ప్రతి పౌరుడికీ వ్యాక్సిన్‌

18 Oct, 2020 03:55 IST|Sakshi

టీకా పంపిణీకి పూర్తి సన్నద్ధతతో ఉండండి

కోవిడ్‌పై పోరులో అలసత్వం వద్దు

ఉన్నత స్థాయి సమావేశంలో ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: దేశంలోని ప్రతి పౌరుడికీ కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ తప్పనిసరిగా అందేలా పూర్తిస్థాయి సన్నద్ధతతో ఉండాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఎన్నికలు, విపత్తుల సమయాల్లో మాదిరిగానే టీకా పంపిణీలో కూడా అన్ని స్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం, పౌర సమాజాలు పాలుపంచుకోవాలన్నారు. దేశంలో కోవిడ్‌–19 పరిస్థితి, టీకా సరఫరా, పంపిణీకి చేపట్టిన ఏర్పాట్లపై ప్రధాని మోదీ శనివారం ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. దేశ విస్తీర్ణం, జనాభా, భౌగోళిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకుని ప్రతిపౌరుడికీ టీకా వేగంగా అందేలా చూడాలన్నారు. ‘టీకా రవాణా, పంపిణీ, నిర్వహణ యంత్రాంగాలను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది.

ఇందులో భాగంగా వ్యాక్సిన్‌ నిల్వకు అవసరమైన పర్యవేక్షణ యంత్రాంగం, కోల్డ్‌స్టోరేజీ ఏర్పాట్లు, పంపిణీ, వయల్స్, సిరంజీల వంటివి అందుబాటులో ఉంచడం, అవసరాలను ముందుగానే గుర్తించి స్పందించే వ్యవస్థలను ముందుగానే ఏర్పాటు చేసుకోవాలి’అని ప్రధాని తెలిపారు. దేశంలో రోజువారీ కేసులు, కేసుల్లో పెరుగుదల రేటు తగ్గుతోందన్న ప్రధాని.. ఈ సమయంలో ఎలాంటి నిర్లక్ష్యం తగదన్నారు. మహమ్మారిని కట్టడి చేసే ప్రయత్నాలను కొనసాగించాలన్నారు. ఈ రానున్న పండగ సీజన్‌లో మాస్కు ధరించడం, చేతులు కడుక్కోవడం, పరిశుభ్రత పాటించడం వంటివి తప్పనిసరిగా కొనసాగించాలని కోరారు.

దేశంలో అభివృద్ధి చేస్తున్న మూడు టీకాల్లో రెండో దశ ట్రయల్స్‌లో రెండు, మూడో దశలో ఒక టీకా ఉన్నాయని చెప్పారు. ‘పొరుగున ఉన్న అఫ్గానిస్తాన్, భూటాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మారిషస్, నేపాల్, శ్రీలంక దేశాల శాస్త్రవేత్తలతో మన శాస్త్రవేత్తలు సమన్వయం చేసుకుంటూ పరిశోధన సామర్థ్యాన్ని మెరుగు పరుచుకుంటున్నారు. బంగ్లాదేశ్, మయన్మార్, ఖతార్, భూటాన్‌ తమ దేశాల్లో కూడా క్లినికల్‌ ట్రయల్స్‌ చేపట్టాలని కోరుతున్నాయి. ఇరుగుపొరుగు దేశాలకే పరిమితం కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇతర దేశాలకు కూడా కోవిడ్‌ టీకా, ఔషధాల విషయంలో సాయపడాలి’అని అన్నారు.  

ఆ అనుభవాన్ని ఉపయోగించుకోవాలి
‘దేశంలో ఎన్నికలు, విపత్తు సమయాల్లో విజయవంతంగా పనిచేసిన అనుభవాన్ని టీకా పంపిణీ, సరఫరాలో కూడా ఉపయోగించుకోవాలి. టీకా పంపిణీలో కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల జిల్లా స్థాయి యంత్రాంగాలు, పౌర సమాజాలు, వలంటీర్లు, సంబంధిత రంగాల నిపుణుల భాగస్వామ్యం అవసరం ఉంది. ఐటీ సాంకేతికత వెన్నుదన్నుతో రూపుదిద్దుకునే ఈ పంపిణీ వ్యవస్థ మన ఆరోగ్య రంగానికే తలమానికంగా నిలవాలి’అని పేర్కొన్నారు.  

19న ‘గ్రాండ్‌ చాలెంజెస్‌’
ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే గ్రాండ్‌ చాలెంజెస్‌ వార్షిక సమావేశంలో మోదీ ప్రసంగించనున్నారు. ఆరోగ్యం, అభివృద్ధి విషయాల్లో ప్రపంచ సమాజం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లకు పరిష్కార మార్గాలను కనుగొనడం ఈ భేటీ లక్ష్యం. ‘ప్రపంచం కోసం భారత్‌’అంశంపై ఈ సమావేశం ప్రత్యేక దృష్టి సారించనుంది. ప్రజాప్రతినిధులు, శాస్త్రీయ రంగాల ప్రతినిధులు ఇందులో పాలుపంచుకుంటున్నారు. ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగే ఈ సమావేశాలు కొనసాగుతాయి. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరిగే ఈ సమావేశంలో దాదాపు 40 దేశాలకు చెందిన 1,600 మంది పాల్గొంటారు. ఈ సమావేశాలు గత 15 సంవత్సరాలుగా జరుగుతున్నాయి.  

దేశంలో కరోనా వైరస్‌ మ్యుటేషన్‌ లేదు
దేశంలో కరోనా వైరస్‌ జన్యుపరంగా స్థిరంగా ఉందనీ, ఎటువంటి మ్యుటేషన్‌కు గురికాలేదని తమ అధ్యయనంలో తేలిందని ఐసీఎంఆర్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ బయోటెక్నాలజీ అధికారులు ప్రధానికి తెలిపారు. వైరస్‌లో మ్యుటేషన్‌ సంభవిస్తే టీకా అభివృద్ధిపై అది ప్రభావం చూపుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ అధ్యయనం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇటీవలి కాలంలో కరోనా వైరస్‌లో చోటుచేసుకున్న మ్యుటేషన్లు వివిధ దేశాల్లో కొనసాగుతున్న టీకాల రూపకల్పనపై ఎటువంటి ప్రభావం చూపబోదని అంతర్జాతీయ సంస్థల అధ్యయనాల్లోనూ రుజువయింది. వైరస్‌లో సంభవించే కొన్ని మార్పులతో వైరస్‌ వ్యాప్తి వేగవంతం అవుతుందనే అంచనాలున్నాయి. దాదాపు 72 దేశాల్లో సంభవించిన కరోనా వైరస్‌ జెనోమ్‌ మ్యుటేషన్లతో భారత్‌లోని 5.39 శాతం మ్యుటేషన్లకు పోలికలున్నట్లు కూడా గత నెలలో ఓ శాస్త్రవేత్తల బృందం తెలిపిందని వారు చెప్పారని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.

మరిన్ని వార్తలు