పోలీసులంటే ఇంకా భయమే

13 Mar, 2022 02:18 IST|Sakshi
రోడ్‌షోలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ

ప్రజల మనసు గెలుచుకోవాలి: మోదీ

వారికి అలాంటి శిక్షణ అందాలి

టెక్నాలజీ సాయం తీసుకోవాలి

అంతర్గత సంస్కరణలే మార్గం

ఆర్‌ఆర్‌యూ స్నాతకోత్సవంలో ప్రధాని

గాంధీనగర్‌: అంతర్గత భద్రతా వ్యవస్థను ఆధునీకరించేందుకు స్వాతంత్య్రానంతరం పెద్దగా ప్రయత్నాలే జరగలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘‘బ్రిటిష్‌ హయాంలో జనాలను భయభ్రాంతులను చేయడమే అంతర్గత భద్రతా వ్యవస్థ లక్ష్యంగా ఉండేది. ఇప్పటికీ ఈ విషయంలో పెద్దగా మార్పు రాలేదు. పోలీసులంటే ప్రజల్లో భయం, వారికి దూరంగా ఉండాలన్న భావనే కన్పిస్తున్నాయి’’ అని ఆవేదన వెలిబుచ్చారు. ఈ పరిస్థితిని మార్చేందుకు తక్షణం సంస్కరణలు రావాల్సిన అవసరముందన్నారు.

ఆయన శనివారం గాంధీనగర్‌లోని రాష్ట్రీ య రక్షా యూనివర్సిటీ (ఆర్‌ఆర్‌యూ) తొలి స్నాతకోత్సవంలో ప్రసంగించారు. పోలీసు సిబ్బంది సంఖ్యను పెంచితే చాలదని, టెక్నాలజీ, జనం సైకాలజీ, యువతరం భావోద్వేగాలను అర్థం చేసుకునే నైపుణ్యమున్న శిక్షితులైన అధికారులు తక్షణావసరమని అన్నారు. ‘‘పోలీసులు సంఘ విద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించగలగాలి. ప్రజలతో సున్నితంగా వ్యవహరించి వారిలో స్నేహభావన, నమ్మకం పెంపొందించాలి. అంటే శిక్షణ పద్ధతుల్లోనే మార్పు రావాలి’’ అని అన్నారు.

విపరీతమైన పనిభారం
పోలీసు సిబ్బంది విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని, పని భారంతో సతమతం అవుతున్నారని ప్రధాని అన్నారు. ‘‘వారికి ఆసరాగా నిలిచే ఉమ్మడి కుటుంబాల వంటి సంప్రదాయ వ్యవస్థలు క్షీణించడం పరిస్థితిని మరింత జటిలం చేసింది. పైగా నేటి పరిస్థితుల్లో భద్రతా సిబ్బంది కేవలం శారీరకంగా ఫిట్‌గా ఉంటే చాలదు. మానసికంగా కూడా దృఢంగా ఉండాలి. ఎందుకంటే శారీరక వైకల్యమున్నా మానసికంగా దృఢంగా సిబ్బంది భద్రతా వ్యవస్థలకు ఎంతగానో ఉపయోగపడగలరు. అందుకే ఒత్తిడిని దూరం చేసుకునేందుకు వారికి యోగ శిక్షణ, నిపుణుల మద్దతు వంటివి తప్పనిసరి’’ అని అభిప్రాయపడ్డారు.

ప్రైవేట్‌ సెక్యూరిటీ వ్యవస్థ, సంబంధిత స్టార్టప్‌ల విస్తరణను కూడా ప్రస్తావించారు. ఆర్‌ఆర్‌యూ విద్యార్థులు వాటిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. భద్రత, రక్షణ తదితర రంగాల్లో మహిళల రాక పెరుగుతుండటం శుభ పరిణామమన్నారు. 1,090 మంది ఆర్‌ఆర్‌యూ విద్యార్థులు ఈ సందర్భంగా పట్టాలు అందుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, గుజరాత్‌గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్, సీఎం భూపేంద్ర పటేల్‌ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు, నేర న్యాయ వ్యవస్థల్లో సుశిక్షిత సిబ్బందిని అందించేందుకు 2020లో ఆర్‌ఆర్‌యూ స్థాపన జరిగింది.

రెండు రోడ్‌ షోలు
వచ్చే డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్‌లో ప్రధాని మోదీ శనివారం మరో రెండు రోడ్‌ షోలు చేశారు. ఉదయం గాంధీనగర్‌ జిల్లాలో దేగం నుంచి లవద్‌లోని రాష్ట్రీయ రక్షా యూనివర్సిటీ దాకా 12 కిలోమీటర్ల రోడ్‌ షో నిర్వహించారు. ఓపెన్‌ టాప్‌ జీప్‌లో ప్రజలకు అభివాదం చేస్తూ సాగారు. సాయంత్రం అహ్మదాబాద్‌లో ఇందిరా బ్రిడ్జి నుంచి సర్దార్‌ పటేల్‌ స్టేడియం దాకా 3.5 కిలోమీటర్ల మేర మామూలు జీప్‌లో రోడ్‌ షో చేశారు. అయితే పలుచోట్ల వాహనం దిగి, ‘మోదీ, మోదీ’ అని నినదిస్తున్న జనాన్ని పలకరిస్తూ సాగారు. గుజరాత్‌లో 1988 నుంచీ బీజేపీయే అధికారంలో ఉంది.

మరిన్ని వార్తలు