కేదార్‌నాథ్‌ ఆలయాన్ని సందర్శించిన ప్రధాని మోదీ

6 Nov, 2021 08:48 IST|Sakshi

భరతమాతకు సైన్యమే సురక్షా కవచం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ  

నౌషెరాలో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు 

నౌషెరా(జమ్మూకశ్మీర్‌): మారుతున్న ప్రపంచం, మారుతున్న యుద్ధ రీతులకు అనుగుణంగా మన సైనిక సామర్థ్యం మెరుగుపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఇందులో భాగంగా దేశ సరిహద్దుల్లో ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నట్లు తెలిపారు. సైనికులను త్వరగా చేరవేయడానికి లద్దాఖ్‌ నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ దాకా, జైసల్మేర్‌ నుంచి అండమాన్‌ నికోబార్‌ దీవుల దాకా అనుసంధానం పెంచుతున్నట్లు వెల్లడించారు. మోదీ గురువారం జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా నౌషెరా సెక్టార్‌లో సైనికులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి పండుగ జరుపుకోవాలని కోరుకుంటారని అన్నారు. తాను ప్రధానమంత్రిగా ఇక్కడికి రాలేదని, సైనికుల కుటుంబ సభ్యుడిగానే వచ్చానని చెప్పారు. 2016 సెప్టెంబర్‌ 29న ఉగ్రవాద శిబిరాలపై నిర్వహించిన సర్జికల్‌ స్ట్రైక్స్‌లో ఇక్కడి బ్రిగేడ్‌ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు.

సర్టికల్‌ స్ట్రైక్స్‌ తర్వాత కూడా ఈ ప్రాంతంలో శాంతిని భగ్నం చేసేందుకు ముష్కరులు ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. వారికి మన సైన్యం దీటుగా జవాబిచ్చిందని కొనియాడారు. భరతమాతకు మన సైనికులే సురక్షా కవచమని అన్నారు. సైనిక బలగాల త్యాగాల వల్ల దేశ ప్రజలు ప్రశాంతంగా నిద్రిస్తున్నారని, సంతోషంగా పండుlగలు జరుపుకుంటున్నారని చెప్పారు. సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిగిన ఆ రోజును తాను ఎప్పటికీ మర్చిపోలేనని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. శత్రు శిబిరాలను నేటమట్టం చేసేందుకు వెళ్లిన మన సైన్యం క్షేమంగా వెనక్కి వచ్చేసిందన్న సమాచారం కోసం ఎంతో ఉత్కంఠతో ఎదురు చూశానని అన్నారు. భారత వీర జవాన్లు ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా అనుకున్నది సాధించి వచ్చారని పేర్కొన్నారు.

రక్షణ బడ్జెట్‌లో 65 శాతం నిధులను మనదేశంలోనే ఖర్చు చేస్తున్నామని చెప్పారు. దేశీయంగా సమకూర్చుకోవాల్సిన 200 రక్షణ ఉత్పత్తుల జాబితా సిద్ధమవుతోందని వివరించారు.  విజయ దశమి సందర్భంగా 7 కొత్త డిఫెన్స్‌ కంపెనీలను ప్రారంభించామని చెప్పారు.  రక్షణ సంబంధిత అంకుర పరిశ్రమల(స్టార్టప్స్‌) స్థాపనకు ముందుకు రావాలని యువతకు ప్రధాని పిలుపునిచ్చారు. దీనివల్ల రక్షణ రంగంలో ఎగుమతిదారుగా భారత్‌ మరింత బలోపేతం అవుతుందన్నారు. సైన్యంలో మహిళల భాగస్వామ్యం పెరగాలని ఆకాంక్షించారు. నౌషెరాలో సైనికులతో కలిసి దీపావళి జరుపుకున్న చిత్రాలను ప్రధాని ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. 130 కోట్ల మంది భారతీయుల సమ్మిళిత ఆత్మకు, దేశ వైవిధ్యానికి మన సైనిక దళాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయని పేర్కొన్నారు. 

ఉత్తరాఖండ్‌ వీరుల గడ్డ 
డెహ్రాడూన్‌/కేదార్‌నాథ్‌: ప్రస్తుత శతాబ్దిలో మూడో దశాబ్దం ఉత్తరాఖండ్‌ రాష్ట్రానిదేనని ప్రధాని మోదీ అన్నారు. రాబోయే రోజుల్లో కనీవినీ ఎరుగని స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరగబోతోందని, ఇతర ప్రాంతాలకు వలసలకు అడ్డుకట్ట పడడం ఖాయమని చెప్పారు. ఆయన శుక్రవారం ఉత్తరాఖండ్‌లో  పర్యటించారు. పునర్నిర్మించిన ఆది శంకరాచార్య సమాధినిప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన మత గురువులను, భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. ప్రాచీన వైభవాన్ని మళ్లీ సాక్షాత్కరింపజేసేందుకు అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరుగుతోందని, కాశీలో విశ్వనాథ్‌ ధామ్‌ ప్రాజెక్టు పనులు ముగింపునకు వచ్చాయని వివరించారు. కేదార్‌నాథ్‌లో రూ.400 కోట్లకు పైగా విలువైన పునర్నిర్మాణ ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.  ఉత్తరాఖండ్‌ వీరుల గడ్డ అని కొనియాడారు. దేశ సరిహద్దుల రక్షణ కోసం ఇక్కడి ప్రజలు ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధపడతారని అన్నారు. కేదార్‌నాథ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 

చదవండి: (పశ్చిమబెంగాల్‌ మంత్రి సుబ్రతా ముఖర్జీ కన్నుమూత) 

మరిన్ని వార్తలు