Gujarat Bridge Tragedy: మోర్బీ ఆసుపత్రికి ప్రధాని.. అర్థరాత్రి హంగామా.. ఆగమేఘాల మీద మరమ్మతులు

1 Nov, 2022 11:10 IST|Sakshi

మోర్బీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు(మంగళవారం) మోర్బీకి వెళ్లి ఘటనా స్థలాన్ని పరిశీలించనున్నారు. తీగల వంతెన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శించనున్నారు. దుర్ఘటన నుంచి ప్రాణాలతో బయటపడి మోర్బీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలవనున్నారు. అయితే మోదీ సందర్శన నేపథ్యంలో అధికారులు ఆగమేఘాల మీద ఆసుపత్రిలో మరమ్మతులు చేపట్టారు. సోమవారం అర్థరాత్రి హడావిడీ సృష్టించి ఆసుపత్రికి మెరుగులు దిద్దారు.

ఆసుపత్రి గోడలు, పైకప్పు భాగాలకు పెయింట్‌ వేశారు. టైల్స్‌ మార్చారు. కొత్త కూలర్‌లను తీసుకువచ్చారు. వంతెన దుర్ఘటనలో గాయపడిన 13 మందిని చేర్చుకున్న రెండు వార్డులలో బెడ్‌షీట్‌లు ఉన్నపళంగా మార్చేశారు. సిబ్బంది అంతా అర్థరాత్రి ప్రాంగణాన్ని ఊడ్చి క్లీన్‌గా చేశారు. మొత్తంగా ఆసుపత్రిని తళతళ ​మెరిసేలా చేశారు.

కాగా ఆసుపత్రికి మెరుగులు దిద్దుతున్న దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. పాడైన గోడలు, పెచ్చులూడిన పైకప్పుకు పెయింటింగ్‌ వేయడం వంటి ఫోటోలు చూస్తుంటే ఆసుపత్రిలో అంతకుముందు పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పేందుకు అద్దం పడుతుంది.
చదవండి: మోర్బీ బ్రిడ్జి దుర్ఘటన.. స్పందించిన జో బైడెన్‌, కమలా హారిస్‌

అయితే కేవలం మోదీ సందర్శన ముందు ఆసుపత్రి పునర్నిర్మాణ పనులు చేపట్టడం విమర్శలకు తావిస్తోంది. ఆసుపత్రి దృశ్యాలను షేర్‌ చేస్తూ.. గుజరాత్‌ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు కాషాయ పార్టీపై విరుచుకుపడ్డాయి. ప్రధానమంత్రికి ఫోటోషూట్ కోసం బీజేపీ ఈవెంట్ మేనేజ్‌మెంట్‌లో బిజీగా ఉందని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ట్విటర్‌ వేదికగా వ్యంగ్యసత్రాలు ఎక్కుపెట్టాయి.

ఓ పక్క బ్రిడ్జి కూలిన విషాద ఘటనలో వందలాది మంది చనిపోతే మరో పక్క మోదీ ఫోటోషూట్‌లో ఎలాంటి లోపం లేదని నిర్ధారించడానికి మరమ్మతు పనులు జరుగుతున్నాయని మండిపడ్డాయి. మోదీ కోసం పెయింటింగ్‌ వేస్తూ, టైల్స్‌ను మెరిపిస్తూ బిజీగా ఉన్న వారికి సిగ్గు లేదని ఆగ్రహం వ్యక్తం చేశాయి. గత 27 ఏళ్లగా బీజేపీ సరిగా పని చేసి ఉంటే, అర్ధరాత్రి ఆసుపత్రిని అలంకరించాల్సిన అవసరం లేదని సెటైర్లు వేశాయి.

గుజరాత్‌లో మోర్బీ కేబుల్‌ బ్రిడ్జి కూలిన పెను విషాద ఘటన దేశ ప్రజలను విస్మయానికి గురిచేసిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 140 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వారిలో చిన్నారులు, మహిళలే ఎక్కువగా ఉండటం మరింత బాధకర విషయం.మరో 100 మంది గాయాలపాలయ్యారు. నదిలో గల్లంతైన వారికోసం సంఘటనా ప్రాంతంలో ఇంకా గాలింపు చర్చలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. ఇప్పటి వరకు దీనితో సంబంధం ఉన్న 9 మందిని అరెస్ట్‌ చేశారు. బ్రిడ్జి నిర్వహణ కాంట్రాక్టు పొందిన ఒరివా కంపెనీపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

మరిన్ని వార్తలు