21వ శతాబ్దపు ఆవశ్యకాలు!

22 Sep, 2020 03:49 IST|Sakshi

వ్యవసాయ బిల్లులపై ప్రధాని మోదీ వ్యాఖ్య

న్యూఢిల్లీ:  తాజాగా పార్లమెంటు ఆమోదించిన వ్యవసాయ బిల్లులు 21వ శతాబ్దపు భారతదేశానికి అవసరమైనవని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేయడం, కనీస మద్దతు ధర వ్యవస్థ కొనసాగుతాయని పునరుద్ఘాటించారు. తాజా సంస్కరణలతో రైతులు తాము కోరుకున్న ధరకు, కోరుకున్న చోట తమ ఉత్పత్తులను అమ్ముకునే వీలు లభిస్తుందన్నారు.

వ్యవసాయ బిల్లులు రైతు వ్యతిరేక బిల్లులని, అవి  రైతులను నాశనం చేస్తాయని విపక్ష పార్టీలు నిరసిస్తున్న విషయం తెలిసిందే. హరియాణా, పంజాబ్‌ తదితర రాష్ట్రాల్లో ఈ బిల్లులకు వ్యతిరేకంగా రైతులు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. వ్యవసాయ బిల్లులపై విమర్శలను ప్రధాని తిప్పికొడుతూ.. ‘చాన్నాళ్లు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు సంబంధించిన నిబంధనల సంకెళ్లలో రైతులను ఉంచి, వారికి అన్యాయం చేసి, వారిని దోపిడీ చేసిన కొందరు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నార’న్నారు. ‘వ్యవసాయ రంగంలో ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మక మార్పుల వల్ల కొందరు ఆ రంగంపై పట్టు కోల్పోతున్నారు. వాళ్లే ఇప్పుడు కనీస మద్దతు ధరపై రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారు.

స్వామినాథన్‌ కమిటీ సిఫారసులను అమలు చేయకుండా ఏళ్లకేళ్లు గడిపిన వారే ఇప్పుడు మా నిర్ణయాలను విమర్శిస్తున్నారు’ అన్నారు. వ్యవసాయ మార్కెట్లకు తాజా బిల్లులు వ్యతిరేకం కాదని, ఆ మండీల కార్యకలాపాలు కొనసాగుతాయని ప్రధాని స్పష్టం చేశారు. త్వరలో ఎన్నికలు జరగనున్న బిహార్లో 9 హైవే ప్రాజెక్టులకు సోమవారం వర్చువల్‌ విధానంలో శంకుస్థాపన చేసిన సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లోని అన్ని గ్రామాలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించే ఆప్టికల్‌ ఫైబర్‌ ఇంటర్నెట్‌ సర్వీసెస్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు. కరోనా మహమ్మారి సమయంలోనూ రికార్డు స్థాయిలో గోధుమలను ప్రభుత్వం సేకరించిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో కన్నా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నూనె ధాన్యాల సేకరణ 24 రెట్లు పెరిగిందని వివరించారు.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా