భౌతిక దూరం లేదు..!

14 Jul, 2021 03:27 IST|Sakshi

ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోవడంపై ప్రధాని ఆందోళన

ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమీక్ష

న్యూఢిల్లీ: హిల్‌ స్టేషన్లలో పర్యాటకులు, మార్కెట్లలో వినియోగదారులు కోవిడ్‌ నిబంధనలు పాటించకుండా గుంపులు,గుంపులుగా తిరుగుతుం డడంపై ప్రధాని నరేంద్రమోదీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా ధర్డ్‌ వేవ్‌ను విజయవంతంగా అడ్డుకోవాలంటే ప్రజలు నిర్లక్ష్యం వీడి, అత్యంత అప్రమత్తతతో ఉండాలని కోరారు. జాగ్రత్తగా ఉంటే మూడో వేవ్‌ను అడ్డుకోగలుగుతామన్నారు.

ఎనిమిది ఈశాన్య రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ మంగళవారం ఆయా రాష్ట్రాల్లో చేపడుతున్న కరోనా కట్టడి చర్యలపై వర్చువల్‌గా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ప్రధాని తెలిపారు. ‘భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లను ధరించడం, టీకా వేసుకోవడం ద్వారా నివారణ.. అనుమానితులను గుర్తించడం, పరీక్షలు జరపడం, వైద్యం అందించడం ద్వారా చికిత్స.. కరోనా కట్టడిలో ఇది విజయవంతమైన వ్యూహం’ అని వ్యాఖ్యానించారు.

‘కరోనాతో పర్యాటకం, వ్యాపారం దెబ్బతిన్నమాట వాస్తవమే కానీ.. హిల్‌ స్టేషన్లలో, మార్కెట్లలో ప్రజలు మాస్క్‌లు లేకుండా తిరగడం సరికాదు’ అని పేర్కొన్నారు. థర్డ్‌ వేవ్‌ రావడానికి ముందే ఎంజాయ్‌ చేయాలనుకునే ధోరణిని ప్రధాని తప్పుబట్టారు. థర్డ్‌ వేవ్‌ దానికదే రాదని, మన నిర్లక్ష్యం వల్లనే వస్తుందన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. టీకాలపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించాలని ప్రధాని సీఎంలను కోరారు.  

ఇటీవల కేంద్రం ప్రకటించిన సుమారు 23 వేల కోట్ల ప్యాకేజీతో ఈశాన్య ప్రాంతంలోనూ వైద్య వసతులను మరింత మెరుగుపర్చాలన్నారు.   ఈ సమావేశంలో అస్సాం, నాగాలాండ్, త్రిపుర, మేఘాలయ, సిక్కిం, మణిపుర్, అరుణాచల్‌ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల ముఖ్యమంత్రులు  పాల్గొన్నారు. కాగా, ప్రధాని ఈనెల 16న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, కేరళ సీఎంలతో కోవిడ్‌పై సమీక్షాసమావేశం నిర్వహించనున్నారు.

మరిన్ని వార్తలు