అన్ని రంగాల్లోనూ ఆత్మనిర్భర్‌ 

31 Aug, 2020 04:16 IST|Sakshi

ప్రపంచ మార్కెట్లో వాటా లక్ష్యంగా దేశీయ ఆటబొమ్మల తయారీ 

‘భారత్‌’ కేంద్రంగా కంప్యూటర్‌ గేమ్స్‌ రూపకల్పన 

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ పిలుపు 

న్యూఢిల్లీ: అన్ని రంగాల్లోనూ స్వావలంబ భారత్‌ దిశగా కృషి చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రపంచ ఆటబొమ్మల మార్కెట్‌ సుమారు రూ. 7 లక్షల కోట్లు కాగా.. అందులో భారత్‌ వాటా చాలా తక్కువగా ఉందని గుర్తు చేశారు. భారత్‌లోని స్టార్టప్స్, యువ పారిశ్రామికవేత్తలు ఈ దిశగా ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రపంచ ఆట బొమ్మల కేంద్రంగా భారత్‌ రూపుదిద్దుకోగలదని, స్థానిక ఆట బొమ్మలకు ప్రోత్సాహం అందించాల్సిన అవసరం ఉందని ‘మన్‌ కీ బాత్‌’లో మోదీ వ్యాఖ్యానించారు.

‘దేశంలో నిపుణులైన బొమ్మల తయారీదారులున్నారు. బొమ్మల తయారీ ద్వారా దేశ ఘన చరిత్రను ప్రచారం చేయవచ్చు. గొప్ప భవిష్యత్తుకు బాటలు వేయవచ్చు’అన్నారు. ప్రత్యేకంగా భారత్‌పైనే, భారత్‌లోనే కంప్యూటర్‌ గేమ్స్‌ రూపకల్పన జరగాలని, ఆ దిశగా సమిష్టిగా కృషి చేయాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను కోరారు. భారత దేశ సాంస్కృతిక ఔన్నత్యం, సంప్రదాయాలు కొత్త కొత్త కంప్యూటర్‌ గేమ్స్‌ తయారీకి స్ఫూర్తినివ్వగలవన్నారు.

‘మన దేశంలో చాలా విషయాలున్నాయి. మన చరిత్ర ఘనమైనది. దేశ చరిత్రపై ఆధారపడ్డ గేమ్స్‌ను భారత్‌లోనే రూపొందించాలని దేశంలోని నిపుణులైన యువతను కోరుతున్నా’అన్నారు. ప్రతీనెల చివరి ఆదివారం ‘మన్‌ కీ బాత్‌’పేరుతో ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారనే విషయం తెలిసిందే. ప్రపంచ ఆట బొమ్మల మార్కెట్లో భారత్‌ వాటాను పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇటీవల ప్రధాని మోదీ ఒక అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రపంచ ఆటబొమ్మల ఉత్పత్తి, ఎగుమతుల్లో చైనా ప్రథమ స్థానంలో ఉంది. 

ప్రధాని ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. 
► కరోనా మహమ్మారి సమయంలో ఉత్సవాల నిర్వహణలో భారతీయులు గొప్ప సంయమనం, నిరాడంబరతను పాటిస్తున్నారు. ఇది అభినందనీయం.  

► ఈ ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఇందుకు అన్నదాతలకు అభినందనలు. గత సంవత్సరం కన్నా మొత్తంగా దాదాపు 7% సాగు విస్తీర్ణం పెరిగింది. వరి సాగు 10%, పప్పు ధాన్యాల సాగు 5%, నూనెగింజల సాగు 13%, పత్తి సాగు 3% పెరిగింది. 

► 2022 నాటికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలవుతున్న నేపథ్యంలో.. స్థానిక స్వాతంత్య్ర సమరయోధుల గురించి ఉపాధ్యాయులు విద్యార్థులకు వివరించాలి. నాడు స్థానికంగా జరిగిన ఘటనలను, కార్యక్రమాలను వారికి విశదీకరించాలి. దానివల్ల మరుగునపడిన చాలామంది స్వాతంత్య్ర యోధుల చరిత్ర ప్రపంచానికి తెలుస్తుంది. 

► ఇటీవల జరిగిన ఆత్మనిర్భర్‌ యాప్‌ ఇన్నోవేషన్‌ పోటీకి వచ్చిన దరఖాస్తుల్లో అత్యధికం దేశంలోని చిన్న, మధ్యతరహా పట్టణాల నుంచే వచ్చాయి. ఆత్మ నిర్భర్‌ భారత్‌ దిశగా చోటు చేసుకున్న కీలక ముందడుగుగా దీన్ని భావించవచ్చు. 

