పార్కులో కూర్చుంటే జరిమానా 

1 Feb, 2023 08:35 IST|Sakshi

సాక్షి, కృష్ణరాజపురం: మా సేవలు ఊరికే రావు. ప్రజలకు భద్రత కల్పించాలంటే.. చాలా ఖర్చవుతుంది అన్నట్టుగా ఉంది కొందరు ఖాకీల వ్యవహారశైలి. వారి వల్ల నిజాయతీగా పనిచేసేవారిని కూడా అనుమానంతో చూసే పరిస్థితి నెలకొంది. ఐటీ సిటీలో సంపిగెహళ్లి, ఆడుగోడి పోలీసులు ప్రజల నుంచి డబ్బు తీసుకోవడం రచ్చ కావడం మరిచిపోకముందే మరో సంఘటన చోటుచేసుకుంది. ఉద్యానవనంలో కూర్చుని ఉన్న స్నేహితులను ఓ కానిస్టేబుల్‌ బెదిరించి వారి వద్ద నుంచి రూ. 1000 వసూలు చేశాడు.  

ఫొటోలు తీసి, డబ్బు ఇవ్వాలని..  
వివరాలు.. జనవరి 29వ తేదీన నగరంలోని వైట్‌ఫీల్డ్‌ వద్ద కుందళహళ్లిలో ఉన్న ఉద్యానవనంలో  ఆర్ష లతీఫ్‌ అనే యువతి, స్నేహితునితో కూర్చుని ఉంది. కులాసాగా మాట్లాడుకుంటూ ఉండగా ఒక కానిస్టేబుల్‌ వచ్చి వారిని తన మొబైల్‌తో ఫొటోలు తీయసాగాడు. ఇక్కడ పార్కులో ఏం చేస్తున్నారు?, ఇక్కడ ఉండడానికి అనుమతి లేదు అని వారిని గదమాయించాడు. తాము ఏమీ చేయడం లేదని, ఊరికే కూర్చుని ఉన్నామని చెప్పారు.

పార్క్‌లో కూర్చోడానికి కూడా పర్మిషన్‌ కావాలా? అని యువతీ యువకుడు అడిగారు. దాంతో కానిస్టేబుల్‌.. ఏమిటీ రూల్స్‌ మాట్లాడుతున్నారు? రండి స్టేషన్‌కు వెళదాము, అక్కడ అన్నీ బయటకి వస్తాయని బెదిరించారు. ఇక్కడే అయితే రూ. వెయ్యి జరిమానా కట్టి వెళ్లిపోండి. స్టేషన్‌కు వస్తే మీకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించి, వారి వద్ద నుంచి రూ . వెయ్యి ఫోన్‌ పే ద్వారా వేయించుకున్నాడు. తరువాత తమ బాధాకర అనుభవం ఇదీ యువతి సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టి పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ బాగోతంపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సదరు పోలీస్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు.   

(చదవండి: వధువు కావాలా.. నాయనా?)

మరిన్ని వార్తలు