ఢిల్లీ అల్లర్లు : అరెస్టుల ప్రక్రియ షూరూ

14 Sep, 2020 08:47 IST|Sakshi

సీఏఏ వ్యతిరేక ఉద్యమం: ఉమర్‌ ఖలీద్ అరెస్ట్‌

మరికొంతమంది అరెస్ట్‌కు అవకాశం

జాబితాలో సీతారాం ఏచూరి పేరు..!

సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పెను ప్రకంపనలు రేపిన ఈశాన్య ఢిల్లీ అలర్ల కేసు విచారణను ఢిల్లీ పోలీసులు మరింత వేగవంతం చేశారు. సీఏఏ-ఎన్‌ఆర్‌సీ చట్టాలకు వ్యతిరేకంగా సాగిన ఉద్యమం హింసాత్మకంగా మారడంతో 53 మంది పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే రెచ్చగొట్టే ప్రసంగాలతో, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అల్లర్లకు ప్రేరేపించారని ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. దీనిలో భాగంగానే ప్రధాన ఆరోపనలు ఎదుర్కొంటున్న జవహర్‌లాల్‌ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థిసంఘం మాజీ నాయకుడు. యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ కార్యకర్త ఉమర్‌ ఖలీద్‌ను ఆదివారం అర్థరాత్రి అరెస్ట్‌ చేశారు. తన కుమారుడిని అక్రమ చట్టం కింద పోలీసులు అరెస్ట్‌ చేశారని ఖలీద్‌ తండ్రి సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించారు. మరోవైపు ఆయన అరెస్ట్‌ను నిర్ధారిస్తూ ఢిల్లీ పోలీస్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈశాన్య ఢిల్లీలో చెలరేగిన హింసకు బాధ్యులుగా భావిస్తూ చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద అరెస్ట్‌ చేసినట్లు వెల్లడించారు. (చార్జిషీట్‌లో పలువురు ప్రముఖులు)

మరోవైపు ఈ అల్లర్లలో పలువురు భాగస్వామ్యూలను చేస్తూ ఢిల్లీ పోలీసులు ఇటీవల ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిలో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితో పాటు ప్రఖ్యాత ఆర్థికవేత్త జయతి ఘోష్, ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ అపూర్వానంద్, స్వరాజ్ అభియాన్ నాయకుడు యోగేంద్ర యాదవ్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ రాహుల్ రాయ్‌ కూడా ఉన్నారు. వీరితోపాటు భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్, యునైటెడ్ ఎగైనెస్ట్ హేట్ కార్యకర్త ఉమర్ ఖలీద్ ముస్లిం సమాజానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్, ఎమ్మెల్యే అమన్నతుల్లా ఖాన్ వంటి కొందరు నాయకుల పేర్లను కూడా ప్రస్తావించినట్లు చార్జిషీట్ పేర్కొంది. జేఎన్‌యు విద్యార్థులు దేవంగన కాలిత, నటాషా నార్వాల్, జామియా మిలియా ఇస్లామియాకు చెందిన గుల్ ఫిషా ఫాతిమా వాంగ్మూలం ఆధారంగా వీరిని నిందితులుగా చేర్చినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. (ఢిల్లీ అల్ల‌ర్లు: జామియా విద్యార్థినికి బెయిల్‌)

అయితే దేశ వ్యతిరేక కుట్ర పేరుతో ఏచూరిని కూడా ఆజాబితాలో చేర్చడంపై దేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన పోలీసులు ఛార్జ్‌షీట్‌లో ఆయన పేరులేదని తెలిపినట్లు సమాచారం. అయితే మిగతా వారిని కూడా విచారణ నిమిత్తం ముందుగానే నోటీసులు జారీచేసి అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 23-26 మధ్య ఈశాన్య ఢిల్లీలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేక ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా  జరిగిన హింసలో 53 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఓవైపు పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న తరుణంలో అరెస్ట్‌ల ప్రక్రియను ప్రారంభించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 
  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు