15 ఏళ్ల కాలం మనకు అత్యంత కీలకం

24 Nov, 2020 04:58 IST|Sakshi

దేశాభివృద్ధిలో గత ఆరేళ్ల కాలం చరిత్రాత్మకం

చేయాల్సిన పనులు ఇంకెన్నో మిగిలే ఉన్నాయి 

ప్రధాని మోదీ వ్యాఖ్యలు

ఢిల్లీలో ఎంపీల గృహ సముదాయం ప్రారంభం

న్యూఢిల్లీ: భారత్‌లాంటి యవ్వన ప్రజాస్వామ్య దేశానికి 2014 నుంచి 2029 వరకు.. 16వ లోక్‌సభ నుంచి 18వ లోక్‌సభ వరకు.. 15 ఏళ్ల కాలం అత్యంత కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశ అభివృద్ధిలో ఆరేళ్ల కాలం చరిత్రాత్మకమని తెలిపారు. మిగిలిన 9 ఏళ్లలో చేయాల్సిన పనులు ఇంకా ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. యువతకు 16, 17, 18 ఏళ్ల ప్రాయం చాలా ముఖ్యమని, అలాగే 16వ లోక్‌సభ నుంచి 18వ లోక్‌సభల వరకు కాలం మనదేశానికి అత్యంత కీలకమని వెల్లడించారు.

పార్లమెంట్‌ సభ్యుల కోసం దేశ రాజధానిలో నిర్మించిన బహుళ అంతస్తుల గృహ సముదాయాన్ని ప్రధాని మోదీ సోమవారం ఆన్‌లైన్‌ ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 16వ లోక్‌సభ(2014–19) కాలం దేశ ప్రగతిలో చరిత్రాత్మకంగా నిలిచిపోయిందని అన్నారు. 17వ లోక్‌సభ కాలంలో ఇప్పటిదాకా ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని గుర్తుచేశారు. ఇవన్నీ చరిత్రలో ఒక భాగమేనని తెలిపారు.

అనుకున్నవన్నీ గడువులోగా పూర్తి చేయాలి
ప్రస్తుత దశాబ్దంలో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి వచ్చే లోక్‌సభ(2024–29) కాలం ప్రధానమైన పాత్ర పోషించబోతోందని విశ్వసిస్తున్నట్లు ప్రధాని  అన్నారు. దేశాభివృద్ధిలో భాగంగా మనం సాధించాల్సింది ఎంతో ఉందన్నారు.   

ప్రజల మైండ్‌సెట్‌ మారింది
130 కోట్ల మంది ప్రజల కలలను నిజం చేసే వనరులు, గట్టి సంకల్పం మనకు ఉన్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు. స్వయం సమృద్ధి అనే లక్ష్యాన్ని సాధించే పట్టుదల ఉందని వివరించారు. దేశ ప్రజల మైండ్‌సెట్‌ మారిందనడానికి 16వ లోక్‌సభ ఒక ఉదాహరణ అని అన్నారు. 16వ లోక్‌సభలో 300 మందికిపైగా ఎంపీలు తొలిసారిగా ఎన్నికయ్యారని తెలిపారు. ప్రస్తుత లోక్‌సభలో ఉన్న ఎంపీల్లో 260 మంది ఎంపీలు మొదటిసారిగా ఎన్నికైన వారేనని పేర్కొన్నారు.  రికార్డు స్థాయిలో మహిళా ఎంపీలు ఉన్నారని చెప్పారు.  

నేడు సీఎంలతో భేటీ
ప్రధాని మోదీ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులతో నేడు రెండు వేర్వేరు వర్చువల్‌ సమావేశాలు నిర్వహించనున్నారు. మొదటగా ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకూ కరోనా కేసులు ఎక్కువగా ఉన్న 8 రాష్ట్రాలతో సమావేశం జరుపనున్నారు. వీటిలో కేరళ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, హరియాణా, రాజస్తాన్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌  ఉన్నాయి. ఈ సమావేశం అనంతరం అన్ని రాష్ట్రాల సీఎంలు, ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఇందులో ప్రత్యేకించి కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ గురించి చర్చించనున్నారు. కరోనాపై ప్రధాని మోదీ రాష్ట్రాలతో ఇప్పటికే  వర్చువల్‌ సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా