నియంతలా మోదీ పాలన: ఖర్గే

14 Mar, 2023 05:13 IST|Sakshi
నిరసన ర్యాలీ సందర్భంగా మీడియాతో ఖర్గే, విపక్ష పార్టీల ఎంపీలు

హస్తినలో విపక్షాలతో కలిసి కాంగ్రెస్‌ నిరసన ర్యాలీ

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఒక నియంతలాగా పాలిస్తున్నారంటూ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధ్వజమెత్తారు. ‘‘బీజేపీ నేతలు ప్రజాస్వామ్యాన్ని అణచివేస్తూ దాన్ని రక్షిస్తున్నామని చెప్పుకుంటున్నారు. వాళ్ల డిక్షనరీలో రాజ్యాంగానికి స్థానం లేకుండా పోయింది’’ అంటూ దుయ్యబట్టారు. పార్లమెంటు అధికార పార్టీ తీరుకు నిరనసగా విపక్ష సభ్యులతో కలిసి పార్లమెంట్‌ నుంచి విజయ్‌ చౌక్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. బీఆర్‌ఎస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ, వామపక్షాల సభ్యులు ఇందులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ.. ప్రతిపక్షాలను వేధించడమే లక్ష్యంగా దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని, పైగా ప్రజాస్వామ్యం, జాతీయవాదం, దేశ గౌరవం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అధికార పార్టీ పెద్దల తీరు దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్లుగా ఉందన్నారు. ప్రధాని మోదీ గతంలో చైనా, దక్షిణ కొరియా, కెనడా, యూఏఈలో పర్యటించినప్పుడు ఏం మాట్లాడారో గుర్తుకు తెచ్చుకోవాలని ఖర్గే హితవు పలికారు. లోక్‌సభలో కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్, ప్రహ్లాద్‌ జోషీ చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని కోరుతూ కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ చౌదరి లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాకు లేఖ రాశారు.  

అందుకే పార్లమెంట్‌ వాయిదా: జైరామ్‌ రమేశ్‌  
పార్లమెంట్‌ సమావేశాలు జరగడం ప్రభుత్వానికి ఇష్టం లేదని, అందుకే వాయిదా వేశారని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరామ్‌ రమేశ్‌ విమర్శించారు. ఈ మేరకు ట్వీట్‌ చేశారు. అదానీ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలన్నదే ప్రభుత్వ కుతంత్రమని ఆరోపించారు.   
 

>
మరిన్ని వార్తలు