Modi Cabinet Expansion: నేటి సాయంత్రం కొత్త మంత్రుల ప్రమాణం!

7 Jul, 2021 14:15 IST|Sakshi
సింథియా, జమ్యాంగ్‌ త్సెరింగ్‌

జ్యోతిరాదిత్య, శంతను ఠాకూర్, వరుణ్‌ గాంధీ, ప్రీతమ్‌ గోపీనాథ్‌ ముండేలకు అవకాశం!

పలువురు మంత్రులకు ఉద్వాసన, శాఖల మార్పు!

జేడీయూ, అప్నాదళ్, ఎల్‌జేపీలకూ మంత్రిపదవులు!

కొత్తగా 27 మందికి చోటు?

సాక్షి, న్యూఢిల్లీ: యువ రక్తంతో కేంద్ర కేబినెట్‌ కొత్త రూపు సంతరించుకోనుంది. మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైంది. బుధవారం సాయంత్రం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మోదీ నేతృత్వంలో ఎన్డీయే రెండోసారి కొలువు దీరి రెండేళ్లు పూర్తయింది. ఈ నేపథ్యంలో పాలనను మరింత పటిష్టం చేసేందుకు మొదటిసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నారు. అలాగే 2022 మార్చిలో గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్‌ రాష్ట్రాల శాసనసభ కాలపరిమితి, అలాగే, 2022 మే నెలలో ఉత్తరప్రదేశ్‌ శాసనసభ కాలపరిమితి ముగియనుంది.

మంత్రివర్గ విస్తరణలో ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకోనున్నారు. అలాగే, యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కనుంది. ఇప్పటికే సీనియర్‌ మంత్రి థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ను మంత్రిమండలి నుంచి తప్పించి కర్నాటకకు గవర్నర్‌గా పంపించారు. ఇప్పుడున్న మంత్రుల్లో మరి కొందరు కూడా తమ పదవులను కోల్పో నున్నట్టు తెలుస్తోంది. అలాగే, కొందరి శాఖల్లోనూ మార్పులు చోటు చేసుకోనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మంత్రివర్గంలో మార్పుల ప్రకటనకు ముందే, బుధవారం ప్రధాని అధ్యక్షతన కేబినెట్‌ సమావేశం ఉంటుందని తెలిపాయి. 

యువతకు ప్రాధాన్యం
నేటి కేబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్త ముఖాలకు చోటు కల్పించనున్నట్టు, యువతకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌ నుంచి జ్యోతిరాధిత్య సింథియా, పశ్చిమ బెంగాల్‌ నుంచి శంతను ఠాకూర్‌ లేదా నిశిత్‌ ప్రామాణిక్, లద్దాఖ్‌ ఎంపీ జమ్యాంగ్‌ త్సెరింగ్, మహారాష్ట్ర నుంచి నారాయణ రాణె, డాక్టర్‌ ప్రీతమ్‌ గోపీనాథ్‌ ముండే, వరుణ్‌ గాంధీ, రాజస్థాన్‌ నుంచి చంద్రప్రకాశ్‌ జోషి, రాహుల్‌ కశ్వాన్‌లకు అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంత్రిమండలిలో 20 మంది కేబినెట్‌ మంత్రులు, 9 మంది స్వతంత్ర హోదా గల మంత్రులు, 23 మంది సహాయ మంత్రులు.. మొత్తంగా 52 మంది మాత్రమే ఉన్నారు.

తాజాగా ఈ సంఖ్యను 79కి పెంచనున్నట్టు తెలుస్తోంది. అంటే, మరో 27 మందితో మంత్రిమండలి పునర్వ్యవస్థీకరణ ఉండనుందని సమాచారం. వీరిలో అత్యధికులు కొత్తవారే ఉండనున్నారు. మరోవైపు, మహిళల ప్రాతినిధ్యం పెంచడంతో పాటు వివిధ రంగాల్లో నిపుణులైన ఒకరిద్దరికి కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలని ప్రధాని యోచిస్తున్నట్లు తెలిసింది. మంత్రిమండలిలో గరిష్టంగా 81 మంది వరకు ఉండవచ్చు. ఆరెస్సెస్‌ ముఖ్య నేతలు మోహన్‌ భాగవత్, కృష్ణ గోపాల్, మన్మోహన్‌ వైద్య గత కొన్ని రోజులుగా ఢిల్లీలోనే ఉండడం గమనార్హం. 

కేబినెట్‌లోకి మిత్రపక్షాలు..
ఎన్డీయే నుంచి శివసేన, శిరోమణి అకాళీదళ్‌ వెళ్లిపోయాక ప్రస్తుతం రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా ఒక్కటే అధికారం పంచుకుంటోంది. ఈ నేపథ్యంలో ఎన్డీయే మిత్రపక్షాలైన జేడీయూ, ఎల్‌జేపీ, అప్నాదళ్‌లకు కేబినెట్‌లో చోటు దక్కనుంది. అప్నాదళ్‌ నుంచి ఆ పార్టీ అధ్యక్షురాలు అనుప్రియా పటేల్, జేడీయూ నుంచి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు రామచంద్రప్రసాద్‌ సింగ్, పూర్ణియా నియోజకవర్గ ఎంపీ సంతోష్‌ సింగ్‌ కుశావహ లేదా ముంగర్‌ నియోజకవర్గ ఎంపీ లలన్‌సింగ్, లోక్‌ జనశక్తి పార్టీ నుంచి పశుపతి కుమార్‌ పారస్‌లకు చోటు దక్కే అవకాశముంది. మరో మిత్రపక్షం ‘ఆల్‌ ఇండియా జార్ఖండ్‌ స్టుడెంట్స్‌ యూనియన్‌’కు కూడా అవకాశం లభించనుందని సమాచారం. 


పారస్, నారాయణ రాణె 

యూపీకి ప్రాధాన్యత
ఉత్తరప్రదేశ్‌ శాసన సభకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో యూపీ నుంచి కనీసం ఐదుగురికి మంత్రిపదవులు లభించే అవకాశం కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రదేవ్‌ సింగ్, మహరాజ్‌గంజ్‌ ఎంపీ పంకజ్‌ చౌదరి, పిలిబిత్‌ ఎంపీ వరుణ్‌ గాంధీ, జాతీయ ఎస్సీ కమిషన్‌ మాజీ ఛైర్మన్, ఎంపీ రాంశంకర్‌ కటేరియా, రాజ్యసభ సభ్యుడు సకల్‌దీప్‌ రాజ్‌భర్‌లకు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. బీహార్‌ నుంచి మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్‌ మోదీకి కేబినెట్‌ బెర్త్‌ ఖాయమైనట్టు సమాచారం. మధ్యప్రదేశ్‌ నుంచి ఇద్దరికి చోటు దక్కనుంది.

రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాధిత్య సింథియాతోపాటు ఎంపీ రాకేష్‌ సింగ్‌లకు అవకాశం దక్కనున్నట్టు తెలుస్తోంది. అస్సాం మాజీ ముఖ్యమంత్రి శర్వానంద సోనోవాల్, ఉత్తరాఖండ్‌ తాజా మాజీ ముఖ్యమంత్రి తీరథ్‌సింగ్‌రావత్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారాయణ రాణేలకు కేబినెట్‌ పదవులు దక్కనున్నట్టు సమాచారం. రాజస్థాన్‌ నుంచి ఛిత్తోర్‌గఢ్‌ ఎంపీ చంద్రప్రకాశ్‌ జోషి, చురు ఎంపీ రాహుల్‌ కశ్వాన్, ఒడిశా నుంచి అశ్వినీ వైష్ణవ్‌కు అవకాశం దక్కనున్నట్టు సమాచారం. ఈశాన్య రాష్ట్రాల నుంచి ఇన్నర్‌ మణిపూర్‌ ఎంపీ డాక్టర్‌ రంజన్‌సింగ్‌ రాజ్‌కుమార్‌కు మంత్రిమండలిలో ప్రాతినిధ్యం దక్కనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌ మంగళవారం సాయంత్రం పార్టీ చీఫ్‌ జేపీ నడ్డాను కలుసుకోవడంతో, మంత్రివర్గంలో ఆయన చేరికపై ఊహాగానాలు ప్రారంభమయ్యాయి. 

తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరికి?
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు చోటు దక్కే అవకాశం తక్కువగా కనిపిస్తోంది. అయితే తెలంగాణ నుంచి ఆదిలాబాద్‌ ఎంపీ, ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన నేతగా పేరున్న సోయం బాపూరావుకు మంత్రివర్గంలో చోటు కల్పించడం ద్వారా ఆదివాసీలు, గోండ్లను ఆకట్టుకునే అవకాశం ఉంటుందని పార్టీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్‌ నుంచి నలుగురు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజాగా కంభంపాటి హరిబా బుకు మిజోరం గవర్నర్‌ పదవి దక్కడంతో.. మంత్రివర్గ కూర్పులో ఆంధ్రప్రదేశ్‌కు చోటు దక్కబోదని సంకేతం ఇచ్చినట్టయింది. 

కొత్తగా సహకార శాఖ
దేశంలోని సహకార వ్యవస్థను బలోపేతం చేసేందుకు సహకార మంత్రిత్వ శాఖను నూతనంగా ఏర్పాటు చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది బుధవారం కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు చేర్పులు జరుగబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో సహకార్‌ సే సమృద్ధి భావనను బలోపేతం చేసేందుకు సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయనున్నట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. ఈ శాఖకు ప్రత్యేక లీగల్, పాలసీ విధానాలను రూపొందిస్తారు. బుధవారం విస్తరణలో ఈ శాఖకు మంత్రిని ప్రకటించవచ్చు. నిజమైన ప్రజా ఉద్యమంగా సహకారోద్యమాన్ని తీర్చిదిద్దడమే దీని లక్ష్యం. సహకార సంఘాలు సులభంగా వ్యాపారాలు నిర్వహించుకునే వీలు కల్పించడం, మల్టి స్టేట్‌ కోఆపరేటివ్స్‌ను ఏర్పాటు చేయడంపై కొత్త శాఖ దృష్టి సారిస్తుంది.     

మరిన్ని వార్తలు