రైతులది పవిత్ర ఆందోళన: ప్రధాని మోదీ

11 Feb, 2021 03:30 IST|Sakshi
లోక్‌సభలో మాట్లాడుతున్న నరేంద్ర మోదీ

వారంటే గౌరవం ఉంది

సాగు చట్టాలు వారి సంక్షేమం కోసమే

ఆందోళనకారులెవరో, ఆందోళన జీవులెవరో గుర్తించండి

లోక్‌సభలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రైతలంటే పార్లమెంటుకు, ప్రభుత్వానికి గౌరవం ఉందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. వారు చేస్తున్న ఉద్యమం పవిత్రమైనదన్నారు. కొత్త సాగు చట్టాలు అమల్లోకి వచ్చినప్పటికీ.. గతంలో ఉన్న వ్యవసాయ మార్కెట్‌ వ్యవస్థ కొనసాగుతుందని, ఇష్టమైనవారు ఆ సదుపాయాన్ని వాడుకోవచ్చు అని చెప్పారు. ప్రభుత్వంతో చర్చలకు రావాలని రైతులను మరోసారి కోరారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో జరిగిన చర్చకు ప్రధాని బుధవారం సమాధానం ఇచ్చారు. 

రైతులు వాస్తవాన్ని గుర్తించకూడదనే దురాలోచనతో పార్లమెంటులో సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్నారని విమర్శించారు. చర్చలో పాల్గొన్న కాంగ్రెస్‌ సభ్యులెవరూ చట్టాల్లో లోపాలున్నాయని చూపలేకపోయారని పేర్కొన్నారు. ప్రసంగాన్ని పలుమార్లు విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. ప్రధాని ప్రసంగం అనంతరం విపక్ష సభ్యులు పెట్టిన సవరణ తీర్మానాలను స్పీకర్‌ ఓం బిర్లా ఓటింగ్‌కు పెట్టగా, వాటిని సభ తిరస్కరించింది. ఆ తరువాత, మూజువాణి ఓటుతో రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని సభ ఆమోదించింది.  కాంగ్రెస్‌ సభ్యులు సాగు చట్టాలను రద్దు చేయాలని నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్‌ చేశారు. తర్వాత డీఎంకే, టీఎంసీ సభ్యులు వాకౌట్‌ చేశారు.

మార్కెట్లు ఉంటాయి.. ఎమ్మెస్పీ ఉంటుంది
కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తరువాత కూడా వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయన్న విషయాన్ని ప్రధాని తన ప్రసంగంలో గుర్తు చేశారు. ఏ ఒక్క మండీ మూతపడలేదని, వాటి ఆధునీకరణకు బడ్జెట్‌లో మరిన్ని నిధులను కేటాయించామని తెలిపారు. కనీస మద్దతు ధర(ఎమ్మెస్పీ) విధానాన్ని  నిలిపివేయలేదని, ఎమ్మెస్పీపై వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ కొనసాగుతోందన్నారు. గతంలో వ్యవసాయ సంస్కరణలకు మద్దతుగా మాట్లాడిన విపక్ష పార్టీలు ఇప్పుడు సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్నాయన్నారు.


లోక్‌సభ నుంచి వాకౌట్‌ చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు

సాగు సంస్కరణలకు మద్దతుగా కేంద్ర మాజీ వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌ చేసిన వ్యాఖ్యలను ప్రధాని గుర్తుచేశారు. ‘తాము చేయరు.. వేరే వారిని చేయనివ్వరు’అని అర్థమిచ్చే భోజ్‌పురి సామెతను ఈ సందర్భంగా ప్రధాని ఉదహరించారు. రైతు స్వయం సమృద్ధి సాధించాలని, తన ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ పొందాలని, ఆ దిశగా ముందుకు వెళ్తున్నామని ప్రధాని తెలిపారు. ‘ఒక కొత్త రకం ఆశ్చర్యకర వాదన తొలిసారి తెరపైకి వచ్చింది. మేం అడగలేదు కదా.. ఎందుకు ఈ చట్టాలను తీసుకువచ్చారు? అని ప్రశ్నిస్తున్నారు. వరకట్నం, ట్రిపుల్‌ తలాఖ్‌ తదితర దురాచారాలను నిషేధిస్తూ చట్టాలు చేయమని కూడా ఎవరూ అడగలేదు. అయినా, పురోగామి సమాజంలో అవసరమని భావించి, ఆ చట్టాలు చేశారు’అని వివరించారు.

