ఆవిష్కారం.. ఆత్మ నిర్భర్‌ భారతం

11 Dec, 2020 01:48 IST|Sakshi
పార్లమెంట్‌ కొత్త భవనానికి శంకుస్థాపన సందర్భంగా పూజలు చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

నూతన పార్లమెంట్‌ భవనానికి ప్రధానమంత్రి మోదీ శంకుస్థాపన

దేశ ఆకాంక్షలు నెరవేరుస్తుందంటూ కితాబు

భారత ప్రజాస్వామ్యంలో సరికొత్త మైలురాయి అంటూ వ్యాఖ్య

సాక్షి, న్యూఢిల్లీ : నూతన పార్లమెంటు భవనం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో కీలక మైలురాయని ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నూతన పార్లమెంటు భవనం సెంట్రల్‌ విస్టా ప్రాజెక్టుకు గురువారం ప్రధాని శంకుస్థాపన చేశారు. నూతన భవనం ఆత్మ నిర్భర్‌ భారత్‌ దార్శనికతలో అంతర్భాగమని, స్వాతంత్య్ర అనంతర కాలంలో మొదటిసారిగా ఓ ప్రజా పార్లమెంటు నిర్మించేందుకు చరిత్రాత్మక అవకాశం వచ్చిందని అన్నారు.

75వ స్వాతంత్య్ర దినోత్సవ(2022) సమయానికి పూర్తయ్యే ఈ భవనం దేశ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుందన్నారు. ప్రతి పార్లమెంటు సభ్యుడు ప్రజలకు, రాజ్యాంగానికి జవాబుదారీగా ఉండాలని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘2014లో పార్లమెంటు సభ్యుడిగా పార్లమెంటు భవనంలో మొదటిసారి అడుగుపెట్టిన క్షణం ఇంకా గుర్తుంది. ఆ సమయంలో ప్రజాస్వామ్యానికి ఆలయం అయిన ఈ భవనానికి శిరసు వంచి ప్రణామం చేశా. పాత పార్లమెంటు భవనం స్వాతంత్య్రం అనంతర కాలంలో దేశానికి ఒక దిశను అందిస్తే కొత్త భవనం ఆత్మ నిర్భర్‌ భారత్‌ ఆవిష్కారానికి సాక్షిగా మారనుంది.  21వ శతాబ్దపు  ఆకాంక్షలను నెరవేరుస్తుంది.’’ అన్నారు.  

ప్రజాస్వామ్యమే బలం
భారత ప్రజాస్వామ్య మూలాలు 13వ శతాబ్దికి చెందిన మాగ్నాకార్టాలో ఉన్నాయని మోదీ గుర్తు చేశారు. ‘‘భారతదేశంలో ప్రజాస్వామ్యం అంటే జీవన విలువలు, జీవన మార్గం దేశ ప్రజల ఆత్మ. భారత్‌లో ప్రజాస్వామ్యం విఫలమవుతుందని మొదట్లో చాలామంది భావించారు, కానీ అది తప్పని ప్రస్తుత తరం గర్వంగా చెప్పుకోవచ్చు. ప్రజాస్వామ్యంలో ఒక జీవన క్షమానుగత వ్యవస్థ ఉన్నాయి.’’ అన్నారు. కొత్త బిల్డింగ్‌ భవిష్యత్‌ రాజ్యాంగ అవసరాలు తీరుస్తుందని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అభిప్రాయపడ్డారు.

పలువురు కేంద్రమంత్రులు, విదేశీ రాయబారులు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్, వైఎస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్, ఏఐడీఎంకే, బీజేడీ, టీఆర్‌ఎస్‌ తదితర పార్టీల ప్రతినిధులు, రతన్‌టాటా వంటి వ్యాపారవేత్తలు కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా తమ సందేశాలు పంపారు. భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆచార్య శివకుమార్‌ శర్మ, కేఎస్‌ లక్ష్మీనారాయణ సోమయాజి తదితరులు పూజలు నిర్వహించారు. శృంగేరి పీఠం నుం చి శంఖం, నవరత్న పీఠాలను శృంగేరి శారద పీఠం జగద్గురు భారతీ తీర్థ ఆశీర్వదించి పంపారు.  ఈ కార్యక్రమంలో సర్వమత ప్రార్థనలు చేశారు.  

కాంగ్రెస్‌ విమర్శలు: ప్రజాస్వామ్యాన్ని ఛిన్నాభిన్నం చేసిన అనంతరం నిర్మించే కొత్త భవనం దేన్ని ప్రతిబింబిస్తుందని కాంగ్రెస్‌ విమర్శించింది. హక్కుల కోసం రైతులు పోరాటం చేస్తున్న తరుణంలో ప్రధాని భవనాలకు శంకుస్థాపనలు చేస్తున్నారని కాంగ్రెస్‌ ప్రతినిధి సూర్జేవాలా దుయ్యబట్టారు. పార్లమెంట్‌ బిల్డింగంటే ఇసుక, ఇటుకలు కాదని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించేదని చెప్పారు.

విశేషాలు..
► నూతన భవన నిర్మాణ కాంట్రాక్టును టాటా ప్రాజెక్ట్స్‌ గెలుచుకుంది.  
► 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీన్ని నిర్మించనున్నారు.  
► ప్రాజెక్టు అంచనా దాదాపు రూ.971 కోట్లు. 2022కి పూర్తి చేయాలని భావిస్తున్నారు.  
► నిర్మాణం పూర్తయితే లోక్‌సభ సీటింగ్‌ సామ ర్థ్యం 888 మంది సభ్యులకు పెరుగుతుంది.  
► సంయుక్త సమావేశాలప్పుడు 1224 మందివరకు సామర్ధ్యం పెంచుకునే వీలుంది.  
► రాజ్యసభ సీటింగ్‌ సామర్ధ్యం 384 సీట్లు.  
► ప్రాజెక్టులో భాగంగా నిర్మించే శ్రమ్‌శక్తి భవన్‌లో ఒక్కో ఎంపీకి 40 చదరపు మీటర్ల ఆఫీసు ఇస్తారు. ఈ భవనం నిర్మాణం 2024లో పూర్తవుతుంది.  
► ప్రస్తుత పార్లమెంట్‌ భవన నిర్మాణం 1921లో ప్రారంభమై 1927 జనవరి 18న ముగిసింది.  
► ప్రస్తుత నిర్మాణంపై సుప్రీంకోర్టులో పలు దావాలున్నాయి. అందుకే కోర్టు కేవలం పేపర్‌ వర్క్‌ పూర్తి చేసేందుకు మాత్రమే అనుమతినిచ్చింది. తీర్పు వచ్చేవరకు కొత్త కట్టడాలు నిర్మించడం, కూల్చడం, చెట్లు నరకడం చేయవద్దని ఆదేశించింది.

మరిన్ని వార్తలు