రానున్న వంద రోజులు మిషన్ లాగా పని చేయాలి

22 Mar, 2021 16:50 IST|Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ

సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ‘క్యాచ్ ద రెయిన్’ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  కేంద్ర జల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్,  జలశక్తి శాఖ సలహాదారు శ్రీ రామ్ తదితరులు పొల్గొన్నారు. ఈ సందర్భంగా  కేన్, బెత్వ  నదుల అనుసంధానం ప్రాజెక్టు ఒప్పంద పత్రంపై కేంద్ర జల శక్తి శాఖ మంత్రి, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంతకాలు చేశారు.

అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ గ్రామ సర్పంచ్‌లతో నీటి సంరక్షణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ‘‘ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను నీటి సంరక్షణ చర్యలకు ఖర్చు చేయాలి. వానా కాలం కంటే ముందే చెరువులు, కాలువలు రిపేర్ చేయండి. ప్రభుత్వం కోసం ఎదురు చూడవద్దు! గ్రామస్తులే పనులు మొదలు పెట్టండి. వర్షం పడిన చోట నీళ్లు ఇంకిపోయేలా ప్రతి ఒక్కరు పని చేయాలి. కేన్, బెత్వ నదుల అనుసంధానం ప్రాజెక్టుతో బుందేల్ఖండ్ రూపురేఖలు మారనున్నాయి’’ అని అన్నారు. 

కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. ‘‘ కేన్‌, బెత్వా నదుల అనుసంధానానికి యూపీ, ఎంపీ రాష్ట్రాల ఒప్పందంతో  దేశంలోని అన్ని నదుల అనుసంధాన కార్యక్రమం ప్రారంభమైంది. గోదావరి- కావేరి నదుల అనుసంధానంపై రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకారానికి రావాలి. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దీనిపై ముందుకెళ్తుంది.’’ అని అన్నారు.

నదుల అనుసంధానం టాస్క్ ఫోర్స్ చైర్మన్ వేదేరే శ్రీరామ్ మాట్లాడుతూ.. ‘‘ దేశ వ్యాప్తంగా 30 నదుల అనుసంధానం లింకు ప్రాజెక్టులు చేపడుతున్నాం. వాటిలో తొలిది.. కేన్‌, బెత్వా నదుల అనుసంధానానికి ప్రధాని సమక్షంలో ఒప్పందం పూర్తయింది. గోదావరి, కావేరి నదుల అనుసంధానంపైన మోదీ దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు డీపీఆర్‌ తయారవుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపి దీనిపైన ముందుకెళ్తాం. రాబోయే వంద రోజుల్లో ‘క్యాచ్ ద  రైన్’ కార్యక్రమంతో వర్షపు నీటిని ఒడిసి పడతాం’’ అని అన్నారు.

మరిన్ని వార్తలు