రూ.100 లక్షల కోట్లతో ‘గతిశక్తి’

14 Oct, 2021 07:12 IST|Sakshi

 ‘పీఎం గతిశక్తి’ ప్రాజెక్టును ఆవిష్కరించిన ప్రధాన మంత్రి నరేంద్రమోదీ

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో బహుముఖ అనుసంధానమే లక్ష్యంగా చేపట్టిన గతిశక్తితో రాబోయే 25 ఏళ్ల భారతావనికి పునాది పడిందని ప్రధాని మోదీ చెప్పారు. 16 మంత్రిత్వ శాఖల సమన్వయంతో చేపట్టే ఈ కార్యక్రమం ద్వారా రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల ముఖచిత్రం సమూలంగా మారనుందని తెలిపారు. రూ.100 లక్షల కోట్లతో అమలు చేసే ‘పీఎం గతిశక్తి.. నేషనల్‌ మాస్టర్‌ప్లాన్‌ ఫర్‌ మల్టీ–మోడల్‌ కనెక్టివిటీ’ కార్యక్రమానికి ప్రధాని బుధవారం శ్రీకారం చుట్టారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో నూతన అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆత్మనిర్భర్‌ భారత్‌’ సంకల్పంతో రాబోయే 25 సంవత్సరాల భారతదేశానికి పునాది వేస్తున్నామని ఉద్ఘాటించారు. ‘పీఎం గతిశక్తి నేషనల్‌ మాస్టర్‌ ప్లాన్‌’ 21వ శతాబ్దిలో భారతదేశానికి నూతన ఉత్తేజాన్ని అందిస్తుందని ప్రధాని మోదీ వివరించారు. ప్రగతి కోసం పని, ప్రగతి కోసం సంపద, ప్రగతి కోసం ప్రణాళిక, ప్రగతికే ప్రాధాన్యం.. ఇదే ఈనాటి మంత్రమని అన్నారు. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసే విషయంలో దేశంలో చాలా రాజకీయ పక్షాలకు ఓ ఆలోచన లేదని ఎద్దేవా చేశారు. అందుకే ఆయా పార్టీల ఎన్నికల మేనిఫెస్టోలో వాటికి స్థానం కల్పించడం లేదన్నారు. మౌలిక సదుపాయాల కల్పనను కొన్ని రాజకీయ పక్షాలు విమర్శిస్తుండడం దారుణమని మండిపడ్డారు.

ఏమిటీ ‘గతిశక్తి’?
ఈ ప్రాజెక్టు మాస్టర్‌ ప్లాన్‌ను ప్రధాని మోదీ ఇటీవలే ప్రకటించారు. 5 ట్రిలియన్ల ఆర్థిక లక్ష్యాన్ని చేరుకొనే క్రమంలో గతిశక్తి మాస్టర్‌ ప్లాన్‌ ఎంతో ఉపకరిస్తుందని కేంద్రం విశ్వసిస్తోంది. గతకాలపు బహుళ సమస్యలను పరిష్కరించడంతోపాటు కీలక మౌలిక వసతుల ప్రాజెక్టుల భాగస్వాముల కోసం ‘గతిశక్తి’ని తీసుకొచ్చారు.

ఆరు స్తంభాల పునాదితో..
ప్రాధాన్యీకరణ: దీనిద్వారా వివిధ శాఖలు, విభాగాలు ఇతర రంగాలతో సంప్రదింపుల ద్వారా తమ ప్రాజెక్టుల ప్రాధాన్యాన్ని నిర్ణయించుకోగల అవకాశం లభిస్తుంది.

గరిష్టీకరణ: వివిధ మంత్రిత్వ శాఖలు తమ ప్రాజెక్టు ప్రణాళికలను రూపొందించుకోవడంలో జాతీయ బృహత్‌ ప్రణాళిక తోడ్పాటునిస్తుంది. ఉదాహరణకు ఒకచోట నుంచి మరోచోటికి వస్తువుల రవాణా కోసం సమయం, ఖర్చుపరంగా గరిష్ట ప్రయోజనం గల మార్గాన్ని ఎంచుకునే వీలు కల్పిస్తుంది.

కాల సమన్వయం: ప్రస్తుతం మంత్రిత్వ శాఖలు, విభాగాలు వేటికవి తమ పని తాము చేసుకుంటున్నాయి. ప్రాజెక్టుల ప్రణాళిక, అమలులో సమన్వయం లోపించి, పనులు జాప్యమవుతాయి. ‘పీఎం గతిశక్తి’ వీటికి స్వస్తి పలుకుతుంది. ప్రతి విభాగం ఇతర విభాగాలతో సమన్వయం చేసుకోవచ్చు. దీంతో కాలం, శక్తి ఆదా అవుతుంది.

విశ్లేషణాత్మకత: 200కిపైగా అంచెలు గల విశ్లేషణాత్మక అంతరిక్ష ఉపకరణాల ఆధారిత గణాంకాలని్నటినీ ఈ ప్రణాళిక అందుబాటులోకి తెస్తుంది.

గతిశీలత: ‘జీఐఎస్‌’ సాయంతో అన్ని మంత్రిత్వ శాఖలు, విభాగాలు ఇతర శాఖలకు చెందిన ప్రాజెక్టులను గమనించడంతోపాటు సమీక్షిస్తూ, ప్రగతిని పర్యవేక్షించే సౌలభ్యం ఉంటుంది. ఆ మేరకు ఉపగ్రహ చిత్రాలను క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు అందించడమే కాకుండా ప్రాజెక్టుల ప్రగతి వివరాలు క్రమబద్ధంగా పోర్టల్‌లో నమోదు చేస్తారు.

సమగ్రత: పలు మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించిన ప్రస్తుత, ప్రణాళికల రూపంలో గల అన్ని ప్రాజెక్టులనూ కేంద్రీకృత పోర్టల్‌తో అనుసంధానిస్తారు. దీనివల్ల అన్ని శాఖలు, విభాగాలకు అన్ని ప్రాజెక్టులపై అవగాహన పెరుగుతుంది. తద్వారా ఆయా ప్రాజెక్టులను సకాలంలో, సమగ్రంగా పూర్తి చేసేందుకు వీలుంటుంది.  

మరిన్ని వార్తలు