ప్రజాస్వామ్యానికి భారత్‌ తల్లిలాంటిది: ప్రధాని మోదీ

28 May, 2023 13:35 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నూతన పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం, కొత్త పార్లమెంట్‌లో సభ ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణసింగ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొలి ప్రసంగం చేశారు.

ఈ సందర్భంగా పార్లమెంట్‌లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ప్రతీ దేశ చరిత్రలో కొన్ని సందర్భాలు శాశ్వతంగా నిలిచిపోతాయి. అమృత్‌మహోత్సవ్‌ వేళ నూతన పార్లమెంట్‌ భవనాన్ని ఆవిష్కరించుకున్నాం. ఇది కేవలం భవనం మాత్రమే కాదు. 140 కోట్ల భారతీయుల ఆక్షాంకలకు ప్రతీక. కొత్త పార్లమెంట్‌ భవనం భారతీయల ధృడ సంకల్పాన్ని చాటి చెబుతుంది. స్వాతంత్ర్య పోరాట ఆకాంక్షలను పూర్తి చేసేందుకు కొత్త పార్లమెంట్‌ భవనం సాధనంగా ఉపయోగపడుతుంది. ఈ భవనం పూరాతన నుంచి నూతనత్వానికి మాధ్యమం. ప్రపంచానికి భారత్‌ ఆశాకిరణంగా కనిపిస్తోంది. ఆధునిక భారత్‌కు కొత్త పార్లమెంట్‌ అద్దం పడుతుంది.  పాత పార్లమెంట్‌ భవనంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యేవి. 

ఇది ప్రజాస్వామ్యానికి కొత్త దేవాలయం. ప్రవితమైన సెంగోల్‌ను పార్లమెంట్‌లో ప్రతిష్టించాం. సెంగోల్‌.. చోళుల కాలంలో కర్తవ్య నిష్టకు ప్రతీక. ఆత్మనిర్భర్‌ భారత్‌కు సాక్షిగా పార్లమెంట్‌ నిలుస్తుంది. భారత్‌ కొత్త లక్ష్యాలను ఎంచుకుంది. ప్రజాస్వామ్యానికి భారత్‌ తల్లిలాంటిది. భారత్‌ అభివృద్ధి చెందితే ప్రపంచం కూడా అభివృద్ధి చెందుతుంది. ప్రజల ఆశలు, ఆకాంక్షలను పార్లమెంట్‌ గౌరవిస్తుంది. 

లోక్‌సభ ప్రాంగణం నెమలి రూపంలో రాజ్యసభ ప్రాంగణం కమలాన్ని ప్రతిబింబిస్తుంది. గత 9 ఏళ్లలో 4 కోట్ల మంది పేదలకు ఇళ్లు కట్టించాం. ఎక్కడైనా ఆగిపోతే అభివృద్ధి అక్కడే ఆగిపోతుంది. ప్రజాస్వామ్యంలో ముందుకెళ్తూనే ఉండాలి. వచ్చే 25 ఏళ్లలో భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుంది. 

రానున్న రోజుల్లో ఎంపీల సంఖ్య పెరుగుతుంది. లోక్‌సభ సీట్లు పెరిగితే మరింత ఎక్కువ మంది కూర్చునే విధంగా కొత్త పార్లమెంట్‌ భవనంలో వెసులుబాటు ఉంటుంది.  ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పార్లమెంట్‌ నిర్మించాం. ఇతర దేశాలకు భారత్‌ సాగించిన ప్రయాణం ఆదర్శంగా నిలుస్తుంది. అందరిలోనూ దేశమే ముందు అన్న భావన కలగాలి. వచ్చే 25 ఏళ్లు దేశాభివృద్ధికి పాటుపడాలి. భారత్‌ విజయ ప్రస్తానం రాబోయే రోజుల్లో మిగిలిన దేశాలకు ప్రేరణ. పార్లమెంట్‌లో తీసుకునే ప్రతీ నిర్ణయం రాబోయే తరాలను బలోపేతం చేస్తుంది. ఈరోజ చరిత్రలో నిలిచిపోతుంది’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు