కాంగ్రెస్‌ ఖతం.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు

9 Nov, 2022 17:48 IST|Sakshi

సిమ్లా: దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఖతం అయిపోయిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. కంచుకోటల్లా భావించిన రాష్ట్రాల్లో కూడా ఆ పార్టీని తిరస్కరిస్తున్నారన్నారు. బుధవారం హిమాచల్‌ ప్రదేశ్‌లోని హామిర్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. తెలంగాణ, ఒడిశా, యూపీలో కాంగ్రెస్‌ సాఫ్‌ అయిపోయిందన్నారు. దేవుళ్లలాంటి ప్రజలను కాంగ్రెస్‌ మోసం చేసిందని అందుకే తగిన బుద్ది చెపుతున్నారన్నారు. 

ఇదిలా ఉంటే, హిమాచల్‌ ప్రదేశ్‌లో రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌ మహిళా ఓటర్లను ఆకట్టుకునే వ్యూహాలను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. అధికార బీజేపీ మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ప్రత్యేక మేనిఫెస్టో స్త్రీ సంకల్ప పత్ర విడుదల చేసింది.  ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు, నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలకు పెళ్లయ్యే సమయంలో రూ.51 వేల ఆర్థిక సాయం, ప్రాథమిక విద్య అభ్యసించే బాలికలకు ఉచిత సైకిళ్లు, ఉన్నత విద్య అమ్మాయిలకు స్కూటీలు, మహిళా సాధికారత సాధించడానికి వడ్డీ లేని రుణాలు ఇవ్వడానికి రూ.500 కోట్ల కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు, ఆశావర్కర్ల జీతం రూ.4,700కి పెంపు వంటి హామీలు గుప్పించింది.

చదవండి: (క్షమించండి అంటూ నితిన్‌ సంచలన వ్యాఖ్యలు... షాక్‌లో బీజేపీ)

కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకం కింద 1.36 లక్షల ఉచిత వంట గ్యాస్‌ కనెక్షన్లు, రాష్ట్రస్థాయిలో గ్రామీణ సువిధ యోజన కింద 3.24 లక్షల గ్యాస్‌ కనెక్షన్ల పంపిణీతో మహిళలు పొగ ముప్పు నుంచి విముక్తి చెందారని, తొలి స్మోక్‌ ఫ్రీ రాష్ట్రంగా హిమాచల్‌ ప్రదేశ్‌ నిలిచిందని ఆ పార్టీ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఈ ఎన్నికల్లో 18 ఏళ్ల వయసు పైబడిన మహిళలందరికీ హర్‌ ఘర్‌ లక్ష్మి నారి సమ్మాన్‌ నిధి పథకం కింద నెలకి  రూ.1500 ఇస్తామని ప్రకటించింది.

‘‘ఉన్నత విద్య అభ్యసించలేని యువతులు కానివ్వండి, సింగిల్‌ మదర్లు, వితంతువులు ఇలా అవసరం ఉన్న మహిళలందరికీ రూ.1500 బ్యాంకులో పడతాయి. వారికి ఆర్థిక స్వాతంత్య్రం లభిస్తుంది’’ అని కాంగ్రెస్‌ మహిళా ఎమ్మెల్యే ఆశాకుమారి చెప్పారు. అంతకు ముందే ఆప్‌ తాము అధికారంలోకి వస్తే నెలకి వెయ్యి రూపాయల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది.  

మరిన్ని వార్తలు