భద్రత రికార్డులను భద్రపరచండి

7 Jan, 2022 13:24 IST|Sakshi

పంజాబ్, హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్‌కు సుప్రీంకోర్టు ఆదేశం

పీఎం ఫిరోజ్‌పూర్‌ పర్యటనలో భద్రతా ఉల్లంఘనపై విచారణ

న్యూఢిల్లీ: పంజాబ్‌లో ప్రధాని మోదీ బుధవారం నాటి పర్యటనలో భద్రతా వైఫల్యం ఘటనకు సంబంధించి అన్ని రికార్డులను తక్షణమే భద్రపరచాలని పంజాబ్‌ హరియాణా హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రధానికి చేసిన రక్షణా ఏర్పాట్లకు సంబంధించి పోలీసులు, కేంద్ర రక్షణ, నిఘా సంస్థల నుంచి అన్ని రకాల వివరాలను సమీకరించి భద్రపరచాలని సూచించింది. ఘటనపై విచారణకు ఏర్పాటు చేసిన కమిటీల పరిశోధనను సోమవారం వరకు నిలిపివేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఫిరోజ్‌పూర్‌ ఘటనపై లాయర్స్‌ వాయిస్‌ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆధ్వర్యంలోని ధర్మాసనం విచారించింది.

ఇది ప్రధాని భద్రతకు సంబంధించిన అంశమని గుర్తించి సంబంధిత రికార్డులన్నిటినీ భద్రపరచమని హైకోర్టు రిజిస్ట్రార్‌ను సుప్రీం ఆదేశించింది. రిజిస్ట్రార్‌కు  చండీగఢ్‌ డీజీపీ, జాతీయ భద్రతా సంస్థకు చెందిన ఐజీ ర్యాంకుకు తగ్గని అధికారి సహకరించాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. రిజిస్ట్రార్‌ జనరల్‌కు రికార్డుల అందజేత విషయంలో పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర, కేంద్ర ఏజెన్సీలను ఆదేశించింది. ఫిరోజ్‌పూర్‌ ఘటన ఉద్దేశపూర్వక కుట్రని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్య కార్యదర్శి, డీజీపీలు బాధ్యతలు మరిచారని పిటిషనర్‌ తరఫు లాయర్‌ వాదించారు. సీఎస్, డీజీపీపై తగిన చర్యలు(సస్పెన్షన్‌) తీసుకోవాలని కోరారు. అధికారిక రికార్డుల మార్పిడి జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సుప్రీంను కోరారు.  

మాకు ఓకే
జరిగిన ఘటనపై లోతైన విచారణ జరపాలన్న పిటిషనర్‌ డిమాండ్‌పై తమకు అభ్యంతరం లేదని సుప్రీంకోర్టుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపాయి. పంజాబ్‌ పోలీసులు రూట్‌ క్లియర్‌ చేసిన తర్వాతే ప్రధాని కాన్వాయ్‌ బయలుదేరిందని కేంద్రం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. ప్రధాని పర్యటనకు ముందే సిక్స్‌ ఫర్‌ జస్టిస్‌ అనే నిషేధిత సంస్థ చైర్మన్‌ పన్ను ఒక వీడియోను సర్క్యులేట్‌ చేసిన విషయాన్ని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు. అందువల్ల ఈ ఘటనలో అంతర్జాతీయ ఉగ్రవాద కోణం ఉండే అవకాశం ఉందని, కనుక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) జోక్యం అవసరమేనని చెప్పారు. ఘటనకు సంబంధించిన మొత్తం రికార్డులను ఎన్‌ఐఏ అధికారి సహకారంతో ఒక స్వతంత్ర వ్యక్తి సేకరించి భద్రపరిచేలా ఆదేశించాలన్నారు. ఇది ఒక ప్రత్యేక ఘటనని, అంతర్జాతీయంగా సిగ్గుపడేలా చేసిందన్నారు.

  రోడ్డు దిగ్భంధంపై స్థానిక పోలీసులు ముందుగా వార్నింగ్‌ వాహనంలోని వారికి సమాచారమివ్వలేదన్నారు. ఫ్లైఓవర్‌కు రెండో వైపు నిరసనకారులు చేరి ఉంటే పరిస్థితి విషమించేదన్నారు. ఇది సీరియస్‌ సంఘటనని తాము కూడా అంగీకరిస్తున్నట్లు పంజాబ్‌ అడ్వకేట్‌ జనరల్‌ పట్వాలియా తెలిపారు. పిటిషన్‌లోని అంశాలపై భేదాభిప్రాయమున్నా, ఘటనను తేలిగ్గా తీసుకోవడం లేదన్నారు. దీనితో ఎవరైనా అధికారులకు సంబంధం ఉంటే వారు విచారణ ఎదుర్కోక తప్పదన్నారు. ఘటనపై ఎలాంటి విచారణకు కోర్టు ఆదేశించినా అభ్యంతరం లేదన్నారు. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ అంతర్గతమైనదని, అందువల్ల దాని విచారణ కొనసాగించే అవకాశమివ్వమని కోర్టును తుషార్‌ కోరారు. అయితే కేంద్ర కమిటీలో సురేశ్‌ ఉండకూడదని రాష్ట్ర న్యాయవాది విజ్ఞప్తి చేశారు.  

ఫిరోజ్‌పూర్‌కు కేంద్ర బృందం
ప్రధాని భద్రతా లోపంపై విచారణకు కేంద్రం నియమించిన త్రిసభ్య కమిటీ శుక్రవారం ఫిరోజ్‌పూర్‌ ఫ్లై ఓవర్‌ను పరిశీలించింది. ఈ ఘటనపై కేంద్రానికి పంజాబ్‌ ప్రభుత్వం నివేదిక అందజేసింది. ఫిరోజ్‌పూర్‌ ఘటనలో గుర్తుతెలియని 150 మంది నిరసనకారులపై పంజాబ్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.  కాగా, శుక్రవారం ప్రత్యక్షంగా హాజరవ్వాలని ప్రధాని పర్యటనతో సంబంధమున్న పలువురు అధికారులకు కేంద్ర బృందం ముందే సమన్లు జారీ చేసింది. ఈ విచారణకు పంజాబ్‌ డీజీపీ సిద్ధార్ధ్‌ చటోపాధ్యాయ హాజరవలేదు.

ఆగని విమర్శల పర్వం
ఫిరోజ్‌పూర్‌ ఘటనపై ఆయా పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పంజాబ్‌లో చన్నీ ప్రభుత్వాన్ని డిస్మిస్‌ చేసి రాష్ట్రపతి పాలన పెట్టాలని హరియాణా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ డిమాండ్‌ చేశారు. ప్రధాని పర్యటనలో భద్రతాలోపాలు కల్పించడం ద్వారా కాంగ్రెస్‌ కుట్రపూరిత బుద్ధి బయటపడిందని  కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ విమర్శించారు. ఘటనపై కాంగ్రెస్‌ అగ్రనా యకత్వం ఎందుకు మౌనం వహిస్తోందని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ప్రశ్నించారు.

మరోవైపు మోదీ హాజరవ్వాల్సిన ర్యాలీకి అతి తక్కువ మంది హాజరైన విషయం తెలిస్తే పరువు పోతుందని పసిగట్టే బీజేపీ ఈ భద్రతాలోపం నాటకం ఆడుతోందని పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ నవ్‌జ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఆరోపించారు. పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన విధించేందుకు జరుగుతున్న కుట్రలో భాగంగానే ఈ సంఘటన జరిగిందని పంజాబ్‌ సీఎం చన్నీ ఆరోపించారు. ప్రధానిని ర్యాలీ వద్దకు చేరకుండా రైతులు అడ్డుకోకుండా ఉండాల్సిందని, అప్పుడు ఖాళీ కుర్చీలు చూసి ప్రధాని సంతోషపడేవారని, వాటిని ఉద్దేశించి ప్రసంగించేవారని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ ఎద్దేవాచేశారు. గతంలో తన సభకు కేవలం 25 మంది వచ్చినా తాను వెళ్లి, వారితో మాట్లాడాకే వెనుతిరిగానన్నారు.

ఉల్లంఘనకు మరో నిదర్శనం..
బుధవారం ప్రధాని కాన్వాయ్‌ పంజా బ్‌లోని ఫ్లైఓవర్‌పై నిలిచిపోయినప్పుడు చాలా దగ్గరగా కొందరు బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్న వీడియో ఒకటి మీడియా లో ప్రత్యక్షమైంది. వారు ‘బీజేపీ జిందాబాద్‌’ అని నినాదాలు చేస్తుండగా ప్రధాని కారును ఎస్‌పీజీ సిబ్బంది కవచంలాగా ఏర్పడి తరలించడం వీడియోలో కనిపించింది. బుధవారం ప్రధాని భద్రతా ఏర్పాట్ల ఉల్లం ఘనకు ఇది మరో ఉదాహరణ అని నిపుణులు అభిప్రాయపడ్డారు. మరోవైపు ప్రధాని కాన్వాయ్‌కు కొంత దూరంలో రైతులున్న వీడియో సైతం తాజాగా మీడియాలో షేర్‌ అవుతోంది. తమకన్నా బీజేపీ కార్యకర్తలే ప్రధాని కారుకు దగ్గరగా ఉన్నారని కొందరు రైతులు ఆరోపించారు.

చదవండి: నీట్‌ పీజీ కౌన్సిలింగ్‌కు సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

మరిన్ని వార్తలు