భావి అవసరాలకనుగుణంగా విద్యుదుత్పత్తి

31 Jul, 2022 06:20 IST|Sakshi

వివిధ జిల్లాల్లో 33,240 మెగా వాట్ల సామర్థ్యంతో 29 పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టులు

2026 నాటికి పోలవరంలో 960 మెగావాట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు చర్యలు

విద్యుత్‌ మహోత్సవం ముగింపు సభలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌

చింతపల్లి గిరిజన లబ్ధిదారుడితో వర్చువల్‌ విధానంలో మాట్లాడిన ప్రధాని మోదీ

సాక్షి, విశాఖపట్నం: భవిష్యత్‌ అవసరాలకనుగుణంగా రాష్ట్రంలో విద్యుదుత్పత్తి జరుగుతోందని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్‌ తెలిపారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ఉజ్వల్‌ భారత్‌–ఉజ్వల్‌ భవిష్యత్తు– విద్యుత్‌ 2047 గ్రాండ్‌ ఫినాలే సదస్సులో వర్చువల్‌ విధానంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. రాష్ట్రం తరఫున విశాఖపట్నంలో ఈ మహోత్సవ్‌ శనివారం జరిగింది. ఈ సందర్భంగా విజయానంద్‌ మాట్లాడుతూ.. విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా రంగాల్లో సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ వినియోగదారులకు 24 గంటల నిరంతర సరఫరా చేస్తున్నామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,800 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యానికి అదనంగా మరో 1,600 మెగావాట్లు 2023 జనవరి నాటికి రానుందన్నారు.

అదేవిధంగా.. 2024–2026 వరకూ వివిధ దశల్లో పోలవరంలో 960 మెగావాట్ల జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జగనన్న కాలనీలకు సంబంధించి 10,067 లేఅవుట్లను విద్యుదీకరించేందుకు రూ.3,483 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. వైఎస్సార్‌ జలకళ పథకంలో భాగంగా రూ.180 కోట్లతో 6,669 బోర్లుకు కనెక్షన్లు ఇస్తున్నామని చెప్పారు. వ్యవసాయ రంగానికి వచ్చే 30 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌ అందించేందుకు సెకీ నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలుకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగాన్ని ప్రోత్సహించేందుకు 33,240 మెగావాట్ల సామర్థ్యం గల 29 పంప్డ్‌ స్టోరేజ్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల్ని వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వ థర్మల్‌ అండ్‌ కోల్‌ కోఆర్డినేషన్‌ జాయింట్‌ సెక్రటరీ పీయూష్‌ సింగ్, ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ సంతోషరావు, ట్రాన్స్‌కో సీఎండీ శ్రీధర్, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు, మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి తదితరులు పాల్గొన్నారు.

విద్యుదీకరణతో ప్రజల జీవితాల్లో గణనీయ మార్పు: ప్రధాని మోదీ
వర్చువల్‌గా పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మారుమూల గ్రామాలకు కూడా విద్యుత్‌ వెలుగులు అందించడమే లక్ష్యంగా.. పాతికేళ్ల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని పథకాల్ని ప్రవేశపెట్టామన్నారు. విద్యుదీకరణ ప్రజల్లో గణనీయమైన మార్పు తెచ్చిందన్నారు. నష్టాల్లో కూరుకుపోతున్నా.. డిస్కంలు సబ్సిడీలు కొనసాగిస్తుండటం భవిష్యత్తులో అంధకారంలోకి నెట్టేసేందుకు సూచికలని అభిప్రాయపడ్డారు. 

విద్యుత్‌ సంస్థలకు 2021–22 నుంచి 2025–26 వరకు మొత్తం రూ.3 లక్షల కోట్లకు పైగా ఆర్థిక సహాయాన్ని అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని తెలిపారు. దీని ద్వారా ఏవరేజ్‌ కాస్ట్‌ ఆఫ్‌ సప్లై – ఏవరేజ్‌ రెవెన్యూ రియలైజ్డ్‌ అంతరాన్ని 2024–25 కల్లా సున్నా స్థాయికి చేర్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామన్నారు. డిస్కంలు, విద్యుత్‌ విభాగాల నిర్వహణ సామర్థ్యాల్ని, ఆర్థిక స్థిరత్వాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా రీవాంప్‌డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సెక్టార్‌æ స్కీమ్‌ని ప్రధాని ప్రారంభించారు. అదేవిధంగా నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్టీపీసీ)కి చెందిన రూ.5,200 కోట్ల విలువైన గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల్ని జాతికి అంకితమిచ్చారు. తెలంగాణలో 100 మెగావాట్ల సామర్థ్యం గల రామగుండం ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్రాజెక్ట్‌తోపాటు దేశంలోని పలు ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.

చింతపల్లి గిరిజనుడితో ప్రధాని ముఖాముఖి..

చింతపల్లి మండలం రత్నగిరి కాలనీకి చెందిన గిరిజన లబ్ధిదారుడు కాగే క్రాంతికుమార్‌తో ప్రధాని మోదీ వర్చువల్‌గా మాట్లాడారు.

ప్రధాని: క్రాంతికుమార్‌ ఎలా ఉన్నావ్‌? 
క్రాంతికుమార్‌: చాలా బాగున్నాను సార్‌ 
ప్రధాని: మీ గురించి చెప్పండి 
క్రాంతికుమార్‌: మాది సుదూర గిరిజన గ్రామం.. చింతపల్లి మండలం రత్నగిరి కాలనీ 
ప్రధాని: మీ ఊరికి కరెంట్‌ రాకముందు, వచ్చిన తర్వాత ఏం తేడా గమనించావు? 
క్రాంతికుమార్‌: గతంలో సూర్యుడి వెలుగు ఉన్నంతవరకే ఏ పనైనా చేసుకునేవాళ్లం. రాత్రిపూట కిరోసిన్‌ దీపాలతో ఇళ్లల్లోనే ఉండేవాళ్లం. చదువు కోసం పిల్లలు చాలా ఇబ్బంది పడేవాళ్లు. దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన కింద మా ఊరికి కరెంట్‌ వచ్చింది. మా జీవితాలు చాలా బాగుపడ్డాయి.  
ప్రధాని: చాలా సంతోషంగా ఉంది. మారుమూల ప్రాంతాలకు కూడా విద్యుత్‌ సౌకర్యం కల్పించినందుకు గర్వపడుతున్నాం. మరింత నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు ప్రయత్నిస్తున్నాం.  
క్రాంతికుమార్‌: థాంక్యూ సార్‌. 

మరిన్ని వార్తలు