వాజ్‌పేయికి నివాళి అర్పించిన ప్రధాని మోదీ

25 Dec, 2020 11:42 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత మాజీ ప్రధాని అటల్‌ బిహారి వాజ్‌పేయి 96వ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీలోని రాష్ట్రీయ స్మృతి సతల్‌లోని ఆయన సమాది వద్ద నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సహా కేంద్ర మంత్రులు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నిర్మలా సీతారామన్‌, పియూష్‌ గోయల్‌లు హాజరై వాజ్‌పేయికి ఘన నివాళి అర్పించారు. వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకొని ప్రధాని మోదీ లోక్‌సభ సెక్రటరియట్‌ రచించిన 'అటల్‌ బిహారి వాజ్‌పేయి ఇన్‌ పార్లమెంట్ : కొమెమొరేటివ్‌ వాల్యూమ్‌'‌ పుస్తకాన్ని నేడు పార్లమెంట్‌లో రిలీజ్‌ చేయనున్నారు. ప్రధాని హోదాలో పార్లమెంట్‌ వేదికగా వాజ్‌పేయి చేసిన ప్రసంగాలతో పాటు ఆయన జీవిత చరిత్రలోని కొన్ని ముఖ్య అంశాలను ఈ పుస్తకంలో ప్రచురించారు. 


విజయవాడ : మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జయంతిని పురస్కరించుకొని  విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ జీవిఎల్‌ నరసింహారావు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. 'వాజపేయి అజాత శత్రువు... ఆయన జీవితం అందరకీ స్పూర్తి దాయకం. కార్గిల్ విజయం, అణు పరీక్షలతో సాహసోపేతంగా నిర్ణయాలు తీసుకున్నారు. అవినీతి రహిత పాలనకు వాజపేయి నిదర్శనం. సాధారణ కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా దేశాధినేతగా ఎదిగారు. ఆయన జయంతిని ఈరోజున సుపరిపాలన దినోత్సవం గా జరుపుకుంటున్నాం.'అంటూ తెలిపారు.

మరిన్ని వార్తలు