ఆధునిక సమాజం అభివృద్ధి చెందాలంటే మార్పు, సంస్కరణలు అత్యవసరమన్నారు. ఈ సందర్భంగా గతంలో తమిళనాడు ప్రభుత్వంలో ఉన్న ‘సీసీఏ’పోస్ట్‌ గురించి ప్రధాని వివరించారు. భారత్‌కు స్వాతంత్య్రం రాకముందు, నాటి యూకే ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌కు నాణ్యమైన సిగార్లను పంపించేందుకు అప్పట్లో సీసీఏ– చర్చిల్‌ సిగార్‌ అసిస్టెంట్‌ అనే ఒక ఉద్యోగాన్ని సృష్టించారని, ఆ పోస్ట్‌ చర్చిల్‌ 1945లో పదవి నుంచి దిగిపోయిన తరువాత, భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తరువాత కూడా కొనసాగిందని వెల్లడించారు. సదుద్దేశంతో చేసినప్పుడు ఫలితం కూడా మంచిగానే ఉంటుందన్న నమ్మకంతో తమ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టిందన్నారు. ‘కరోనాతో భారత్‌ కుప్పకూలుతుందని అంతా అంచనా వేశారు. కానీ, ఈ సంక్షోభం నుంచి విజయవంతంగా బయటపడగలమని మన ప్రజలు నిరూపించారు’అని అన్నారు.

వారు హైజాక్‌ చేశారు
రైతుల ఆందోళన పవిత్రమైనది. కానీ ఈ పవిత్రమైన ఉద్యమాన్ని కొందరు ఆందోళనజీవులు హైజాక్‌ చేసి, ఉగ్రవాదం వంటి తీవ్రమైన నేరాలు చేసి జైళ్లకు వెళ్లిన వారి ఫొటోలు పెడుతున్నారు. దీనివల్ల ఫలితం వస్తుందా? టోల్‌ ప్లాజాలను అడ్డుకోవడం, టెలీకాం టవర్లను ధ్వంసం చేయడం పవిత్ర ఆందోళన అవుతుందా?’అని మోదీ ప్రశ్నించారు. ‘ఆందోళనకారుల వల్ల కాదు ఈ తరహా ఆందోళనజీవుల వల్ల పవిత్రమైన ఉద్యమం తప్పుదారి పడ్తోంది. అందువల్ల ప్రజలు ఆందోళన కారులు, ఆందోళన జీవుల మధ్య తేడాను గ్రహించాలి’అన్నారు. భారత ప్రజల సంకల్ప శక్తిని రాష్ట్రపతి ప్రసంగం ప్రతిబించిందని ప్రధాని కొనియాడారు.

రైతు సంక్షేమం మాటేది: కాంగ్రెస్‌
లోక్‌సభలో ప్రధాని చేసిన ప్రసంగంలో రైతుల ఆందోళనలకు పరిష్కారమేదీ లేదని కాంగ్రెస్‌ వ్యాఖ్యానించింది. సాగు చట్టాలపై రైతు ఆందోళనలకు సంబంధించి ప్రధాని సం తృప్తికర సమాధానం ఇవ్వకపోవడం వల్లనే సభ నుంచి వాకౌట్‌ చేశామని కాంగ్రెస్‌ ఎంపీలు తెలిపారు. ‘దాదాపు 206 మంది రైతులు ప్రా ణాలు కోల్పోయారు. అయినా, ఆ విషయంపై ప్రధాని స్పందించలేదు. రైతు సంక్షేమంపై ముఖ్యమైన చర్యలేవైనా ప్రకటిస్తారనుకున్నాం. కానీ ఆ ఊసే లేదు’అని కాంగ్రెస్‌ సీనియర్‌ ఎం పీ ఆధిర్‌ రంజన్‌ చౌధురి విమర్శించారు. సాగు చట్టాలను రద్దు చేసి, పూర్తిస్థాయిలో సంప్రదింపులు జరిపిన తరువాత కొత్త చట్టాలను రూపొందించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు