అందరికీ విమానయోగం

28 Feb, 2023 04:30 IST|Sakshi
బెల్గావీలో ర్యాలీలో మద్దతుదారులకు మోదీ అభివాదం

త్వరలో స్వదేశీ విమానాలు: మోదీ 

బెల్గావీలో భారీ రోడ్‌ షో

శివమొగ్గ/బెల్గావీ: ‘‘హవాయి చెప్పులేసుకునే సామాన్యులు కూడా హవాయీ జహాజ్‌ (విమాన) ప్రయాణం చేయగలగాలి. ఆ కల ఇప్పుడు నిజమవుతోంది’’ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన సోమవారం కర్నాటకలోని శివమొగ్గలో నూతన విమానాశ్రయాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. భారత వైమానిక రంగం ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు.

‘‘మున్ముందు మనకు వేలాది విమానాలు అవసరమవుతాయి. వాటిని ప్రస్తుతానికి దిగుమతి చేసుకుంటున్నా భారత్‌లోనే తయారు చేసే రోజు ఎంతో దూరంలో లేదు. అప్పుడు మనమంతా దర్జాగా మేడిన్‌ ఇండియా విమానాల్లోనే ప్రయాణిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. చిన్న నగరాలు, పట్టణాల్లోనూ విమానాశ్రయాల నిర్మాణంతో బీజేపీ ప్రభుత్వం విమానయానాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చిందని మోదీ చెప్పారు. 2014 దాకా దేశంలో మొత్తం 74 విమానాశ్రయాలుంటే గత తొమ్మిదేళ్లలోనే తాము మరో 74 కొత్త విమానాశ్రయాలు నిర్మించామన్నారు. కాంగ్రెస్‌ పాలనపై మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు.

‘‘2014కు ముందు ఎయిరిండియాను నష్టాలు, కుంభకోణాల సంస్థగా చూసే పరిస్థితి ఉండేది. నేడు అలాంటి సంస్థ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. నూతన భారతదేశానికి ప్రతీకగా విజయపుటంచులు చూస్తోంది’’ అన్నారు. రూ.3,600 కోట్ల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేశారు. శివమొగ్గ జిల్లాకే చెందిన కర్నాటక మాజీ సీఎం, బీజేపీ అగ్ర నేత బి.ఎస్‌.యడియూరప్ప సోమవారం 80వ పుట్టినరోజు జరుపుకున్నారు. దాంతో సభికులంతా మొబైల్‌ ఫ్లాష్‌ లైట్లు ఆన్‌ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలపాల్సిందిగా మోదీ కోరారు. ఆయన జీవితమంతా ప్రజా సేవకు అంకితం చేశారని, రాజకీయ నాయకులందరికీ స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.

డబుల్‌ ఇంజన్‌ సర్కారుకే మరో అవకాశమివ్వాలని కర్నాటక ప్రజలు ఇప్పటికే నిర్ణయానికి వచ్చారన్నారు. అనంతరం బెల్గావీలో మోదీ భారీ రోడ్‌ షో నిర్వహించారు. ప్రజలకు కారులో నుంచుని అభివాదం చేస్తూ సాగారు. అభివృద్ధి చేసిన బెల్గావీ రైల్వేస్టేషన్‌ భవనాన్ని, రైల్వే అభివృద్ధి ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 8 కోట్ల మంది రైతులకు ప్రధాన్‌మంత్రీ కిసాన్‌ సమ్మాన్‌ నిధి (పీఎంకిసాన్‌) పథకంలో 13వ విడతగా రూ.16 వేల కోట్ల నిధులను ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో విడుదల చేశారు. సీఎం బసవరాజ్‌ బొమ్మైతో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు