హైబ్రిడ్‌ విద్యా విధానమే ఉత్తమం: ప్రధాని మోదీ

8 May, 2022 05:21 IST|Sakshi

న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థులు టెక్నాలజీకి విపరీతంగా అలవాటు పడకుండా హైబ్రిడ్‌ విద్యా విధానాన్ని అనుసరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ రెండు రకాల పద్ధతుల ద్వారా బోధన జరగాలన్నారు.  జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) అమలుపై ప్రధాని శనివారం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఆన్‌లైన్‌ విధానం ఎక్కువ కావడంతో పిల్లలు టెక్నాలజీకి ఎక్కువగా అలవాటు పడుతున్నారని ప్రధాని హెచ్చరించారు.

సమానత్వం, సమగ్రత, అనుసంధానం, నాణ్యమైన విద్య వంటి లక్ష్యాలతో జాతీయ విద్యా విధానాన్ని రూపొందించి , అమలు చేస్తున్నట్టు మోదీ చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో డేటాబేస్‌లన్నింటినీ, పాఠశాలల్లోని రికార్డులతో  అనుసంధించాలని చెప్పారు. ఈ  పరిజ్ఞాన సహకారంతో పాఠశాలల్లోనే పిల్లలకు  ఆరోగ్య పరీక్షలు నిర్వహించివచ్చునని ప్రధాని చెప్పినట్టుగా అధికారిక ప్రకటన వెల్లడించింది. డ్రాపవుట్‌  విద్యార్థుల్ని గుర్తించి   బడి బాట పట్టించడానికి ఈ విధానం  దృష్టి సారిస్తోందని ప్రధాని వివరించారు.

మరిన్ని వార్తలు