అత్యంత వేగంగా టీకా పరిశోధనలు...

29 Nov, 2020 05:18 IST|Sakshi
అహ్మదాబాద్‌లోని జైడస్‌ బయోటెక్‌ పార్కులో వ్యాక్సిన్‌ తయారీని పరిశీలిస్తున్న ప్రధాని మోదీ

కరోనా టీకా పురోగతిపై ప్రధాని సమీక్ష

ఒకే రోజు మూడు నగరాల్లో టూర్‌

శాస్త్రవేత్తల కృషికి అభినందనలు

ప్రధాని పర్యటన స్ఫూర్తి నింపిందన్న శాస్త్రవేత్తలు

అహ్మదాబాద్, హైదరాబాద్, పుణే: కరోనా మహమ్మారిని అరికట్టే వ్యాక్సిన్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్న వేళ టీకా పురోగతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా సమీక్షించారు. శనివారం వరసగా మూడు నగరాల్లో టీకా తయారీ కేంద్రాలను సందర్శించారు. అహ్మదాబాద్‌లోని జైడస్‌ బయోటెక్‌ పార్క్, హైదరాబాద్‌లోని భారత్‌ బయోటెక్, పుణే లోని సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలకు వెళ్లా రు. అక్కడ శాస్త్రవేత్తలను కలుసుకొని మాట్లాడారు.

వ్యాక్సిన్‌ ప్రయోగాలు, డోసుల ఉత్పత్తి, టీకా పంపిణీలో సవాళ్లను అధిగమించేలా జరుగుతున్న ఏర్పాట్లపై నేరుగా సమాచారాన్ని తెలుసుకోవడం కోసమే ప్రధాని మోదీ ఈ పర్యటన చేపట్టారని ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. భారత్‌ దేశీయంగా రూపొందిస్తున్న జైకోవ్‌–డీ, కొవాగ్జిన్‌ టీకాలపై పరిశోధనలు అత్యంత వేగంగా సాగుతూ ఉండడం దేశానికే గర్వ కారణమని ప్రధాని పేర్కొన్నారు. వ్యాక్సిన్‌ ప్రజలందరికీ చేరేలా మెరుగ్గా పంపిణీ చేయడానికి పలు సూచనల్ని కూడా శాస్త్రవేత్తలను అడిగి ప్రధాని తెలుసుకున్నారు.  

ప్రధాని రాకతో శాస్త్రవేత్తల్లో ఉత్సాహం  
జైడస్‌ బయోటెక్‌ పార్కుకి ప్రధాని రాక అక్కడ శాస్త్రవేత్తల్లో నైతిక స్థైర్యాన్ని పెంచింది. కోవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రజలకి అందుబాటులోకి తేవాలన్న తమ లక్ష్యానికి ప్రధాని రాక ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఆ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం జైకోవ్‌–డీ రెండో దశ ప్రయోగాల్లో ఉంది. వచ్చే ఏడాది మార్చి నాటికి ప్రయోగాలు పూర్తి చేసి ఏడాదికి 10 కోట్ల డోసుల్ని ఉత్పత్తి చేస్తామని జైడస్‌ క్యాడిలా చైర్మన్‌ పంకజ్‌ పటేల్‌ ఇప్పటికే ప్రకటించారు.  

సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో
అందరిలోనూ ఆశలు పెంచుతున్న ఆస్ట్రాజెనికా–ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీతో కలిపి సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) కొవిషీల్డ్‌ ప్రయోగాలు చేస్తోంది. ఈ వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి అత్యవసర లైసెన్స్‌ మంజూరు కోసం అవసరమయ్యే ప్రక్రియ కొనసాగుతోందని ఆ సంస్థ సీఈఓ ఆదార్‌ పూనావాలా వెల్లడించారు. హైదరాబాద్‌ సందర్శన పూర్తయ్యాక మధ్యాహ్నం 3.20కి మోదీ పుణేకి బయల్దేరారు. సాయంత్రం గం.4.30కి పుణే విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ్నుంచి 17 కి.మీ. దూరంలో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి హెలికాప్తర్‌లో వెళ్లారు. ఈ సంస్థ తయారు చేస్తున్న కొవిషీల్డ్‌ ప్రయోగాలను సమీక్షించారు.

వ్యాక్సిన్‌ అభివృద్ధి, నిల్వ చేయడం వంటి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. సీరమ్‌ చైర్మన్‌ డాక్టర్‌ సైరస్‌ పూనావాలా, ఆయన కుమారుడు సంస్థ సీఈఓ అదార్‌ పూనావాలాలు ప్రధానికి వ్యాక్సిన్‌ పురోగతికి సంబంధించిన వివరాలు తెలిపారు. అక్కడ శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బందితో కూడా ప్రధాని మాట్లాడారు. ‘‘సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో శాస్త్రవేత్తలతో చర్చలు బాగా జరిగాయి. వ్యాక్సిన్‌ పురోగతి, రాబోయే రోజుల్లో జరిగే పనుల గురించి వారు వివరించారు. టీకా తయారీ కేంద్రాన్ని కూడా పరిశీలించాను’’అని మోదీ ట్వీట్‌ చేశారు. సాయంత్రం 6 గంటల వరకు సీరమ్‌లోనే గడిపిన మోదీ 6.30కి ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు.  

పీపీఈ కిట్‌లో ప్రధాని  
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కి 20 కి.మీ. దూరంలో ఉన్న జైడస్‌ క్యాడిలా రీసెర్చ్‌ సెంటర్‌కు ప్రధాని పీపీఈ కిట్‌లో వెళ్లారు. శాస్త్రవేత్తలతో గంట సేపు సమావేశమయ్యారు. ‘‘జైడస్‌ బయోటెక్‌ పార్క్‌ని సందర్శించాను. దేశీయంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ ప్రయోగాల గురించి మరింత లోతైన సమాచారం కోసం స్వయంగా వెళ్లాను. అక్కడ శాస్త్రవేత్తల సమష్టి కృషి అభినందనీయం. కేంద్ర ప్రభుత్వం వారికి అన్ని విధాలా సహకరిస్తుంది’’అని మోదీ అహ్మదాబాద్‌ పర్యటన అనంతరం ట్వీట్‌ చేశారు. అక్కడ్నుంచి 11.40 గంటలకి హైదరాబాద్‌కి బయల్దేరారు. హకీమ్‌పేట వైమానిక స్థావరానికి చెందిన విమానాశ్రయంలో మధ్యాహ్నం ఒంటిగంటకు దిగిన ప్రధాని అక్కడ్నుంచి జినోమ్‌ వ్యాలీలో ఉన్న భారత్‌ బయోటెక్‌ సంస్థను సందర్శించారు. భారత్‌ బయోటెక్, ఐసీఎంఆర్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న కొవాగ్జిన్‌ టీకా పురోగతిపై సమీక్ష జరిపారు.  

వేసవి నాటికి పది వ్యాక్సిన్లు!
జెనీవా: వచ్చే ఏడాది వేసవి ముగిసేవరకు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 కరోనా వ్యాక్సిన్లు రెడీగా ఉంటాయని ఐఎఫ్‌పీఎంఏ డైరెక్టర్‌ జనరల్‌ ధామస్‌ క్యూని అంచనా వేశారు. అయితే టీకాల ఆవిష్కర్తలకు పేటెంట్‌ రక్షణ దొరకాలన్నారు. ప్రస్తుతానికి ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనికా టీకాలు క్లినికల్‌ట్రయిల్స్‌లో మంచి ఫలితాలు చూపుతున్నాయి. జాన్సన్‌ అండ్‌ జాన్సన్, నోవాక్స్, సనోఫి, జీఎస్‌కే, మెర్క్‌ లాంటి కంపెనీల టీకాలు సైతం క్రమంగా రేసులోకి వస్తాయని అంతర్జాతీయ ఫార్మా ఉత్పత్తిదారులు, సమాఖ్యల ఫెడరేషన్‌ అధినేత అంచనా వేశారు.

పలు ఫార్మా, బయోటెక్‌ కంపెనీలు కరోనా టీకా అభివృద్ధి, తయారీపై చాలా మొత్తాలు వెచ్చించాయని తామస్‌ చెప్పారు. అందువల్ల కంపల్సరీ లైసెన్సింగ్‌ కోసం పేటెంట్‌ రక్షణ ఎత్తివేస్తే తప్పిదం చేసినట్లేనన్నారు. పేటెంట్‌ భద్రత లేకపోతే సరైన నిపుణత లేకుండా టీకాలు తయారు చేసే ప్రమాదం ఉందన్నారు. వ్యాక్సిన్‌లకు కంపల్సరీ లైసెన్సింగ్‌ తీసుకురావాలని డబ్లు్యటీవోలో భారత్, దక్షిణాఫ్రికా ఇటీవల ప్రతిపాదించాయి. కానీ ఈ ప్రతిపాదనను యూఎస్‌ సహా ధనిక దేశాలు తిరస్కరించాయి.   

బ్రిటన్‌లో టీకా పంపిణీకి మంత్రి
లండన్‌: కరోనా టీకా పంపిణీ పర్యవేక్షణకు బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ఒక మంత్రిని ప్రత్యేకంగా నియమించారు. ప్రస్తుతం వ్యాపార, పారిశ్రామిక, శక్తివనరుల మంత్రిగా ఉన్న నదీమ్‌ జహవిని ఆరోగ్యమంత్రిగా నియమించారు. దీంతో పాటు ఆయనకు కోవిడ్‌ వ్యాక్సిన్‌ బాధ్యతలను అప్పగించారు. వచ్చే వేసవి వరకు నదీమ్‌ ఈ పదవిలో ఉంటారని ప్రధాని కార్యాలయం ప్రకటించింది. పది రోజుల్లో టీకా అందుబాటులోకి వస్తుందన్న వార్తల నేపథ్యంలో జాన్సన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు.

టీకా పంపిణీ పెద్ద బాధ్యతని అధికారులు హెచ్చరిస్తుండడంతో ఇందుకోసం ఏకంగా మంత్రినే నియమించారు. ముందుగా ఎన్‌హెచ్‌ఎస్‌ సిబ్బందికి వ్యాక్సిన్‌ ఇచ్చే అవకాశాలున్నాయని సమాచారం. డిసెంబర్‌లో ఫైజర్‌ టీకా అందుబాటులోకి రానుంది. ఈ టీకాను అల్ప ఉష్ణోగ్రతల వద్ద దాచిఉంచాలి. అలాగే సరిపడా డోసులు అందుబాటులోకి తేవాల్సిఉంటుంది. ఇవన్నీ సక్రమంగా జరిగితేనే టీకా పంపిణీ విజయవంతం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. నదీమ్‌ నియామకానికి రాణి ఆమోదం తెలిపారు.

అమెరికాలో బరిలోకి వైమానిక సేవలు
వాషింగ్టన్‌: ఫైజర్‌ రూపొందిస్తున్న కోవిడ్‌ వ్యాక్సిన్‌ను దేశమంతా పంచేందుకు అమెరికా ఎయిర్‌లైన్స్‌ శుక్రవారం చార్టర్‌ విమానాలను రంగంలోకి దించింది. యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి లభించిన తక్షణం టీకాను సరఫరా చేసేందుకు వీలుగా అమెరికా ఎయిర్‌లైన్స్‌ ఏర్పాట్లు చేస్తోంది. అనుమతులు లభిస్తే డిసెంబర్‌ రెండో వారం అనంతరం మాస్‌ ఇనాక్యులేషన్‌ నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. టీకాను సురక్షితంగా ఉంచేందుకు డ్రైఐస్‌ కావాల్సి ఉంటుంది. కానీ దీన్ని విమానాల్లో  అనుమతించరు.

టీకా కోసం నిబంధనల సవరణకు అనుమతుల కోసం ఎయిర్‌లైన్స్‌ చేసుకున్న దరఖాస్తును వైమానిక అ«థార్టీ ఎఫ్‌ఏఏ ఆమోదించింది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ను  –70 డిగ్రీల వద్ద స్టోర్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఫైజర్‌ డ్రైఐస్‌ కూర్చిన సూట్‌కేసుసైజు బాక్సులను సిద్ధం చేసింది. అలాగే, కంపెనీ అసెంబ్లీ కేంద్రాలవద్ద రిఫ్రిజిరేటెడ్‌ స్టోరేజ్‌ సైట్లను ఏర్పాటు చేస్తోందని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ వెల్లడించింది. బ్రసెల్స్‌ నుంచి చికాగోకు టీకా రవాణా చేసేందుకు యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాలను సిద్ధం చేసింది. అనుమతులు వచ్చిన తొలివారంలో  64 లక్షల డోసుల టీకాను పంపిణీ చేయాలని యూఎస్‌ఏ భావిస్తోంది. డిసెంబర్‌ 10న టీకాకు అనుమతులివ్వడంపై చర్చించేందుకు యూఎస్‌ఎఫ్‌డీఏ సమావేశం కానుంది.  

టీకా అత్యవసర వాడకానికి త్వరలో దరఖాస్తు
ఎస్‌ఐఐ సీఈఓ ఆదార్‌ పూనావాలా వెల్లడి
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ నియంత్రణకు ఆస్ట్రాజెనెకా–ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ను ఇండియాలో సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌ఐఐ) నిర్వహిస్తోంది. ఈ వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికిగాను రానున్న రెండు వారాల్లో డ్రగ్‌ కంట్రోలర్‌ ఆఫ్‌ ఇండియాకు దరఖాస్తు చేయనున్నట్లు ఎస్‌ఐఐ సీఈఓ ఆదార్‌ పూనావాలా శనివారం చెప్పారు. ఎమర్జెన్సీ యూజ్‌ లైసెన్స్‌ వచ్చిన తర్వాతే వ్యాక్సిన్‌ పంపిణీ సాధ్యమవుతుందన్నారు. ఇందుకోసం అవసరమైన డేటాను త్వరలో ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. ఆస్ట్రాజెనెకా–ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ను తొలుత భారత్‌లో, అనంతరం ఆఫ్రికా దేశాల్లో పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి మోదీ సీరం సంస్థను సందర్శించడం తమకు గొప్ప రోజు అని పేర్కొన్నారు.

కొత్త కేసులు 41,000
న్యూఢిల్లీ: దేశంలో గత  24 గంటల్లో 41,322 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 93,51,109కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో కరోనా కారణంగా 485 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,36,200కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య శనివారానికి 87,59,969కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 93.68 శాతానికి చేరింది. యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,54,940గా ఉంది. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్‌ కేసులు 4.87% ఉన్నాయి. మరణాల శాతం 1.46గా ఉంది. ఈ నెల 27 వరకూ 13.82  కోట్ల కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. శుక్రవారం 11,57,605 పరీక్షలు జరిపినట్లు తెలిపింది. మరణిస్తున్న వారిలో 70% మంది ఇతర దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారేనని చెప్పింది.  

టీకా పంపిణీకి ఆరోగ్య విభాగం సన్నద్ధం
కోవిడ్‌–19 టీకా పంపిణీ, నిర్వహణపై కేంద్ర ఆరోగ్య శాఖతో భాగస్వామ్యం కలిగిన నిపుణుల కమిటీ చురుగ్గా ఏర్పాట్లు  చేస్తోందని కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సైంటిఫిక్‌ అడ్వైజర్‌ కె.విజయ్‌ రాఘవన్‌ తెలిపారు. జాతీయ స్థాయి ఎన్నికల నిర్వహణ, సార్వత్రిక టీకా పథకం అమలు అనుభవాన్ని ఉపయోగించుకుంటూ  ఆరోగ్య సేవల విషయంలో రాజీ పడకుండా టీకాను పంపిణీ చేస్తామన్నారు. 

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా