సిద్ధాంతం కన్నా దేశం మిన్న

13 Nov, 2020 03:51 IST|Sakshi
జేఎన్‌యూలో స్వామి వివేకానంద విగ్రహాన్ని వర్చువల్‌ విధానంలో ప్రారంభిస్తున్న మోదీ

జేఎన్‌యూలో స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ సందర్భంగా ప్రధాని మోదీ వ్యాఖ్య

న్యూఢిల్లీ: దేశ ప్రయోజనాల కన్నా సిద్ధాంతాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు హాని చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. దేశ రాజధానిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) క్యాంపస్‌లో గురువారం స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్రధాని వీడియో కాన్ఫెరెన్స్‌ విధానంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘సైద్ధాంతిక విభేదాలుండొచ్చు. అది సహజమే. అవి దేశ ప్రయోజనాలకు లబ్ధి చేకూర్చేలా ఉండాలి కానీ నష్టపరిచేలా ఉండకూడదు’ అని వ్యాఖ్యానించారు.

జేఎన్‌యూలో నిరంతరం వామపక్ష, హిందుత్వ వాదుల మధ్య ఘర్షణ వాతావరణం ఉంటుందన్న విషయం తెలిసిందే. సైద్ధాంతిక విబేధాలున్న పలు వర్గాలు.. తమ సిద్ధాంతాల పట్ల విశ్వాసం ప్రకటిస్తూనే, ఒక్కటై, ఉమ్మడిగా పోరాటం చేశాయని స్వాతంత్య్ర ఉద్యమం, ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమాలను ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అందువల్ల, దేశ ప్రయోజనాలు, సమగ్రత విషయంలో సైద్ధాంతిక ప్రభావంతో నిర్ణయం తీసుకోవడం హానికరమవుతుందని పేర్కొన్నారు. దేశం పట్ల ప్రేమను, అంకితభావాన్ని స్వామి వివేకానంద విగ్రహం ప్రజలకు నేర్పిస్తుందన్న విశ్వాసం తనకుందని మోదీ వ్యాఖ్యానించారు. స్వామి వివేకానంద కలలు కన్న దృఢమైన, సౌభాగ్యమైన భారతదేశాన్ని నిర్మించేందుకు ఈ విగ్రహం స్ఫూర్తినిస్తుందన్నారు.

21వ శతాబ్దం భారత్‌దేనని 20వ శతాబ్దం ప్రారంభంలోనే స్వామి వివేకానంద చెప్పారని ప్రధాని గుర్తు చేశారు. ఈ విగ్రహం నీడలోనే వివిధ అంశాలపై విద్యార్థులు చర్చలు జరపవచ్చని సూచించారు. ‘ఆత్మ విశ్వాసంతో పాటు అన్ని రంగాల్లో స్వతంత్రత, స్వావలంబన కలిగిన భారత పౌరులను తీర్చిదిద్దేలా మన విద్యా వ్యవస్థ ఉండాలని స్వామి వివేకానంద కోరుకున్నారు. మా ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం ఆ దిశగానే ఉంటుంది’ అన్నారు.  జేఎన్‌యూ క్యాంపస్‌లో స్వామి వివేకానంద విగ్రహాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించడంపై వర్సిటీ విద్యార్థి సంఘం నిరసన తెలిపింది. విగ్రహావిష్కరణ కన్నా ముందు విద్యార్థులు వర్సిటీ నార్త్‌ గేట్‌ వద్ద ‘మోదీ గో బ్యాక్‌’, ‘వి వాంట్‌ ఆన్సర్స్‌’ అనే ప్లకార్డులను ప్రదర్శించారు. ‘స్కాలర్‌షిప్స్‌ రాని విద్యార్థుల గురించి ఆయన ఎందుకు మాట్లాడరు?’ అని జేఎన్‌యూ విద్యార్థి సంఘం నేతలు ఐషె ఘోష్, సాయిబాలాజీ ప్రశ్నించారు.

‘ఆసియాన్‌’తో బంధమే ముఖ్యం
ఇండియా–ఆసియాన్‌ సదస్సులో మోదీ
ఇండియా యాక్ట్‌ ఈస్ట్‌ విధానానికి అనుగుణంగా అసోసియేషన్‌ ఆఫ్‌ సౌత్‌ఈస్ట్‌ ఆసియన్‌ నేషన్స్‌(ఆసియాన్‌)తో తమ బంధం నానాటికీ బలపడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక వారసత్వం ఆధారంగా భారత్‌–ఆసియాన్‌ మధ్య వ్యూహాత్మక బంధం రూపుదిద్దుకుందని పేర్కొన్నారు. గురువారం 17వ భారత్‌–ఆసియాన్‌ వర్చువల్‌ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. వివిధ కీలక రంగాల్లో సహకారం కోసం ప్రవేశపెట్టిన నూతన ఆసియాన్‌–ఇండియా కార్యాచరణ ప్రణాళిక 2021–2025ను శిఖరాగ్ర సదస్సులో నేతలు స్వాగతించారు. కోవిడ్‌ ఆసియాన్‌ రెస్పాన్స్‌ ఫండ్‌కు మిలియన్‌ డాలర్లు ఇవ్వనున్నట్లు  ప్రకటించారు. ఆసియాన్‌ దేశాలతో భారత్‌ అనుసంధానం కోసం లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ కింద బిలియన్‌ డాలర్లు అందజేయనున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు