గాంధీజీ, శాస్త్రిలకు ప్రముఖుల నివాళి

3 Oct, 2022 04:43 IST|Sakshi
పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో నివాళి కార్యక్రమంలో ఓం బిర్లా, మోదీ, రాజ్‌నాథ్, సోనియా తదితరులు; రాజ్‌ఘాట్‌లో నివాళులర్పిస్తున్న రాష్ట్రపతి ముర్ము

న్యూఢిల్లీ: మహాత్మాగాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రిలకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఇద్దరు నేతల జయంతిని పురస్కరించుకుని ప్రధాని ఆదివారం వారి సమాధులున్న రాజ్‌ఘాట్, విజయ్‌ఘాట్‌లను సందర్శించి పుష్పాంజలి ఘటించారు. ప్రతి ఒక్కరూ ఖాదీ, హస్తకళల ఉత్పత్తులను కొనుగోలు చేసి గాంధీజీకి నివాళులర్పించాలని ప్రధాని ప్రజలను కోరారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేళ గాంధీ జయంతి మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. బాపు సిద్ధాంతాలను అన్ని వేళలా ఆచరించాలి’అని ట్వీట్‌ చేశారు. లాల్‌ బహదూర్‌ శాస్త్రి నిరాడంబరత, స్థిరమైన నిర్ణయాలు తీసుకోగల శక్తి దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయన్నారు.

‘కీలకమైన సమయంలో శాస్త్రి నాయకత్వ పటిమ దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది. జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పిస్తున్నాను’ అని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. శాస్త్రి జీవన ప్రయాణం, సాధించిన విజయాలపై ‘ప్రధానమంత్రి సంగ్రహాలయ’లో ఉంచిన కొన్ని చిత్రాలను ప్రధాని షేర్‌ చేశారు. గాంధీజీకి కాంగ్రెస్‌ నేత రాహుల్‌ ట్విట్టర్‌ ద్వారా నివాళులర్పించారు. ‘అన్యాయానికి వ్యతిరేకంగా దేశాన్ని ఏకం చేసిన గాంధీజీ మాదిరిగా దేశాన్ని ఐక్యంగా ఉంచుతామంటూ ప్రతిన బూనుదాం. సత్యం, అహింసా మార్గంలో నడవాలని ఆయన మనకు నేర్పించారు. ప్రేమ, కరుణ, సామరస్యం, మానవత్వం అర్థాన్ని బాపు వివరించారు’ అని ట్వీట్‌ చేశారు. 

మరిన్ని వార్తలు