Krishnam Raju: కృష్ణంరాజుకు నివాళి.. ప్రధాని మోదీ స్పెషల్‌ ఫొటో ఇదే..

11 Sep, 2022 16:51 IST|Sakshi

రాజకీయవేత్త, సినీ నటుడు రెబల్‌ స్టార్ కృష్ణంరాజు మరణవార్తతో సినీ, రాజకీయ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణవార్త విని పలువురు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ క్రమంలో సీని ప్రముఖులు, రాజకీయ నేతలు కృష్ణంరాజు భౌతికకాయానికి నివాళులు అర్పించారు. 

తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా కృష్ణంరాజు మృతిపై తన సంతాపాన్ని తెలిపారు. మోదీ ట్విట్టర్ వేదికగా తెలుగులో.. ‘శ్రీ యు.వి.కృష్ణంరాజు గారి మరణం నన్ను కలచివేసింది. రాబోయే తరాలు ఆయన నటనా కౌశలాన్ని , సృజనాత్మకతను స్మరించుకుంటూ ఉంటాయి. సమాజ సేవలో కూడా ఆయన ముందంజలో ఉండి రాజకీయ నాయకుడిగా తనదైన ముద్ర వేశారు. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు సంతాపం తెలియజేస్తున్నాను. ఓం శాంతి’ అని వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగానే కృష్ణంరాజు, ప్రభాస్‌తో కలిసి ఉన్న ఫొటోను షేర్‌ చేశారు. 

ఇక, కృష్ణంరాజు భౌతికకాయానికి తెలంగాణ బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ కూడా నివాళులు అర్పించారు. ఈ క్రమంలో కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం, బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘బీజేపీ సీనియర్ నేత అందరి నాయకుడు కృష్ణంరాజు మా మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ధర్మం కోసం పోరాడుతున్న నాకు అయన అనేక సూచనలు ఇచ్చేవారు. నేను చేసే ధర్మ పోరాటాన్ని మెచ్చుకుని ప్రోత్సహించేవారు.

పార్టీకి అనేక సేవలు అందించిన నిజాయతీపరుడు కృష్ణంరాజు. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పే​యి.. కృష్ణంరాజును గుర్తించి కేంద్ర మంత్రిని చేశారు. ఆయన అనేక సినిమాల్లో గొప్పగా నటించారు. అంతిమ తీర్పు సినిమా చాలా గొప్పది. ఆ సినిమా చూశాక ఆయనతో నేను ఫొటో దిగాలని అనుకున్నాను. ఇదే విషయాన్ని ఆయనతో చెప్పాను. ఆయన రూపంలో మనకు ప్రభాస్ ఉన్నారు. మేమంతా ఆయన లక్ష్యం కోసం పని చేస్తాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి’ తెలిపారు.

మరిన్ని వార్తలు