► భారతీయ పండుగలకు, ప్రకృతికి మధ్య గొప్ప సంబంధముంది. ప్రస్తుత గణేశ్‌ నవరాత్రి ఉత్సవాల్లో చాలా ప్రాంతాల్లో పర్యావరణ హిత వినాయకుడి ప్రతిమలనే ప్రతిష్టించడం
ముదావహం. 

► సెప్టెంబర్‌ నెలను పోషకాహార మాసంగా పరిగణిస్తున్నాం. ముఖ్యంగా గ్రామాల్లో అందరికీ పోషకాహారం అందించడం ఉద్యమంలా మారాలి. 

► భారత వ్యవసాయ నిధిని ఏర్పాటు చేస్తున్నాం. ప్రతీ జిల్లాలో పండించే పంటల వివరాలు, వాటిలోని పోషకాల వివరాలు అందులో అందుబాటులో ఉంచుతాం. 

► కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు   ఉద్దేశించిన మార్గదర్శకాలను పాటించండి. మాస్క్‌ ధరించండి. భౌతిక దూరం పాటించండి. వ్యక్తిగత పరిశుభ్రత కొనసాగించండి. 

సోఫీ.. విదా.. బలరామ్‌! 
కుక్క పిల్లలను పెంచుకోవాలనుకునే వారు ఇండియన్‌ బ్రీడ్‌ కుక్క పిల్లలకే ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధాని కోరారు. భారతీయ కుక్కపిల్లలు సామర్థ్యంలో వేటికీ తీసిపోవన్నారు. చవకగా లభిస్తాయని, భారతీయ పరిస్థితులకు తట్టుకోగలవని వివరించారు. ‘ఇండియన్‌ బ్రీడ్స్‌లో ముధోల్‌ హౌండ్, హిమాచలి హౌండ్‌ శ్రేష్టమైనవి. రాజపాలాయం, కన్నీ, చిప్పిపరాయి, కొంబయి కూడా గొప్పవే. ఇంటర్నెట్‌లో వెతకండి. వీటి గురించి మరిన్ని ఆశ్చర్యపరిచే వివరాలు తెలుస్తాయి’అని ప్రధాని తెలిపారు.

ఈ సందర్భంగా.. ఆగస్టు 15న ‘చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ కమండేషన్‌ కార్డ్‌’పురస్కారం పొందిన ఆర్మీ డాగ్స్‌ సోఫీ, విదాలను గుర్తు చేశారు. దేశ భద్రతలో అవి గొప్ప పాత్ర పోషించాయన్నారు. ‘అమర్‌నాథ్‌ యాత్రా మార్గంలో దుండగులు పెట్టిన పేలుడు పదార్థాలను బలరామ్‌ అనే శునకం గుర్తించి, అనేక ప్రాణాలను కాపాడింది’అని వివరించారు. ‘బీడ్‌ పోలీసులు తమతో పాటు పనిచేసిన రాకీ అనే శునకానికి గొప్పగా ఫేర్‌వెల్‌ ఇచ్చిన దృశ్యాలు మీరు టీవీలో చూసే ఉంటారు. 300 కేసులను ఛేదించడంలో పోలీసులకు రాకీ సహకరించింది’అన్నారు.  

కావాల్సింది పరీక్షలపై చర్చ: రాహుల్‌ 
ప్రధాని మోదీ మన్‌కీబాత్‌లో పరీక్షల గురించి మాట్లాడతారని విద్యార్థులు ఎదురు చూస్తుండగా.. ఆయన మాత్రం బొమ్మల గురించి మాట్లాడారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నీట్, జేఈఈ పరీక్షలను కోవిడ్‌ దృష్ట్యా వాయిదా వేయాలని కాంగ్రెస్‌ పార్టీ గట్టిగా కోరుతున్న విషయం తెలిసిందే.  

ప్రధాని నోట ఏటికొప్పాక  
మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో బొమ్మల గురించి మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ ఏటికొప్పాక బొమ్మల ప్రస్తావన తెచ్చారు. విశాఖకు చెందిన సి.వి.రాజు అద్భుతమైన నాణ్యతతో ఏటికొప్పాక బొమ్మలను తయారు చేస్తున్నారని కొనియాడారు. ఆయన స్థానిక బొమ్మలకు పూర్వవైభవం తెచ్చారన్నారు. దేశంలోని పలు ప్రాంతాల్లో నిపుణులైన బొమ్మల తయారీదారులు ఉన్నారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కొండపల్లి, కర్ణాటకలోని చెన్నపట్నం, తమిళనాడులోని తంజావూరు, అస్సాంలోని ధుబారీ, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి బొమ్మల తయారీ కేంద్రాలుగా ఎదిగాయన్నారు.  
 

మరిన్ని వార్తలు