గురుద్వారాను సందర్శించిన ప్రధాని మోదీ

20 Dec, 2020 13:03 IST|Sakshi

న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  ఆదివారం ఉదయం ఢిల్లీలోని చారిత్రక గురుద్వారా రకాబ్‌ గంజ్ సాహిబ్‌ను సందర్శించారు. నేడు సిక్కుల తొమ్మిదో గురువు ‘గురు తేగ్‌బహదూర్’‌ వర్ధంతి కావడంతో ఆయన త్యాగాలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. ఇది న్యూఢిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్‌ భవనానికి సమీపంలో ఉంది. అయితే ప్రధాని గురుద్వారా సందర్శన షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించినది కాదు. ఈ పర్యటనను ఉన్నట్టుండి ప్లాన్‌ చేశారు. సాధారణంగా ప్రధాని ఇలాంటి పర్యటనకు వెళ్తే అక్కడ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటారు. కానీ గురుద్వారా చేరుకునే సమయంలో ఆయనకు ఏ విధమైనటువంటి ప్రత్యేక పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయలేదు. చదవండి: భారత్‌ ఎందుకొద్దు?

పర్యటనలో ప్రధాని మోదీ గురుద్వారాలో ప్రార్థనలు చేశారు. అక్కడ పోలీసు బందోబస్తు లేదని, ఎక్కడా బారికేడ్లు పెట్టలేదని అధికారులు తెలిపారు. అలాగే ఈ మార్గంలో ఎటువంటి ట్రాఫిక్ మళ్లింపులు చేయలేదని, సామాన్యులకు ఎలాంటి అడ్డంకులూ లేవని అధికారులు పేర్కొన్నారు. ఉదయాన్నే మంచుకురుస్తుండగా, ఒక సాధారణ వ్యక్తి మాదిరిగా ప్రధాని మోదీ గురుద్వారా రకాబ్‌ గంజ్‌ చేరుకొని గురు తేగ్‌ బహదూర్‌కు సమాధి వద్ద నివాళులు అర్పించారు. కాగా ఢిల్లీలో గురుద్వారా రకాబగంజ్ 1783వ సంవత్సరంలో నిర్మితమైంది. ఢిల్లీలోని ప్రముఖ గురుద్వారాల్లో ఎక్కువ మంది సందర్శకులు వెళ్లే గురుద్వారాల్లో ఇదీ ఒకటి. ఓవైపు పంజాబ్ రైతులు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న సమయంలో ప్రధాని మోదీ ఈ పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: నాకు పేరొస్తుందనే.. మోదీ ధ్వజం

ప్రధానమంత్రి మోదీ తన గురుద్వారా సందర్శనకు సంబంధించిన ఫొటోలను ట్విటర్‌లో షేర్ చేశారు. దీనితోపాటు గురుముఖి భాషలో సందేశమిచ్చారు. ‘నేను ఈ రోజు ఉదయం చారిత్రాత్మక గురుద్వారా రకాబగంజ్ సాహిబ్‌కు ప్రార్థనలు చేశాను. అక్కడ గురు తేగ్‌బహదుర్ పవిత్ర శరీరానికి అంతిమ సంస్కారాలు నిర్వహించాను. ఈ ప్రపంచంలోని లక్షల మందిని ప్రభావితులను చేసి, ఆధ్యాత్మిక మార్గంవైపు మళ్లించిన గురు తేగ్‌బహదూర్ దయతోనే ఎంతో ప్రేరణ పొందాను. గురు సాహిబ్స్‌ విశేష కృపతోనే మన ప్రభుత్వ పాలనా కాలంలో గురు తేగ్‌బహదూర్ 400వ ప్రకాశ్ పర్వాన్ని జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా తేగ్ బహదూర్ ఆదేశాలను గుర్తు చేసుకుంటున్నాం. కాగా గురు తేగ్‌ బహదూర్‌ సిక్కు మతంలోని పదిమంది గురువులలో తొమ్మిదవ గురువు. 17వ శతాబ్దంలో ఢిల్లీలో మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు అతన్ని హత్య చేశారు.

మరిన్ని వార్తలు