులు, రోడ్డు రవాణా, హైవేశాఖ, విద్యుత్‌ శాఖలకు చెందిన రెండేసి ప్రాజెక్టులు, పెట్రోలియం, సహజవాయువు శాఖకు చెందిన ఒక ప్రాజెక్టు ఇందులో ఉన్నాయి.

    వ్యయాలు పెరగకుండా సకాలంలో ఆయా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నొక్కి చెప్పారు. పోషణ్‌ అభియాన్‌ ప్రగతిపైనా ప్రధాని మోదీ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా చిన్నారుల ఆరోగ్యం, పోషణపై ప్రాథమిక స్థాయిలో అవగాహన పెంపొందించడంలో స్వయం సహాయక బృందాలు, ఇతర స్థానిక సంఘాల భాగస్వామ్యంపైనా ఆయన చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ప్రాజెక్టుల అమలు, నిర్వహణను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఆన్‌లైన్‌ వేదికే ‘ప్రగతి’. ఇప్పటి వరకు జరిగిన 38 విడతల ప్రగతి సమావేశాల్లో రూ.14.64 లక్షల కోట్ల విలువైన 303 ప్రాజెక్టులపై నరేంద్ర మోదీ సమీక్ష జరిపినట్లు ప్రధానమంత్రి కార్యాలయం వివరించింది.

>
మరిన్ని వార్తలు