ప్రజల కోసమే పనులు: మోదీ

11 Jun, 2022 05:56 IST|Sakshi

గిరిజన ప్రాంతాలను నిర్లక్ష్యం చేసిందంటూ కాంగ్రెస్‌పై ధ్వజం

గుజరాత్‌లో శంకుస్థాపనలు

నవ్‌సారి/అహ్మదాబాద్‌: సుదీర్ఘకాలం అధికారంలో ఉండి కూడా గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్‌ ఏనాడూ ప్రాధాన్యమివ్వలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దుయ్యబట్టారు. శుక్రవారం గుజరాత్‌లోని గిరిజన జిల్లా నవ్‌సారిలో ఖుద్వేల్‌ గ్రామంలో గుజరాత్‌ గౌరవ్‌ అభియాన్‌ సభలో ఆయన మాట్లాడారు. ‘‘మేం అభివృద్ధి పనులు చేపడుతున్నది ఎన్నికల్లో గెలుపు కోసం, ఓట్ల కోసం కాదు. ప్రజల జీవితాలను మెరుగుపర్చాలన్న లక్ష్యంతో. గిరిజన ప్రాంతాలను గత పాలకులు నిర్లక్ష్యం చేశారు. గిరిజన తండాల్లో రోడ్లు కూడా ఉండేవి కావు. మేమొచ్చాక మార్పు వచ్చింది’’ అన్నారు. రూ.3,050 కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు.

అలాంటి వారం ఒక్కటైనా ఉంటే చూపించండి
‘‘గతంలో మారుమూల గ్రామాలు, గిరిజన ప్రాంతాల దాకా ప్రభుత్వ పథకాలు చేరాలంటే చాలా సమయం పట్టేది. ఏళ్లు గడిచినా టీకాలే అందేవి కావు. అడవి బిడ్డలు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురయ్యేవారు. వారి సంక్షేమంపై మేం ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నాం. కరోనా టీకాలు వారికి త్వరగా అందజేశాం. ఇంతకుముందు గిరిజన ప్రాంతం నుంచి ఒకరు ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆయన సొంత గ్రామంలో నీళ్ల ట్యాంకు కూడా ఉండేది కాదు.

నేను సీఎం కాగానే ఆ గ్రామంలో వాటర్‌ ట్యాంకు నిర్మించాలని ఆదేశించా. నేను ఓట్ల కోసమే అభివృద్ధి పనులు చేస్తున్నానని కొందరు విమర్శిస్తుండడం బాధాకరం. రెండు దశాబ్దాలకు పైగా ప్రజాసేవలో ఉన్నా. నేను అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించని వారం ఒక్కటైనా ఉంటే చూపించాలని సవాలు విసురుతున్నా. గిరిజన ప్రాంతాల్లో మెడికల్, ఇంజనీరింగ్‌ కాలేజీలే కాదు, యూనివర్సిటీలూ నిర్మిస్తున్నాం. రెండు దశాబ్దాలుగా గుజరాత్‌లో అభివృద్ధి పరుగులు పెడుతోంది’’ అన్నారు.

‘ఇన్‌–స్పేస్‌’ ఆఫీసు ప్రారంభించిన మోదీ
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇండియన్‌ స్పేస్‌ ప్రమోషన్, ఆథరైజేషన్‌ సెంటర్‌ (ఇన్‌–స్పేస్‌) మోదీ ప్రారంభించారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్‌ పెట్టుబడులను, నవీన ఆవిష్కరణలను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈ కేంద్రాన్ని నెలకొల్పారు. ఐటీ తరహాలోనే గ్లోబల్‌ స్పేస్‌ సెక్టార్‌లోనూ భారత సంస్థలు అగ్రగామికి ఎదగాలని ఆకాంక్షించారు. అంతరిక్ష రంగంలో గతంలో ప్రైవేట్‌ సంస్థలకు ప్రవేశం లభించేది కాదని గుర్తుచేశారు. కానీ, తమ ప్రభుత్వం సంస్కరణలను తెరతీయడం ద్వారా ప్రైవేట్‌ రంగానికి స్వాగతం పలుకుతోందని తెలిపారు. స్పేస్‌ సెక్టార్‌లో సంస్కరణల ద్వారా అన్ని నియంత్రణలను, ఆంక్షలను తొలగించామని వివరించారు. ప్రైవేట్‌ రంగానికి ఇన్‌–స్పేస్‌ తగిన మద్దతు ఇస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

స్కూల్‌ టీచర్‌తో భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ తనకు విద్యాబోధన చేసిన గురువును గుజరాత్‌ పర్యటనలో కలుసుకున్నారు. నవ్‌సారిలో నిరాలీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభం సందర్భంగా టీచర్‌ జగదీష్‌ నాయక్‌(88)ను కలిసి కాసేపు మాట్లాడారు. ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మోదీ కుటుంబం మెహసానా జిల్లాలోని వాద్‌నగర్‌లో నివసించిన సమయంలో ఆయనకు జగదీష్‌ నాయక్‌ పాఠాలు బోధించారు.

మరిన్ని వార్తలు