రైతన్నల ఆదాయం రెట్టింపు చేస్తాం

10 Aug, 2021 03:39 IST|Sakshi

అన్ని రకాల వనరులు కల్పించేందుకు సిద్ధం: మోదీ

9వ విడత ‘పీఎం–కిసాన్‌’ విడుదల 

9.75 కోట్ల మంది ఖాతాల్లోకి రూ.19,500 కోట్లు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా రైతన్నల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టినట్లు ప్రధాని మోదీ చెప్పారు. ఆయన సోమవారం ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి(పీఎం–కిసాన్‌) పథకం కింద తొమ్మిదో విడతలో 9.75 కోట్ల మందికిపైగా రైతుల ఖాతాల్లోకి రూ.19,500 కోట్లు బదిలీ చేశారు. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో పంటల సాగుకు పీఎం–కిసాన్‌ సొమ్ము రైతాంగానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.

అన్నదాతల ఆదాయాన్ని పెంచాలన్నదే తమ లక్ష్యమని, అన్ని రకాల వనరులను కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.  మన రైతాంగం సంక్షేమం కోసం ఎన్నో పథకాల్లోకి తీసుకొచ్చామని గుర్తుచేశారు. రూ.లక్ష కోట్లతో అగ్రి–ఇన్‌ఫ్రా ఫండ్‌ ఏర్పాటు చేశామన్నారు. హనీ బీ(తేనెటీగలు) మిషన్‌తో మన దేశం నుంచి తేనె ఎగుమతులు భారీగా పెరిగాయని, తద్వారా తేనెటీగల పెంపకందారులు అదనపు ఆదాయం పొందుతున్నారని వివరించారు. జమ్మూకశ్మీర్‌లో సాగయ్యే కుంకుమ పువ్వును ‘నాఫెడ్‌’ రిటైల్‌ స్టోర్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.

రికార్డు స్థాయిలో ఉత్పత్తి  
కరోనా ప్రతికూల కాలంలోనూ 2020–21లో రైతులు రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేశారని మోదీ ప్రశంసించారు. వరి, గోధుమలు, చక్కెర ఉత్పత్తిలోనే కాదు, వంట నూనెల ఉత్పత్తిలోనూ స్వయం సమృద్ధి సాధించాలి్సన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇండియాలో తృణ ధాన్యాల ఉత్పత్తి గత ఆరేళ్లలో 50 శాతం పెరిగిందని, దేశీయంగా వంట నూనెల ఉత్పత్తి విషయంలోనూ ఇదే స్ఫూర్తిని చాటాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతిలో మన దేశం  టాప్‌–10 దేశాల జాబితాలో చేరిందన్నారు.

మరిన్ని వార్తలు