‘పాక్‌ ప్రకటనతో వారి నిజస్వరూపం బయటపడింది’

31 Oct, 2020 12:24 IST|Sakshi

గాంధీనగర్‌/కేవాడియా: గతేడాది పుల్వామాలో సీఆర్పీఎఫ్‌ జవాన్లపై జరిగిన ఉగ్రదాడి సమయంలో ప్రతిపక్షాలు దారుణంగా వ్యవహరించాయని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. దేశం తన బిడ్డలను కోల్పోయిన బాధలో ఉంటే.. కొందరు మాత్రం తమ స్వార్థం చూసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పుల్వామా దాడి గురించి పాకిస్తాన్‌ మంత్రి తమ పార్లమెంట్‌లో చేసిన ప్రకటనతో మన ప్రతిపక్షాల నిజస్వరూపం ఏంటో జనాలకు తెలిసింది అన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని కేవడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద మోదీ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ఈ రోజు ఇక్కడ పరేడ్‌ నిర్వహించిన అధికారులను చూస్తే.. నా మదిలో పుల్వామా దాడి ఘటన మెదిలింది. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలను ఎన్నటికి మరువం. దేశం బిడ్డలను కోల్పోయి బాధపడుతుంటే.. కొందరు మాత్రం స్వార్థపూరితంగా ప్రవర్తించారు’ అన్నారు. (చదవండి: పాక్‌లో ‘పుల్వామా’ చిచ్చు)

‘పుల్వామా దాడిలో కూడా తమ లాభాన్నే చూసుకున్నారు. ఆనాడు వారు చేసిన వ్యాఖ్యలను దేశం మరవదు. వారి ఆరోపణలను నేను మౌనంగా భరించాను. రాజకీయ లబ్ధి కోసమే వారు ఇదంతా చేస్తున్నారని నాకు తెలుసు. కాన ఇప్పుడు పాకిస్తాన్‌ తమ పార్లమెంట్‌లో చేసిన ప్రకటనతో నిజం బయటపడింది. దాంతో ఈ ఘటనపై రాజకీయాలు చేసిన వారి నిజస్వరూపం కూడా బయటపడింది. ఈ సందర్భంగా నేను కోరేది ఒక్కటే.. దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి రాజకీయాలు చేయకండి’ అన్నారు మోదీ. ఉగ్రవాదంపై భారత్‌ నిరంతర పోరు సాగిస్తుందని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలన్నీ ఏకమై పోరాడాలని  పిలుపునిచ్చారు. ఉగ్రవాదం, హింసతో ఏ ఒక్కరూ ప్రయోజనం పొందలేరని పరోక్షంగా పాక్‌కు చురకలంటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీర సైనికుల త్యాగాలను దేశం ఎప్పటికీ మరువదని మోదీ పేర్కొన్నారు

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా