ఫోన్‌ చేస్తే చాలు..చర్చలకు సిద్ధం..

31 Jan, 2021 04:00 IST|Sakshi
ఢిల్లీ రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తున్న ప్రధాని మోదీ

సాగు చట్టాల నిలిపివేతకు కట్టుబడి ఉన్నాం: మోదీ

న్యూఢిల్లీ: కొత్త వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాలతో మరోసారి చర్చలకు కేంద్రం సిద్ధమని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రైతు సంఘాలకు ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని  తెలిపారు. సమస్యల పరిష్కారానికి రైతు సంఘాలతో చర్చలకు ప్రభుత్వం ఫోన్‌కాల్‌ దూరంలోనే ఉందన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్‌లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆనవాయితీ ప్రకారం ప్రభుత్వం శనివారం వివిధ పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీకి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు.

‘రైతుల ఆందోళనలపై ప్రభుత్వం ఎటువంటి దాపరికం లేకుండా వ్యవహరిస్తుంది. జనవరి 22వ తేదీన రైతులతో జరిగిన చర్చల సందర్భంగా ఏడాదిన్నరపాటు కొత్త సాగు చట్టాల అమలును నిలిపివేస్తామంటూ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. ఫోన్‌కాల్‌ చేస్తే చాలు రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు వ్యవసాయ మంత్రి తోమర్‌ సిద్ధంగా ఉన్నారు’ అని స్పష్టం చేశారు. ‘పార్లమెంట్‌ కార్యక్రమాలు సజావుగా సాగేందుకు పెద్ద పార్టీలు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతరాయాలతో చిన్న చిన్న పార్టీలకు ఇబ్బందులు కలుగుతాయి. వాటికి తమ వాణి వినిపించే అవకాశం లేకుండా పోతుంది’అని ప్రధాని తెలిపారు. ఈ సందర్భంగా వివిధ పార్టీల నేతలు పార్లమెంట్‌ సమావేశాల్లో తాము ప్రస్తావించాలని భావిస్తున్న అంశాలను తెలిపారు.

కాంగ్రెస్‌ నేత గులాం నబీ ఆజాద్, శిరోమణి అకాలీదళ్‌కు చెందిన బల్వీందర్‌ సింగ్, శివసేన నేత వినాయక్‌ రౌత్, టీఎంసీ నేత బంధోపాధ్యాయ్‌ రైతు ఆందోళనలను ప్రస్తావించారు. కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరారు. ఈ అంశాన్ని చర్చించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని టీఎంసీ నేత బంధోపాధ్యాయ్‌ కోరారు. గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధానిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు దురదృష్టకరమంటూ వివిధ పార్టీల నేతలు పేర్కొన్నారు. ఆ ఘటనలకు శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న రైతులను బాధ్యులుగా చేయరాదని కోరారు. బడ్జెట్‌ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లును ప్రవేశపెట్టాలంటూ బీజేడీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, టీఆర్‌ఎస్‌ ప్రధానిని కోరాయి. అమెరికాలోని కాలిఫోర్నియాలో మహాత్ముని విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ప్రధాని మోదీ ఖండించారు.

ఫోన్‌ కాల్‌ దూరమే..
రైతుల ఆందోళనలపై ప్రభుత్వం ఎటువంటి దాపరికం లేకుండా వ్యవహరిస్తోంది. జనవరి 22న రైతులతో జరిగిన చర్చల సందర్భంగా ఏడాదిన్నరపాటు కొత్త సాగు చట్టాల అమలును నిలిపివేస్తామంటూ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉన్నాం. ఫోన్‌కాల్‌ చేస్తే చాలు రైతు సంఘాలతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం.


గాంధీజి వర్ధంతి  పురస్కరించుకుని శనివారం ప్రధాని మోదీ రాజ్‌ఘాట్‌లోని ఆయన సమాధి వద్ద నివాళులర్పించారు. ఆయన బోధనలు ఇప్పటికీ కోట్లాదిమందికి స్ఫూర్తినిస్తున్నాయన్నారు. జాతి శ్రేయస్సు కోసం, దేశానికి స్వాతంత్య్రం కోసం తమ జీవితాలను అర్పించిన ఎందరో మహనీయుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు