భళా! ఒడిశా ప్రజలకు ప్రధాని ప్రశంసలు

29 May, 2021 09:18 IST|Sakshi

రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు

తుపాను బీభత్సంపై సమీక్ష

భువనేశ్వర్‌: యాస్‌ తుపాను విసిరిన సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా కృషిచేస్తాయని, ఒడిశా సంక్షేమ కార్యకలాపాల్లో రాష్ట్రంతో కలిసి కేంద్రం కృషి చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. యాస్‌ తుపానుతో సంభవించిన నష్టాన్ని నివారించడంలో రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందజేస్తుందని తెలిపారు. తుపాను సహాయం, పునరావాసం, పునరుద్ధరణ, జీవనోపాధి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. యాస్‌ తుపాను రాష్ట్రంలో  10 కోస్తా జిల్లాల్ని ప్రభావితం చేసింది.

పలు చోట్ల సముద్రపు కెరటాలు తీరం దాటాయి. నది గట్లు తెంచుకున్నాయి. విద్యుత్‌ వ్యవస్థ కుప్పకూలింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావాన్ని పరిశీలించేందుకు ప్రధాని శుక్రవారం రాష్ట్రానికి విచ్చేసి గవర్నర్‌ ప్రొఫెసర్‌ గణేషీ లాల్, ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ సమక్షంలో యాస్‌ తీవ్రత, నష్టంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ యాస్‌ విపత్తును ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రజలు ప్రదర్శించిన సమయ స్ఫూర్తి కేంద్ర, రాష్ట్ర సహాయ బృందాలకు అదనపు బలం చేకూర్చాయని ప్రశంసించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ వెన్నంటి స్థైర్యం పెంపొందిస్తున్నారని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ఆనందం వ్యక్తం చేశారు.

కొత్త ఆలోచనలతో విపత్తు నిర్వహణ
ముందస్తు విపత్తు నిర్వహణ కార్యాచరణతో యాస్‌ బీభత్సాన్ని రాష్ట్రప్రభుత్వం  సమర్ధంగా ఎదుర్కోగలిగిందని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ ప్రధాన మంత్రికి వివరించారు. ఆకస్మిక వాతావరణ మార్పులతో ఏటా ప్రకృతి విపత్తుల్ని ఒడిశా ఎదుర్కొంటోందని సీఎం తెలిపారు. విపత్తుల్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు దీర్ఘకాల ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని సీఎం నవీన్‌ పట్నాయక్‌ ప్రధానమంత్రిని అభ్యర్థించారు. విపత్తు తాండవంతో కోతకు గురవుతున్న తీర ప్రాంతాలు, నది గట్ల సంరక్షణ, కుప్పకూలుతున్న విద్యుత్‌ వ్యవస్థ పునరుద్ధరణకు దీర్ఘకాల ప్రాజెక్టులకు కేంద్రం అనుమతించాలని కోరారు. యాస్‌ ప్రభావిత ప్రాంతాల్లో  కొనసాగుతున్న సహాయ, పునరుద్ధరణ, పునర్నిర్మాణ, పనరావాసం కార్యకలాపాలు ప్రధానమంత్రికి వివరించారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ప్రతాప్‌ చంద్ర షడంగి ఈ సమావేశానికి హాజరయ్యారు.

విహంగ వీక్షణం
యాస్‌ నష్టంపై సమీక్ష ముగిసిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆకాశ మార్గంలో యాస్‌ ప్రభావిత ప్రాంతాల్ని సందర్శించి ఢిల్లీకి బయల్దేరారు. ఈ విహంగ వీక్షణం ఆధారంగా త్వరలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తారని సమావేశానికి హాజరైన కేంద్ర ప్రతాప్‌ చంద్ర షడంగి తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు