వ్యాక్సినేషన్‌ నెమ్మదించొద్దు.. రాష్ట్రాలకు ప్రధాని సూచన

7 May, 2021 04:20 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  దేశంలో ప్రస్తుతం కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన పరిస్థితులపై ప్రధాని మోదీ గురువారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగంగా జరగాల్సిన అవసరాన్ని రాష్ట్రాలకు తెలియజేయాలని ప్రధాని అన్నారు. వైద్య సదుపాయాలను మెరుగుపర్చడానికి రాష్ట్రాలకు అవసరమైన సహాయాన్ని అందించాలని, మార్గనిర్దేశనం చేయాలని అధికారులకు సూచించారు. లక్షకు పైగా యాక్టివ్‌ కేసులు ఉన్న 12 రాష్ట్రాల పరిస్థితి, ఎక్కువగా మరణాలు సంభవిస్తున్న జిల్లాల గురించి అధికారులు ప్రధానికి తెలియచేశారు.

మహమ్మారిని త్వరగా, సంపూర్ణంగా అదుపులోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. పాజిటివిటీ రేటు 10% గాని,  లేదా అంతకంటే ఎక్కువగా ఉన్న జిల్లాలను గుర్తించడం, ఆసుపత్రుల్లో 60% కంటే పడకలు నిండిపోతే తీసుకోవాల్సిన చర్యలపై (స్థానికంగా ఆంక్షలు, లాక్‌డౌన్‌లు విధించడం) రాష్టాలకు పంపిన అడ్వైజరీ గురించి ప్రధానికి అధికారులు వివరించారు. అంతేగాక పరిస్థితులు సున్నితంగా ఉన్న రాష్ట్రాల గురించి ప్రధాని ప్రస్తావించారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో వేగం తగ్గకూడదని, ఈ మేరకు రాష్ట్రాలను అప్రమత్తం చేయాలని అన్నారు. రాష్ట్రాల వారీగా వ్యాక్సిన్‌ వృథా అవుతున్న తీరుపై మోదీ సమీక్షించారు.  

17.7 కోట్ల డోసులు..
దేశంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఏర్పడ్డ మందుల కొరతపై సమీక్ష జరిపారు. మందుల లభ్యతపై దృష్టిసారించాలన్నారు. రెమిడెసివిర్‌తో సహా కరోనా చికిత్సకు అవసరమైన అన్ని మందుల ఉత్పత్తి ప్రక్రియతో పాటు, వ్యాక్సిన్ల పురోగతి, రాబోయే కొద్ది నెలల్లో తయారు చేయవలసిన ఔషదాల ఉత్పత్తిని ప్రధాని సమీక్షించారు. సుమారు 17.7 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను రాష్ట్రాలకు సరఫరా చేసినట్లు అధికారులు ప్రధానికి తెలిపారు. మోదీ గురువారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావులతో ఫోన్లో మాట్లాడి తెలుగు రాష్ట్రాల్లో కోవిడ్‌ పరిస్థితిపై ఆరా తీశారు. ఒడిశా, జార్ఖండ్‌ సీఎంలతోనూ, జమ్మూకశ్మీర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌లతో మాట్లాడి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు