సంకుచిత భావనలొదిలేస్తే సమున్నతంగా ఎదుగుతాం

27 Dec, 2022 05:36 IST|Sakshi

వీర్‌ బాల్‌ దివస్‌ కార్యక్రమంలో ప్రసంగించిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: గత కాలపు సంకుచిత భావనలను చెరిపేస్తేనే చరిత్రను తిరగరాసే స్థాయికి భారత్‌ అద్భుత విజయాలను ఒడిసిపట్టుకోగలదని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సోమవారం ఢిల్లీలో జరిగిన తొలి ‘వీర్‌ బాల్‌ దివస్‌’ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. గురు గోవింద్‌ సింగ్‌ తనయులు జోరావార్‌ సింగ్, ఫతే సింగ్‌లకు ఈ సందర్భంగా మోదీ ఘన నివాళులర్పించి ప్రసంగించారు. ‘ సంకుచిత భావన బంధనాలను తెంచుకుని భారత్‌ అద్భుత ప్రగతి పథంలో దూసుకుపోవాల్సిన తరుణం వచ్చేసింది.

‘గురు గోవింద్‌ సింగ్‌ చిన్నారులను మతం మార్చాలని లేదంటే ఖడ్గానికి పనిజెప్తానని ఆనాటి మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబు హూంకరించడంతో విధిలేక తన ఇద్దరు కుమారులను గురు గోవింద్‌ బలివ్వక తప్పలేదు. గురు గోవింద్‌ సింగ్‌ నమ్మిన సిద్ధాంతం కోసం మేరునగంలా నిలిచారు. ఆ చిన్నారుల సాహసం, త్యాగనిరతిని కీర్తించేటపుడు వయసును లెక్కలోకి తీసుకోవద్దు. భక్త ప్రహ్లాదుడు, ధ్రువుడు, బలరాముడు, లవకుశ, చిన్నికృష్ణుడు అందరూ చిన్నతనంలోనే తమ పరాక్రమాన్ని ప్రదర్శించినవారే’ అని అన్నారు.

అభివృద్ధిలో అత్యున్నత శిఖరాలపై నిలపాలి
‘వీర్‌ బాల్‌ దివస్‌ను స్ఫురణకు తెచ్చుకుంటే గత భారతదేశ ఘన చరిత మనకు తెలుస్తుంది. ఇది యువతకు స్ఫూర్తిగా ఉంటూ భవిష్యత్‌కు దిశా నిర్దేశకంగా నిలుస్తోంది. ‘ ఘన చరిత గల దేశం ఎప్పుడూ ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవంతో ముందడుగు వేయాలి. కానీ కొందరు మన పూర్వ చరిత్రలో పెద్దస్థాయిలోనే ఆత్మన్యూనత భావాలను నింపేశారు. అమృతకాలంలో ఈ బానిసత్వపు ఆలోచనలకు స్వస్తిపలికి దేశాన్ని అభివృద్ధిలో సమున్నత శిఖరాలపై నిలిపేందుకు కృషిచేయాలి’ అని ప్రజలకు మోదీ హితవు పలికారు. ‘ఒంటరిగా పోరాడారే తప్ప మొఘల్స్‌కు తలవంచలేదు. ఈ అసమాన ధీరత్వమే దేశానికి శతాబ్దాలుగా స్ఫూర్తిగా నిలుస్తోంది’ అని వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు