National Emblem: అవి మోదీ మార్కు సింహాలు.. క్రూరంగా, కోపంగా కనిపించడం అవసరమా?

13 Jul, 2022 02:42 IST|Sakshi

పార్లమెంట్‌ కొత్త భవనంపైని జాతీయ చిహ్నంపై ప్రతిపక్షాల అభ్యంతరం

న్యూఢిల్లీ: పార్లమెంట్‌ నూతన భవనంపై ప్రధాని మోదీ సోమవారం ఆవిష్కరించిన భారీ జాతీయ చిహ్నం(నాలుగు సింహాల)పై ప్రతిపక్షాలు, చరిత్రకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. జాతీయ చిహ్నాన్ని సైతం మోదీ ప్రభుత్వం వక్రీకరించిందని ఆరోపించారు. అశోక చక్రంపై ఎంతో ఠీవిగా, విశ్వాసంతో కనిపించే సింహాలకు బదులు.. భయపెట్టే, దూకుడు భంగిమలో ఉన్న సింహాల ప్రతిమను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. దీనిని వెంటనే మార్చాలంటూ ప్రధానిని డిమాండ్‌ చేశారు.

‘‘మోదీ జీ, సింహాల ముఖ భంగిమ గమనించండి. ఇది ఘనమైన సార్‌నాథ్‌ చిహ్నమా లేక గిర్‌ సింహానికి వక్రీకరణ రూపమా? పరిశీలించి, అవసరమైన మేరకు మార్పులు చేయండి’’అంటూ లోక్‌సభలో కాంగ్రెస్‌ నేత ఆధిర్‌ రంజన్‌ చౌధురి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ‘‘గంభీరంగా కనిపించే మన జాతీయ చిహ్నం అశోక సింహాలకు అవమానమిది. రాజసానికి బదులుగా గర్జిస్తూ, దూకుడుతో మోదీ మార్కుతో ఉన్న సింహాల ప్రతిమను పార్లమెంట్‌ కొత్త భవనంపై ఏర్పాటు చేయడం సిగ్గుచేటు. వెంటనే మార్చండి’అంటూ టీఎంసీ రాజ్యసభ సభ్యుడు జవహర్‌ సర్కార్‌ ట్విట్టర్‌లో డిమాండ్‌ చేశారు. చరిత్ర కారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ కూడా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘జాతీయ చిహ్నాన్ని స్వతంత్ర భారతంలో 1950లో మనం స్వీకరించాం. ఈ చిహ్నం విషయంలో ప్రస్తుత జోక్యం పూర్తిగా అవాంఛనీయం, అనవసరం. అశోక చక్రంపైని సింహాలు క్రూరంగా, కోపంగా కనిపించాలా?’అని పేర్కొన్నారు. ‘గాంధీ నుంచి గాడ్సే దాకా.. ప్రశాంతంగా, దర్పంగా కూర్చుని కనిపించే మన జాతీయ చిహ్నంలోని సింహాల నుంచి.. పార్లమెంట్‌ నూతన భవనంపై ఆవిష్కరించిన కోపంతో, కోరలు చాచి కనిపించే సింహాల వరకు..ఇదే మోదీ నూతన భారతం’అంటూ సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ వ్యాఖ్యానించారు. 

ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి: బీజేపీ 
పార్లమెంట్‌ నూతన భవనంపైన ఆవిష్కరించి నాలుగు సింహాల ప్రతిమ సార్‌నాథ్‌ స్తంభంపైనున్న సింహాలకు ప్రతిరూపమేనని బీజేపీ పేర్కొంది. నిస్పృహలో ఉన్న ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి కోసం వివాదం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించింది. ప్రధాని మోదీ లక్ష్యంగా ఏదో ఒక అంశాన్ని ప్రతిపక్షాలు ఉపయోగించుకుంటున్నాయని బీజేపీ ప్రతినిధి, రాజ్యసభ ఎంపీ అనిల్‌ బలూని పేర్కొన్నారు. బ్రిటిష్‌ జమానాలో 150 క్రితం నిర్మించిన భవనానికి బదులుగా కొత్తగా పార్లమెంట్‌ భవనాన్ని ఏర్పాటు చేయడమే ప్రతిపక్షాల కడుపుమంటకు కారణమన్నారు.   

మరిన్ని వార్తలు