‘ఇంటింటికి వెళ్లండి.. మత పెద్దల సాయం తీసుకోండి’

4 Nov, 2021 01:26 IST|Sakshi

ఇంటింటికీ టీకా  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు 

వ్యాక్సినేషన్‌లో వెనుకంజలో ఉన్న జిల్లాల కలెక్టర్లతో సమీక్షా సమావేశం 

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఇంటింటికీ తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ అన్నారు. ప్రధాని మోదీ బుధవారం జార్ఖండ్, మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం మందకొడిగా సాగుతున్న 40కి పైగా జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. వ్యాక్సినేషన్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా టీకా పట్ల ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయని, పుకార్లు సైతం వ్యాపిస్తున్నాయని అన్నారు. అందుకే వారు టీకా తీసుకొనేందుకు చాలామంది ముందుకు రావడం లేదని వెల్లడించారు. టీకాపై సంపూర్ణంగా అవగాహన కల్పించడమే దీనికి పరిష్కార మార్గమని అన్నారు. ఈ విషయంలో మత గురువుల సహాయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. 

రెండో డోసు తీసుకోకపోతే... 
కరోనా వ్యాక్సినేషన్‌లో వ్యూహం మార్చాలని, ప్రజలను టీకా కేంద్రాలకు రప్పించడం కాకుండా, టీకాలనే ఇంటింటికీ తీసుకెళ్లాలని ప్రధాని మోదీ ఉద్బోధించారు. ‘హర్‌ ఘర్‌ టీకా, ఘర్‌–ఘర్‌ టీకా’ అనే నినాదం స్ఫూర్తితో ప్రతి ఇంటికీ వెళ్లాలని ఆరోగ్య కార్యకర్తలను కోరారు. ‘ప్రతి ఇంటి తలుపునూ తట్టడం’ అనే నినాదాన్ని అందిపుచ్చుకొని ప్రజలకు టీకా రెండు డోసులూ ఇవ్వాలని, వ్యాక్సినేషన్‌ను విజయవంతం చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. మొదటి డోసు తర్వాత నిర్దేశిత గడువులోగా రెండో డోసు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. గడువులోగా రెండో డోసు తీసుకోనివారిని గుర్తించి సంప్రదించాలని చెప్పారు. 

(చదవండి: జోగిపేట: ఫొటోకు పోజు కోసం.. వృద్ధురాలికి ఒకేసారి రెండు డోసులు )

ఇప్పటిదాకా పంపిణీ చేసిన టీకా డోసులు 100 కోట్లు దాటేశాయని, ముఖ్యమైన మైలురాయిని దాటామని, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని దీపావళి పండుగను ఆనందంగా జరుపుకుందామని ప్రధానమంత్రి చెప్పారు. వ్యాక్సినేషన్‌లో కొత్త లక్ష్యాలను సాధించి, క్రిస్మస్‌ వేడుకలు నిర్వహించుకుందామని అన్నారు. మోదీతో జరిగిన సమీక్షా సమావేశంలో జిల్లా మేజిస్ట్రేట్లు తమ అభిప్రాయాలను వెల్లడించారు. తమ జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ నెమ్మదిగా సాగుతుండడడానికి గల కారణాలను, తమకు ఎదురవుతున్న సవాళ్ల గురించి తెలియజేశారు.  

చదవండి: 50 లక్షల మంది బలి

మరిన్ని వార్తలు